పిడుగుపాటుకు ఎంపీటీసీ మృతి

ABN , First Publish Date - 2022-04-26T07:40:36+05:30 IST

పిడుగుపాటుకు వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు మరణించారు.

పిడుగుపాటుకు ఎంపీటీసీ మృతి

  • అల్లూరి జిల్లా టీపీవీడు గ్రామంలో విషాదం
  • నంద్యాల జిల్లాలో రైతు కూడా..

ఎటపాక, రుద్రవరం, ఏప్రిల్‌ 25: పిడుగుపాటుకు వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు మరణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో పిడుగు పడి టీపీవీడు గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు చండ్రు శ్రీదేవి(36) సజీవ దహనమయ్యారు. సీతాపురం గ్రామంలో నివసిస్తున్న శ్రీదేవి సోమవారం ఏజెన్సీలోని గౌరిదేవిపేట గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని కుటుంబసభ్యులు, బంఽధువులతో ఆనందంగా గడిపారు. అక్కడి నుంచి ఇంటికి చేరిన కొద్దిసేపటికే గాలి దుమారం వీచింది. వానలేదు, ఉరుములు, మెరుపులు లేవు. గాలిదుమారమే కదా అని ఇంటికి కొద్దిదూరంలో ఉన్న మిర్చి కల్లం వద్దకు ఆమె వెళ్లారు. తిరిగి ఇంట్లోకి వస్తుండగా అకస్మాత్తుగా ఆమెపై పిడుగుపడింది. గుర్తుపట్టలేనంతగా శరీరమంతా కాలిపోయింది. ఆమెపై పిడుగు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


గతేడాది నవంబరు 18న ఆమె టీడీపీ తరఫున టీపీవీడు ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. అందరితో కలుపుగొలుగా ఉండే ఆమె మృతి చెందడం పలువురిని వేదనకు గురిచేసింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండ పంచాయతీ మజరా కొత్తూరు గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు రైతు దూదేకుల ముసల రంగయ్య(44) మరణించారు. గ్రామానికి చెందిన రంగయ్య కొర్ర పంటను యంత్రంతో కోత కోయించిన తరువాత కర్రలు ఏరేందుకు పొలం వద్దకు వెళ్లారు. ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. రంగయ్య సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి నిలబడగా అదే చెట్టుపై పిడుగు పడింది. కుప్పకూలిన రంగయ్యను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2022-04-26T07:40:36+05:30 IST