కాళేశ్వరం జోన్‌ పరిధిలో ములుగు

ABN , First Publish Date - 2021-04-21T05:48:11+05:30 IST

కాళేశ్వరం జోన్‌ పరిధిలో ములుగు

కాళేశ్వరం జోన్‌ పరిధిలో ములుగు
ములుగు జిల్లా కేంద్రం వ్యూ

మెరుగుపడనున్న ఉద్యోగావకాశాలు

సర్వత్రా హర్షాతిరేకాలు

సోషల్‌ మీడియా పుకార్లకు ఇక చెక్‌


ములుగు, ఏప్రిల్‌ 20: రెండేళ్ల క్రితం ఆవిర్భవించిన ములుగు జిల్లా కేంద్రప్రభుత్వం గుర్తింపును ఇచ్చింది. రాష్ట్రపతి రాజముద్ర వేయగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. జిల్లాకు మనుగడలేదు.. ఏక్షణంలోనైనా రద్దుకావొచ్చు.. అంటూ సోషల్‌మీడియాలో షికారుచేసిన పుకార్లకు ఇక చెక్‌ పెట్టినట్టయ్యింది.  కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన ప్రకటనలో కొత జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలుపగా కాళేశ్వరం జోన్‌ పరిధిలో ములుగు జిల్లాను చేర్చారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లా ఏర్పాటైంది. సుదీర్ఘ పోరాటానికి స్పందించిన సీఎం కేసీఆర్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని తన పుట్టినరోజున అమలు చేశారు. తొమ్మిది మండలాలతో ఏర్పాటైన ములుగు జిల్లా మనుగడలోకి వచ్చింది. అయితే అప్పటికే 31 జిల్లాలతో రూపొందించిన జోనల్‌ విధానానికి కేంద్రం ఆమోదం తెలప గా ఆతర్వాత ములుగుతోపాటు ఏర్పాటైన నారాయణపేట జిల్లాలను కలుపు తూ 33 జిల్లాలతో మరో ప్రతిపాదనను 2019లో కేం ద్రానికి నివేదించారు. సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రం ఆమోదముద్ర వేయడంతో ములుగు జిల్లా కేంద్రం గుర్తింపులోకి వచ్చింది.

ఉద్యోగావకాశాల మెరుగు..

కొత్త జోనల్‌ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో ఇప్పటి వరకు వెనుకబాటుకు గురైన ములుగు జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి, ఉన్న త విద్యావకాశాలు మెరుగుపడనున్నాయి. కాళేశ్వ రం జోన్‌లో ములుగుతోపాటు కుమ్రంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ అత్యధిక ఏజెన్సీ, రూరల్‌ ప్రాంతం ఉన్న జిల్లాలే. ఉద్యోగ నియామకాల్లో స్థానికత ఆధారంగా అవకాశాలు పెరగనున్నాయి. అర్బన్‌ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ అక్షరాస్యత శాతం తక్కువగా ఉండగా గతంలో ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌లోనూ తక్కువ ఉద్యోగాలు మాత్రమే వచ్చేవి. స్పెషల్‌ జోనల్‌ విధానంతో ఎంపిక జేసిన జిల్లాలే ఉండగా మెరిట్‌ ఆధారంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంత యువకులకు ఉద్యోగాలు సుల భం కానున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఉన్న త విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం పోటీపడే జిల్లా విద్యార్థులు, యువకులకు న్యాయం జరగనుంది.

ఉద్యోగులకూ లాభమే..

ములుగు జిల్లాగా ఏర్పాటైన తర్వాత ఆర్డర్‌ టు సర్వ్‌ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. జోనల్‌ విధానం ఖరారు కావడంతో బదిలీలు, పదోన్నతులలో న్యాయం జరగనుంది. ఇటీవలే కలెక్టర్‌ కార్యాలయానికి 53 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  కొత్త జోనల్‌ ఆధారంగా ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల కేటాయింపులు జరగనున్నాయి.


Updated Date - 2021-04-21T05:48:11+05:30 IST