ఐపీఎల్‌కు రెడీ అవుతున్న ధోనీ.. కరోనా పరీక్షల్లో నెగటివ్!

ABN , First Publish Date - 2020-08-14T01:37:11+05:30 IST

వచ్చే నెల 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్

ఐపీఎల్‌కు రెడీ అవుతున్న ధోనీ.. కరోనా పరీక్షల్లో నెగటివ్!

చెన్నై: వచ్చే నెల 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ త్వరలోనే సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నాడు. చెన్నై వెళ్లడాని కంటే ముందు కరోనా పరీక్షల కోసం ధోనీ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తన స్వాబ్ శాంపిళ్లు ఇచ్చాడు. పరీక్షల్లో కరోనా నెగటివ్ అని రావడంతో చెన్నై వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఐపీఎల్ పాలక మండలి నిర్దేశించిన ఎన్ఓ‌పీ పరీక్షను ధోనీ చేయించుకోవాల్సి ఉంటుంది. 


బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం.. కరోనా పరీక్షల్లో ప్రతి ఆటగాడికి రెండుసార్లు నెగటివ్ ఫలితాలు రావడం తప్పనిసరి. ఎవరికైనా కరోనా సోకినట్టు తేలితే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత రెండుసార్లు కరోనా టెస్టు చేయించుకోవాలి. ఆ రెండు పరీక్షల్లోనూ నెగటివ్ వస్తేనే యూఏఈ వెళ్లేందుకు అనుమతిస్తారు.  


ఈ నెల 15 నుంచి 20 వరకు ఆరు రోజులపాటు చెన్నైలో కండిషనింగ్ క్యాంపు జరగనుంది. ధోనీ, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు వంటి వారు ఇందులో పాల్గొననున్నారు. రవీంద్ర జడేజా మాత్రం శిక్షణకు హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. ఈ నెల 21న అతడు చెన్నై చేరుకుంటాడని తెలుస్తోంది. అలాగే దక్షిణాఫ్రికా ఆటగాళ్లయిన లుంగి ఎంగిడి, ఫా డుప్లెసిస్‌లు సెప్టెంబరు 1 నాటికి యూఏఈ చేరుకుంటారని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. 

Updated Date - 2020-08-14T01:37:11+05:30 IST