సౌదీలో తెలంగాణ వాసికి తుమ్ము కష్టాలు!

ABN , First Publish Date - 2020-04-10T10:05:21+05:30 IST

సౌదీ అరేబియాలో ఉంటున్న తెలంగాణ ప్రవాసీయుడు ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి వల్ల వైరస్‌ వ్యాప్తి చెంది.. ఇతరులకు ప్రాణ నష్టం తప్పదని తేలి

సౌదీలో తెలంగాణ వాసికి తుమ్ము కష్టాలు!

  • సూపర్‌ మార్కెట్‌లో షాపింగ్‌
  • తుమ్మినప్పుడు ట్రాలీపై పడిన తుంపర్లు
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • పరీక్షల్లో ప్రవాసికి కరోనా పాజిటివ్‌
  • హత్య కేసు నమోదు చేసే అవకాశం?

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సౌదీ అరేబియాలో ఉంటున్న తెలంగాణ ప్రవాసీయుడు ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి వల్ల వైరస్‌ వ్యాప్తి చెంది.. ఇతరులకు ప్రాణ నష్టం తప్పదని తేలితే ఆ ప్రవాసీయుడిపై హత్య కేసు నమోదయ్యే అవకాశం ఉంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై ఇ టీవల స్వదేశానికి వెళ్లి.. కొద్దిరోజుల తర్వాత సౌదీకి వచ్చాడు. ఒకరోజు నిత్యావసరాల కోసం ఓ ప్రముఖ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ పదేపదే తుమ్ముతూ.. దగ్గుతూ కనిపించిన ఆ ప్రవాసీయుడిని.. అరబ్బు కుటుంబానికి చెందిన ఓ బాలిక గమనించింది. అతను తుమ్మిన సమయంలో తుంపర్లు షాపింగ్‌ ట్రాలీపై పడటం, ఆ ట్రాలీ హ్యాండిల్‌ను అతడు పట్టుకోవడం.. ఇదంతా చూసిన ఆ బాలిక అక్కడే ఉన్న తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వారి సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఆ ప్రవాసీయుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే మునిసిపల్‌ అధికారులు సూపర్‌ మార్కెట్‌లో పూర్తిగా క్రిమి సంహారక మందును స్ర్పే చేశారు. ప్రవాసీయుడు తాకిన ర్యాకుల్లోని రూ. 35 లక్షల విలువై సామగ్రిని ధ్వంసం చేశారు. ఆ ప్రవాసీయుడితో కలిసి క్యాంపులో ఉంటున్న మరో 47 మంది విదేశీ కార్మికులను క్వారంటైన్‌కు తరలించారు. వారిలో 44 మందికి నెగెటివ్‌ అని తేలడంతో ఈనెల 8వ తేదీన డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఉద్దేశపూర్వకంగా కరోనా వైర్‌సను వ్యాప్తి చేసి.. ఇతరులకు ప్రాణ నష్టం కలిగిస్తున్నాడని తేలితే.. ఆ ప్రవాసీయుడిపై హత్య కేసు పెడతామని అధికారులు తెలిపారు. సెలవుల సమయంలో స్వదేశంలోని జనగాం, వరంగల్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో తిరిగివచ్చిన ఆ యువకుడికి.. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే కరోనా ఉన్నట్లు తెలిసిందని అతని మిత్రులు తెలిపారు. 


Updated Date - 2020-04-10T10:05:21+05:30 IST