సాగర్‌ దుంకింది

ABN , First Publish Date - 2021-08-02T07:14:05+05:30 IST

కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో శ్రీశైలంలో 10, నాగార్జున సాగర్‌లో ..

సాగర్‌ దుంకింది

ఎగువ నుంచి భారీగా వరద.. నాగార్జున సాగర్‌ 14 గేట్ల ఎత్తివేత

ప్రాజెక్టుకు 4.35 లక్షల క్యూసెక్కుల వరద.. శ్రీశైలంలో ఇప్పటికే 10 గేట్ల ద్వారా విడుదల

పర్యాటకుల సందడి.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పది కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో శ్రీశైలంలో 10, నాగార్జున సాగర్‌లో 14 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ 96శాతం మేర నిండగా, నాగార్జున సాగర్‌ 95శాతం వరకూ నిండింది. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో ఆదివారం సాయంత్రం ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ తొలుత 13వ నంబర్‌ గేటును స్విచ్‌ ఆన్‌ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ నుంచి సాగర్‌ జలాశయానికి 4,35,410క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఏకంగా 14 క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,08,990 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం ద్వారా 35,364, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ఎడమ కాల్వకు 601, వరదకాల్వకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు(312టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 586.40 అడుగులు(302.39టీఎంసీలు)గా ఉంది. కాగా, పొట్టిచెల్మ హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు.

కృష్ణా బేసిన్


ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 4.63 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 47 గేట్ల ద్వారా 4,65,061 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 672, సమాంతర కాల్వకు 150, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌కు 315, భీమ లిఫ్ట్‌-2కు 750 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 5.805 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల స్పిల్‌వేతోపాటు సుంకేసుల నుంచి అదనంగా 71,172 క్యూసెక్కులు వస్తుండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో 10 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 20 అడుగుల మేర ఎత్తి 3,72,220 క్యూసెక్కులు, మొదటి జల విద్యుత్‌ కేంద్రం నుంచి 30,094క్యూసెక్కులు, రెండో జల విద్యుత్‌ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. దీంతో హైదరాబాద్‌ - శ్రీశైలం రహదారిపై 10 కిలోమీటర్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట నుంచి ఏపీలోని సున్నిపెంట వరకు ఘాట్‌రోడ్‌పై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పులిచింతల ప్రాజెక్టులో 10వేల క్యూసెక్కుల నీటితో నాలుగు యూనిట్ల ద్వారా 60మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయికి చేరువలో ఉండటంతో మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరుతోంది. 

Updated Date - 2021-08-02T07:14:05+05:30 IST