వేలెత్తి చూపిస్తే... వేలమా!

ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST

ప్రత్యేకంగా ఒక వర్గం మహిళలను లక్ష్యంగా చేసుకొని... వారి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి, ఆన్‌లైన్‌ అంగడిలో పెట్టి... బేరాలాడండంటూ ఆహ్వానించిన దుర్మార్గం... కొత్త ఏడాది పొద్దు పొడవగానే దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

వేలెత్తి చూపిస్తే... వేలమా!

ప్రత్యేకంగా ఒక వర్గం మహిళలను లక్ష్యంగా చేసుకొని...

వారి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి, ఆన్‌లైన్‌ అంగడిలో పెట్టి...

బేరాలాడండంటూ ఆహ్వానించిన దుర్మార్గం... కొత్త ఏడాది పొద్దు పొడవగానే దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

‘బుల్లీ బాయ్‌’ అనే ఈ యాప్‌లో పెట్టిన ఫొటోలు... సమాజంలోని అసమానతలను ప్రశ్నించే స్వతంత్ర గళాలవి.

వీళ్ళందరూ వ్యవస్థలో లోపాలను నిగ్గదీసేవారే! వాళ్ళలో ముగ్గురి వివరాలివి.


హైదరాబాద్‌కు చెందిన హక్కుల కార్యకర్త, సమాజ సేవకురాలు ఖలీదా పర్వీన్‌. వయసు అరవై ఏడేళ్ళు. తను ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమూమత్‌ సొసైటీ ద్వారా మహిళలు, బాలికల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ, హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు వేలమందిని ఆదుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన రైతులను స్వయంగా కలిసి, తన మద్దతు ప్రకటించారు. ‘బుల్లీ బాయ్‌’ యాప్‌లో తన ఫొటో పెట్టారని తెలిసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసంగాలతో విద్వేషాలను రెచ్చకొడుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ దస్నా దేవి ఆలయ ప్రధాన పూజారి యతి నరసింఘానంద సరస్వతిను అరెస్ట్‌ చెయ్యాలని ట్విట్టర్‌ ద్వారా ఉద్యమించినందుకే తనపై ఇలా విషం చిమ్ముతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ‘‘అరవయ్యేళ్ళకు పైబడిన, వాళ్ళ తల్లి వయసున్న నాలాంటి వారిని కూడా వాళ్ళు వేలంలో పెట్టారంటే, నాకు కోపం రావడం లేదు. వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఉన్నారని జాలేస్తోంది. ఇలాంటి పనులు చేస్తూ, అదే సమయంలో ‘భారత్‌మాతాకీ జై’ అని నినాదాలు చెయ్యడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం. వాళ్ళకి నేను భయపడను’’ అని స్పష్టం చేశారు ఖలీదా.


జమ్మూ-కశ్మీర్‌కు చెందిన స్వతంత్ర పాత్రికేయురాలైన ఖురాతులైన్‌ రెహ్బార్‌ దేశ, విదేశాలకు చెందిన వివిధ పత్రికల్లో పని చేశారు. మానవ హక్కులు, మహిళా సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా రచనలు చేస్తారు. వయసు ఇరవై ఎనిమిదేళ్ళు. కొన్నాళ్ళ కిందట ‘సుల్లీ డీల్స్‌’ పేరుతో జరిగిన ఇదే తరహా వ్యవహారంపై ఆమె కథనాలు రాశారు. ఇప్పుడు ఆమె ఫొటో ‘బుల్లీ బాయ్‌’ యాప్‌లో చోటుచేసుకుంది. ‘‘కిందటి ఏడాది ముస్లిం మహిళల ఫొటోలను ఆన్‌లైన్‌ వేలంలో పెట్టినప్పుడు, వాళ్ళు ఎంత ఆవేదన చెందారో, ఎంత అవమానపడ్డారో నేను రాశాను. ఈ రోజు, ఓ ఏడాది తరువాత, మరో పేరుతో ఉన్న యాప్‌లో... ఇతర ముస్లిం మహిళలతో పాటు నా ఫొటోని చూసుకున్నప్పుడు... ఎంతో జుగుప్సగా అనిపించింది’’ అంటూ ఆమె స్పందించారు. ‘‘ నేను బాధపడడం లేదు. ఎందుకంటే. నేను మొద్దుబారిపోయాను. నేను ఎప్పుడూ, ఏ వివాదంలోనూ ఉన్నట్టు అనుకోవడం లేదు. ప్రచారాన్ని కోరుకోలేదు. నా దృష్టంతా నేను చేసే పనిమీదే ఉండాలని కోరుకుంటాను’’ అని చెప్పారామె. 


ఇరవైరెండేళ్ళ జెబా అఫ్రిన్‌ జమ్మూ-కశ్మీర్‌కు చెందిన న్యాయవిద్యార్థిని. ‘‘నేను న్యాయ కళాశాలలో చేరిన ఏడాదే కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగ హోదాను రద్దు చేసింది. ఆ తరువాత జాతీయ పౌర పట్టిక గురించి పార్లమెంట్‌లో హోం మంత్రి ప్రకటించారు. పూర్వం మసీదు ఉన్న చోట ఒక ఆలయం నిర్మించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. మీరు మైనారిటీలైతే ఎలాంటి హక్కులు ఉండవు. ఈ విధంగా హక్కులను కోల్పోతున్నవారి కోసం ‘లా’ చదవాలనుకున్నాను. ఇప్పుడు నా హక్కులకే భంగం కలిగింది’’ అన్నారు. జెబా. బహుశా ‘బుల్లీ బాయ్‌’ జాబితాలో అతి పిన్న వయస్కురాలు ఆమే కావచ్చు. ‘‘ఆ యాప్‌లో నా ఫొటోను చూడగానే ఆందోళనతో కదిలిపోయాను. నా చేతులు కంపించాయి. ఒళ్ళంతా ఆగని వణుకు. నా మనసుకు తగిలిన గాయం ఇప్పట్లో తగ్గేలా లేదు. దీన్ని తట్టుకొనే వయసు నాకింకా రాలేదు’’ అని చెప్పారు. రాజ్యం మానవ హక్కులను చంపేస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST