ఏసీబీ వలలో ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్త

ABN , First Publish Date - 2021-03-03T08:43:28+05:30 IST

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో ఓ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శితో పాటు గ్రామ సర్పంచ్‌ భర్త చిక్కారు.

ఏసీబీ వలలో ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్త

2.70 లక్షల లంచం తీసుకుంటుండగా అరెస్టు

నిర్మల్‌ టౌన్‌, మార్చి 2: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో ఓ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శితో పాటు గ్రామ సర్పంచ్‌ భర్త చిక్కారు. నిర్మల్‌ రూరల్‌ మండలం అనంతపేట్‌ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాసరావుకు గ్రామ శివారులో 13 ఎకరాల భూమి ఉంది. అందులో లేఅవుట్‌ కోసం హైదరాబాద్‌లో డీటీసీపీ ఉన్నతాధికారులను ఆయన సంప్రదించారు. అక్కడ అనుమతులు రావడంతో.. గ్రామంలోని పంచాయతీ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌గా 15 శాతం మార్ట్‌గేజ్‌ చేయడానికి పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అనుమతులు ఇవ్వాలంటే తమకు ఒక ఫ్లాట్‌, రూ.3 లక్షల నగదు ఇవ్వాలని శ్రీనివాసరావును ఎంపీవో శ్రీనివా్‌సరెడ్డి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ , అనంత్‌పేట్‌ గ్రామ సర్పంచ్‌ భర్త నేరెళ్ల అశోక్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. మంగళవారం నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో, పంచాయతీ కార్యదర్శితో పాటు గ్రామ సర్పంచ్‌ భర్తకు శ్రీనివాసరావు రూ.2 లక్షల 70 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - 2021-03-03T08:43:28+05:30 IST