కోల్‌కతాపై ముంబై విజయం

ABN , First Publish Date - 2020-09-24T05:14:25+05:30 IST

ఐపీఎల్-2020 భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో...

కోల్‌కతాపై ముంబై విజయం

రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్.. బూమ్రా మెరుపు బౌలింగ్.. వెరసి కోల్‌కతాపై ముంబై భారీ విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే కోల్‌కతాపై ముంబై పైచేయి సాధిస్తూ వచ్చింది. కోల్‌కతా బౌలర్లను రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో ముంబై 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లు వెంటనే అవుట్ కావడం, కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా ఎక్కువ సేపు పోరాడలేక పోవడంతో విజయానికి నెమ్మదిగా దూరమవుతూ వచ్చింది. రస్సెల్, మోర్గాన్‌ ఆకట్టుకోకపోవడం, మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కోల్‌కతా పరాజయం చవిచూసింది. తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఓడి కసి మీద ఉన్న ముంబై రెండో మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటింది. 


దుబాయ్: ఐపీఎల్-2020లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. అయితే స్పీడ్ గన్ శివమ్ మావి సూపర్ బౌలింగ్‌తో ఈ సీజన్ ఐపీఎల్‌లోనే తొలి మెయిడెన్ ఓవర్‌ నమోదు చేశాడు. అంతేకాకుండా సౌత్‌ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్ డీకాక్ వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డీకాక్ వెంటనే అవుటైనా రోహిత్ దూకుడుగా ఆడాడు. అతడికి సూర్యకుమార్ యాదవ్ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రోహిత్, యాదవ్‌లు వరుస ఓవర్లలో బౌండరీల మోత మోగించారు.


పది ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 94 పరుగులకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తరువాతి ఓవర్లో రోహిత్ అనవసర రన్‌కు ప్రయత్నించడంతో సూర్య కుమార్ రన్‌ అవుట్‌‌‌‌గా వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీ తరువాత రోహిత్ మరింత రెచ్చిపోయాడు. ప్రతి ఓవర్లోనూ సిక్సులు, ఫోర్లతో బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అయితే 18వ ఓవర్లో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మావీ బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరుపరి ఓవర్లో రస్సెల్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి హార్దిక్ వికెట్ తీశాడు. అనంతరం చివరి ఓవర్‌లో మావీ 13 పరుగులు ఇవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగలిగింది. 


అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతాకు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్ వెంటవెంటనే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. నితీశ్ రాణాతో కలిసి కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే పరుగులు రాబట్టడం కష్టమవడంతో రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగింది. దీంతో కోల్‌కతా విజయానికి దూరమవుతూ వచ్చింది. 10 ఓవర్లకు కేవలం 71 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే రెండు వికెట్లు మాత్రమే కోల్పోవడంతో మ్యాచ్ ఏ నిముషంలోనైనా కోల్‌కతా వైపు తిరగవచ్చని అభిమానులు అనుకున్నారు.


కానీ కొద్ది సేపటికే దినేశ్ కార్తీక్, రాణా అవుట్ కావడంతో కోల్‌కతా ఆశలు ఆవిరయ్యాయి. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్డ్ హిట్టర్ రస్సెల్, ఇయన్ మోర్గాన్‌లతో పాటు మిగతా బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌‌లో నిలబడలేదు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీజన్‌ను పరాజయంతో మొదలు పెట్టిన ముంబై టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. 49 పరుగుల భారీ తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది.

Updated Date - 2020-09-24T05:14:25+05:30 IST