ఆమె ఫస్ట్‌... ఆటైనా, చదువైనా!

ABN , First Publish Date - 2020-11-23T06:03:44+05:30 IST

పుట్టిందీ, పెరిగిందీ గ్రామీణ ప్రాంతం... కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఆమె ప్రతిభ, పట్టుదల ముందు ఇవేవీ అవరోధాలు కాలేదు. హ్యాండ్‌బాల్‌ క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగిన జక్కుల నవనీత చదువులోనూ రాణిస్తోంది...

ఆమె ఫస్ట్‌... ఆటైనా, చదువైనా!

పుట్టిందీ, పెరిగిందీ గ్రామీణ ప్రాంతం... కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఆమె ప్రతిభ, పట్టుదల ముందు ఇవేవీ అవరోధాలు కాలేదు. హ్యాండ్‌బాల్‌ క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగిన జక్కుల నవనీత చదువులోనూ రాణిస్తోంది. తాజాగా పీఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించింది. ‘భారత జట్టుకు ఎంపిక కావాలన్నది నా లక్ష్యం’ అంటున్న ఆమె యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.


నవనీత స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా ఆకునూరు. ఆమె తండ్రి నర్సింహులు, తల్లి అయిలమ్మ. నవనీతకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. గ్రామంలో ఉన్న కాస్త వ్యవసాయభూమే వారి కుటుంబానికి జీవనాధారం. 

చిన్నప్పటి నుంచీ నవనీతకు క్రీడలంటే ఆసక్తి. ఆరో తరగతి చదువుతున్నప్పుడు నిర్వహించిన క్రీడా శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొంది. అప్పుడు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) హాస్టల్‌ కోచ్‌ దేవేందర్‌ చెప్పిన మెళకువలు హ్యాండ్‌బాల్‌లో తన ఆటతీరును సానపట్టుకోవడానికి ఆమెకు ఉపకరించాయి. పాఠశాల పిఇటి ఎం.డి. రఫత్‌ ప్రోత్సాహంతో మండల, జిల్లా స్థాయిల్లో అత్యున్నత ప్రతిభను ఆమె ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఖమ్మం జిల్లాలో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో ట్రిపుల్‌ జంప్‌లో ఆమె చూపిన నైపుణ్యం ప్రశంసలను అందుకుంది. పదో తరగతిలో ఉండగా హ్యాండ్‌బాల్‌ జాతీయ జట్టుకు ఎంపికైంది. 

అంతగా ప్రాచుర్యం పొందని హ్యాండ్‌బాల్‌ క్రీడలో అత్యుత్తమంగా రాణించిన నవనీత క్రమంగా తెలంగాణ జట్టులో ప్రధాన క్రీడాకారిణిగా మారింది. 2015లో అండర్‌-19 పోటీల్లో బంగారు పతకం సాధించింది. హైదరాబాద్‌లోని శాయ్‌ హాస్టల్‌కు నవనీత ఎంపిక కావడం మరింత మెరుగైన శిక్షణను ఆమె పొందడానికి వీలు కలిగించింది. 2017లో దేశవ్యాప్తంగా శాయ్‌ కేంద్రాల మధ్య నిర్వహించిన ప్రతిభా పోటీల్లో ప్రాబబుల్స్‌కు ముగ్గురు ఎంపికయ్యారు. వారిలో ఏకైక యువతి నవనీత!

ఒకవైపు క్రీడల్లోని రాణిస్తున్నా చదువును ఆమె ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. హైదరాబాద్‌లోని శాయ్‌ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న నవనీత తెలంగాణ పీఈసెట్‌కు ప్రిపేర్‌ అయింది. అయితే కరోనా కారణంగా స్వగ్రామానికి రావాల్సి వచ్చింది. కుటుంబానికి వ్యవసాయ పనుల్లో సాయపడుతూనే ప్రాక్టీ్‌సనూ, చదువునూ కొనసాగించింది. ఇటీవల వెలువడిన పీఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ను ఆమె కైవసం చేసుకుంది. గ్రామస్థుల అభినందనలనూ, సన్మానాన్నీ అందుకుంది. హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్‌ హ్యాండ్‌బాల్‌ శిక్షకురాలిగా ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పని చేస్తున్న నవనీత భారత జట్టులో ఎంపిక కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి శ్రమిస్తానని చెబుతోంది. 

- జిల్లా అజయ్‌కుమార్‌, చేర్యాల






క్రీడాకారుల్ని తయారు చేస్తా!

‘‘పీఈసెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ రావడం సంతోషంగా ఉంది. రైల్వే ఉద్యోగం పొందాలన్నది నా ఆలోచన. అయితే వయసు తక్కువగా ఉండడంతో పిఈసెట్‌కు ప్రిపేర్‌ అయ్యాను. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చి, ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలన్నది నా ఆశయం. నాకు మా తల్లితండ్రులు, గ్రామస్థులు ఇచ్చిన సహకారాన్ని మరువలేను. ఆకునూరు పాఠశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో శాయ్‌ శిక్షకుడు దేవేందర్‌ నా క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. ఆయనకూ, మా పాఠశాల పిఈటీ రఫత్‌ ఎన్నో మెళకువలు నేర్పారు. వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను.’’

- నవనీత


ఆమె మట్టిలో మాణిక్యం

‘‘నవనీత ఆటతీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె మట్టిలో మాణిక్యం లాంటిది. పోటీల్లో ఎంతమంది పాల్గొన్నా, ఆమెపైనే అందరి దృష్టీ ఉండేది. శిక్షణ సమయంలో ఎంతో ఏకాగ్రతతో మెలిగేది. ఇండియన్‌ ప్రాబబుల్స్‌కు ఆమె ఎంపిక కావడం గుర్తించదగ్గ విషయం. మరింత ప్రోత్సాహం ఉంటే ఆమె ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటుంది. అలాగే ఆమె పిఈసెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ర్యాంక్‌ పొందడం మా అందరికీ గర్వంగా ఉంది. హ్యాండ్‌ బాల్‌ శిక్షణ శిబిరాలను రెసిడెన్షియల్స్‌గా మార్చి, వాటిని నిరంతరాయంగా కొనసాగిస్తే నవనీతలాంటివారు మరెందరో రాణిస్తారు.’’

- రఫత్‌, హ్యాండ్‌బాల్‌ శిక్షకుడు



Updated Date - 2020-11-23T06:03:44+05:30 IST