నక్సల్స్‌ నాయకురాలు సావిత్రి లొంగుబాటు

ABN , First Publish Date - 2022-09-22T08:53:55+05:30 IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సెక్రటరీగా పని చేసిన రావుల శ్రీనివాస్‌ భార్య మాధవి హడమ అలియాస్‌ రావుల సావిత్రి (46) పోలీసుల ఎదుట లొంగిపోయారు.

నక్సల్స్‌ నాయకురాలు సావిత్రి లొంగుబాటు

  • కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న భార్యగా గుర్తింపు
  • వివరాలు వెల్లడించిన డీజీపీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సెక్రటరీగా పని చేసిన రావుల శ్రీనివాస్‌ భార్య మాధవి హడమ అలియాస్‌ రావుల సావిత్రి (46) పోలీసుల ఎదుట లొంగిపోయారు. దక్షిణ బస్తర్‌ డివిజన్‌ కమిటీ ఇన్‌చార్జిగా ఉన్న ఆమె.. మావోయిస్టు పార్టీలో 30 ఏళ్ల పాటు కొనసాగారు. పోలీసులపై జరిగిన ఎన్నో దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మరెన్నో దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సావిత్రిపై అక్కడి ప్రభుత్వం రూ.10లక్షల రివార్డు ప్రకటించింది. సావిత్రి లొంగుబాటుకు సంబంధించి వివరాలను బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ‘‘13 ఏళ్ల వయస్సులోనే సావిత్రి పీపుల్స్‌వార్‌లో చేరారు. 1992లో కొంట దళంలో సభ్యురాలిగా, 1998లో కిష్టారం ఏరియా కమిటీ ఏసీఎం ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2008లో దక్షిణ బస్తర్‌ డివిజనల్‌ కమిటీ సభ్యురాలిగా చేరి, 14 ఏళ్లపాటు అక్కడే కొనసాగారు. తన 30 ఏళ్ల ప్రస్థానంలో 350 వరకు సానుభూతిపరుల్ని పార్టీలో చేర్పించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలైన క్రాంతి ఆదివాసీ మహిళా సంఘటన్‌, దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌, చైతన్య నాట్య మంచ్‌కు నాయకత్వం వహించారు. భద్రతా బలగాలపై మావోయిస్టు పార్టీ జరిపిన 8 దాడుల్లో 122 మంది భద్రతా బలగాలు మరణించగా, ఆ దాడుల్లో సావిత్రి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 


సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న సమయంలో 2019లో రామన్న గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత పార్టీ విధానాలు నచ్చకపోవడంతో రామన్న, సావిత్రి కుమారుడు రావుల శ్రీకాంత్‌ అలియాస్‌ రంజిత్‌ 2021 జూలైలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏడాది తర్వాత కొడుకు బాటలోనే తల్లి సావిత్రి కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. పార్టీ విధానాలు నచ్చకపోవడం, రామన్న మృతి తర్వాత పార్టీ తనను పక్కనబెట్టడంతో పోలీసులకు లొంగిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు’’ అని డీజీపీ వివరించారు. తక్షణ సాయంగా ఆమెకు రూ.50వేలు అందజేశామని, దశలవారీగా మిగతా రివార్డు మొత్తాన్ని అందజేస్తామన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావాలని, అలాటి వారికి ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాగా.. ‘‘మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా చంద్రన్న తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటు న్నాం. ఆడెల్లు దళం ప్రవేశించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు’’అని డీజీపీ తెలిపారు.

Updated Date - 2022-09-22T08:53:55+05:30 IST