డికాక్‌ ముందుండి..

ABN , First Publish Date - 2021-04-30T09:04:52+05:30 IST

ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో ముందుండి నడిపించడంతో ముంబై ఇండియన్స్‌ మూడో విజయాన్ని నమోదు చేసింది...

డికాక్‌ ముందుండి..

  • 7 వికెట్లతో ముంబై గెలుపు
  • రాణించిన క్రునాల్‌ 
  • రాజస్థాన్‌తో పోరు

డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఓపెనర్‌ డికాక్‌ అర్ధ శతకంతో ఫామ్‌లోకి రావడంతో రాజస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. లీగ్‌లో తొలిసారి ఛేదనకు దిగిన ముంబై ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ సునాయాస విజయాన్ని సొంతం చేసుకొంది. 


న్యూఢిల్లీ: ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో ముందుండి నడిపించడంతో ముంబై ఇండియన్స్‌ మూడో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 7వికెట్లతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 171/4 స్కోరు చేసింది. సంజూ శామ్సన్‌ (42), బట్లర్‌ (41) రాణించారు. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ (2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసి గెలిచింది. క్రునాల్‌ పాండ్యా (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) తగిన సహకారం అందించాడు. మోరిస్‌ (2/33) రెండు వికెట్లు తీశాడు. డికాక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.


రోహిత్‌ ఫెయిల్‌..: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు రోహిత్‌ శర్మ (14), డికాక్‌ తొలి వికెట్‌కు 49 పరుగులతో ధాటిగా ఆరంభించారు. ఐదో ఓవర్‌లో రోహిత్‌ తనదైన స్టయిల్‌ పుల్‌షాట్‌తో సిక్స్‌ బాదాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో మోరిస్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడే క్రమంలో సకారియాకు చిక్కాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ (16) మూడు ఫోర్లు బాది దూకుడుగా కనిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయాడు. 10వ ఓవర్‌లో ఓ స్లో బంతితో సూర్యను మోరిస్‌ బోల్తా కొట్టించాడు. 83/2తో ఉన్న సమయంలో డికాక్‌తో క్రునాల్‌ పాండ్యా జత కట్టాడు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో స్కోరు వేగం పెరిగింది. 12వ ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌తో డికాక్‌ అర్ధ శతకం పూర్తి చేశాడు. 15వ ఓవర్‌లో తెవాటియా బౌలింగ్‌లో క్రునాల్‌ భారీ సిక్స్‌తో 12 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి 5 ఓవర్లలో లక్ష్యం 41 పరుగులకు దిగొచ్చింది. అయితే, క్రునాల్‌ను ముస్తాఫిజుర్‌ (1/37) అవుట్‌ చేయడంతో.. మూడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ (16 నాటౌట్‌) రెండు ఫోర్లు బాది మరో 9 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. 


ఓపెనర్ల శుభారంభం..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు బట్లర్‌, యశస్వి (32) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 7.4 ఓవర్లలో 66 పరుగులతో మంచి పునాది వేశారు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతినే బట్లర్‌ బౌండ్రీకి తరలించాడు. ఆ తర్వాత బుమ్రా (1/15) ఓవర్‌లోనూ ఫోర్‌ బాదాడు. మరో ఓపెనర్‌ జైస్వాల్‌ కూడా మూడో ఓవర్‌లో బౌండ్రీతో టచ్‌లోకి వచ్చాడు. జయంత్‌ యాదవ్‌ ఐదో ఓవర్‌లో బట్లర్‌ 4,6తో బ్యాట్‌ ఝుళిపించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కల్టర్‌నైల్‌ బౌలింగ్‌ యశస్వి ఫోర్‌, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి రాజస్థాన్‌ 47/0తో నిలిచింది. జోరుగా సాగుతున్న వీరి భాగస్వామ్యాన్ని స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ విడదీశాడు. ఎనిమిదో ఓవర్‌లో సిక్స్‌ బాది జోరు మీదున్న బట్లర్‌.. తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌ ఆడే క్రమంలో స్టంపౌటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సంజూ.. క్రునాల్‌ పాండ్యా వేసిన 9వ ఓవర్‌లో  రెండు ఫోర్లతో మొత్తం 12 పరుగులు సాధించాడు. అయితే, చాహర్‌ మరోసారి దెబ్బకొట్టాడు. క్రీజులో నిలదొక్కుకొన్న జైస్వాల్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. ఈ దశలో దూబె (35), సంజూ ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ.. మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే, 18వ ఓవర్‌లో శామ్సన్‌ను బౌల్ట్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో దూబెను బుమ్రా రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. చివరి 4 ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ రాజస్థాన్‌ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. 


స్కోరు బోర్డు

రాజస్థాన్‌: జోస్‌ బట్లర్‌  (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 41, యశస్వీ జైస్వాల్‌ (సి అండ్‌ బి) రాహుల్‌ చాహర్‌ 32, సంజూ శామ్సన్‌ (బి) బౌల్ట్‌ 42, శివమ్‌ దూబె (సి అండ్‌ బి) బుమ్రా 35, డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 7, రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 171/4; వికెట్ల పతనం: 1-66, 2-91, 3-148, 4-158; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-37-1, బుమ్రా 4-0-15-1, జయంత్‌ యాదవ్‌ 3-0-37-0, కల్టర్‌నైల్‌ 4-0-35-0, రాహుల్‌ చాహర్‌ 4-0-33-2, క్రునాల్‌ 1-0-12-0.

ముంబై: రోహిత్‌ (సి) సకారియా (బి) మోరిస్‌ 14, డికాక్‌  (నాటౌట్‌) 70, సూర్యకుమార్‌ (సి) బట్లర్‌ (బి) మోరిస్‌ 16, క్రునాల్‌ పాండ్యా (బి) ముస్తాఫిజుర్‌ 39, పొలార్డ్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 18.3 ఓవర్లలో 172/3; వికెట్ల పతనం: 1-49, 2-83, 3-146; బౌలింగ్‌: సకారియా 3-0-18-0, ఉనాద్కట్‌ 4-0-33-0, ముస్తాఫిజుర్‌ 3.3-0-37-1, మోరిస్‌ 4-0-33-2, తెవాటియా 3-0-30-0, దూబె 1-0-6-0. 

Updated Date - 2021-04-30T09:04:52+05:30 IST