Abn logo
Feb 14 2020 @ 03:50AM

నా సస్పెన్షన్‌ చట్టవిరుద్ధం

రాజకీయ కారణాలతోనే చర్య

పైగా సెలవు రోజున ఉత్తర్వులిచ్చారు

48 గంటల్లో కేంద్రానికి తెలపాలి

కానీ సమాచారమూ ఇవ్వలేదు

8 నెలలుగా జీతమూ ఇవ్వలేదు

జీవో నంబరు 18ని కొట్టివేయండి

క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీవీ

నేడు ట్రైబ్యునల్‌లో విచారణ!


హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నిరాధారమైన ఆరోపణలతో ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేసిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. తనపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఈ నెల 8న జారీచేసిన జీవో 18ని ఆయన సవాల్‌ చేశారు. ప్రభుత్వం కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఏకపక్షంగా తనను సస్పెండ్‌ చేసిందని పిటిషన్‌లో తెలిపారు. రాజకీయ కారణాలతో, దురుద్దేశంతో, అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన ఈ జీవోను కొట్టివేయాలని ట్రైబ్యునల్‌ను అభ్యర్థించారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేసిన తనకు.. 8 నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారని తెలిపారు. 2015 నుంచి 2019 వరకు అదనపు డీజీగా నిఘా విభాగంలో విధులు నిర్వహించానని.. 2019లో డీజీపీగా పదోన్నతి పొందానని వెల్లడించారు. 2019 ఏప్రిల్‌ 20న ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టానన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మే 30న తనను బదిలీ చేస్తూ 31న జీఏడీలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్టింగ్‌ ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. పోస్టింగ్‌, జీతం ఇవ్వాలంటూ జనవరి 6న, జనవరి 28న ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భద్రతా పరికరాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లలో తన పాత్ర ఉందంటూ వచ్చిన ఆరోపణల ఆధారంగా తనను సస్పెండ్‌ చేశారని.. రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవైనా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. 2015-19 మధ్య భద్రతా పరికరాలను నిబంధనల ప్రకారమే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, టెండర్‌ ద్వారా కొనుగోలు చేశామని, నిఘా అధిపతిగా నామమాత్రంగానే తన ఆమోదం తీసుకుంటారని వివరించారు. 


30 ఏళ్ల సర్వీసులో చిన్న మచ్చ లేదు

తన 30 ఏళ్ల సర్వీసులో ఎటువంటి ఆరోపణలు లేవని.. చిన్న మచ్చ కూడా లేకుండా విధులు నిర్వహించానని వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రపతితోపాటు ఐక్యరాజ్యసమితి నుంచీ అవార్డులు అందుకున్నానన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ కారణాలతో విచారణ చేయకుండానే, వివరణకు అవకాశం ఇవ్వకుండానే సస్పెండ్‌ చేశారన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల సస్పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలు పాటించలేదని, సస్పెన్షన్‌కు కారణాలను 48 గంటల్లో కేంద్రానికి తెలియజేయాల్సి ఉన్నా తెలుపలేదని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు. సర్వీసు నిబంధలకు విరుద్ధంగా చేసిన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. అలాగే తనకు పోస్టింగ్‌ ఇవ్వడంతోపాటు వేతనం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ను క్యాట్‌ శుక్రవారం విచారించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ న్యాయవాదిగా ప్రకాశ్‌రెడ్డి

తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలో చేసిన పిటిషన్‌పై తన తరఫున వాదనలు వినిపించేందుకు హైదరాబాద్‌లోని సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డిని ఆంధ్ర ప్రభుత్వం నియమించుకుంది. జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఐఆర్‌ఎస్‌ అధికారి, ఈడీబీ మాజీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌ కేసులోనూ ప్రకాశ్‌రెడ్డే ప్రభుత్వం తరపున ట్రైబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నారు.