అభాగినులకు అండ దండ...

ABN , First Publish Date - 2021-12-02T06:37:06+05:30 IST

మనసు కదలడానికీ, మెదడులో ఆలోచన పుట్టడానికీ ఒకే ఒక్క సంఘటన సరిపోతుంది. గుండెను పిండేసే అలాంటి కొన్ని సంఘటనలు ...

అభాగినులకు అండ దండ...

మనసు కదలడానికీ, మెదడులో ఆలోచన పుట్టడానికీ ఒకే ఒక్క సంఘటన సరిపోతుంది. గుండెను పిండేసే అలాంటి కొన్ని సంఘటనలు యోగితా భాయనను సమాజ సేవ వైపు నడిపించాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ్ఞ్ఞఅత్యాచార బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థలను స్థాపించిందీ ఈ ఢిల్లీ అమ్మాయి. అందుకోసం విమానయాన వృత్తిని సైతం వదిలేసుకున్న యోగితా కథ ఆమె మాటల్లోనే.... 


నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే వయోవృద్ధుల కోసం బడిలో నిధులు సేకరించేదాన్ని. బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు మా ఇంటి ముందున్న చెట్టు కింద పాఠాలు చెప్పేదాన్ని. అయితే అందరు పిల్లల్లాగే నేనూ చక్కగా చదువుకుని, నచ్చిన విమానయాన రంగంలో స్థిరపడ్డాను. అయితే 2002లో జరిగిన ఓ సంఘటన నా జీవిత ప్రయాణాన్ని మలుపు తిప్పింది. ఒక రోజు నా కళ్లెదుట ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దారిన వెళ్లే ఏ ఒక్కరూ తక్షణ సహాయం అందించలేకపోయారు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగోలా అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చగలిగినా, అక్కడ చికిత్స సౌకర్యాలు కొరవడడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణంతో భార్యా బిడ్డలూ రోడ్డున పడ్డారు. ఆ సంఘటన నన్నెంతో కదిలించింది. ఈ దేశంలో పేదవాడి జీవితం విలువ ఇంతేనా? అనే ఆలోచన నాలో మొదలైంది. సమాజాన్నీ, ప్రభుత్వాన్నీ చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన కలిగింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి అవగాహనా కార్యక్రమాలను మొదలుపెట్టాను. ఆ క్రమంలో 2007లో, రోడ్డు ప్రమాద బాధితుల కోసం ‘దాస్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌’ను స్థాపించాను. 


నిర్భయలు ఎందరో...

2012లో నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ దేశవ్యాప్త ప్రకంపనలు సృష్టించిన సమయంలో, అదే తరహా బాధితులకు సమాన న్యాయం అందేలా కృషి చేశాను. ఒక్కో తీర్పు కోసం నెలల తరబడి బాధితులతో పాటు కోర్టుల చుట్టూ తిరిగాను. నిర్భయకు ప్రపంచం అండగా నిలబడింది. కానీ ఆమె లాంటి మరెంతో మంది బాధితుల తరుఫున పోరాడేదెవరు? వాళ్లకు న్యాయం అందించగలమని ప్రమాణం చేయలేకపోయినా, వాళ్లకు అండగా ఉంటామని ప్రమాణం చేయవచ్చు. నేను అదే చేశాను. అత్యాచార బాధితులు, వారి కుటుంబాలకు న్యాయం దక్కేలా సహాయపడడంతో పాటు, వాళ్లకు పునరావాసం, భద్రత కల్పించడం కోసం ‘పీపుల్‌ ఎగేనెస్ట్‌ రేప్‌ ఇన్‌ ఇండియా (పిఎఆర్‌ఐ)ని స్థాపించాను. 


నా 14 ఏళ్ల సేవా ప్రయాణంలో వందల మంది అభాగినులకు పరిహారం, న్యాయ సహాయం దక్కేలా తోడ్పడ్డాను. బాధితులకు సహాయం అందించడం కంటే, నేరాలను నియంత్రించడం ముఖ్యం. అలా చేయలేని పక్షంలో అనంతంగా ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి మహిళల మీద దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడినప్పుడే, మార్పు సాధ్యపడుతుంది’’.

Updated Date - 2021-12-02T06:37:06+05:30 IST