నిర్లక్ష్యానికి బలి కావొద్దు!

ABN , First Publish Date - 2020-04-06T09:05:42+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. మందులేని ఈ వైర్‌సను అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ శక్తికి మించి

నిర్లక్ష్యానికి బలి కావొద్దు!

  • ముందే గుర్తిస్తే పది మందిని కాపాడినట్టే
  • అవగాహన లేక విజయవాడలో ముగ్గురు మృతి
  • నిర్లక్ష్యం కారణంగా మచిలీపట్నంలో ఒకరు బలి


అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. మందులేని ఈ వైర్‌సను అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ శక్తికి మించి శ్రమిస్తున్నా.. వల్లకావడం లేదు. దీని కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని మార్గదర్శకాలు జారీచేస్తున్నా.. నిర్లక్ష్యం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఏమరపాటు పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. ‘నేను బాగానే  ఉన్నాగా.. నాకేం కాదులే అని మొండి ధైర్యంతో ఏమరపాటుగా ఉంటే ఏదైనా జరగొచ్చు’ చెబుతున్నారు. ఈ వైరస్‌ ప్రాణాలనే హారించేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్‌, ఆస్తమా, గుండె సమస్యలున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దీనికి ఉదాహరణలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా దెబ్బకు ఒక్కరు మాత్రమే చనిపోయారు. కానీ దీని వలన రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో కొంత మంది కరోనా పట్ల అవగాహన లేక మృతి చెందితే... మరికొంత మంది నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. 


ప్రభుత్వం కరోనా మరణంగా ప్రకటించిన విజయవాడ వ్యక్తి.. అవగాహన లేక మృతిచెందారు. మార్చి 17న ఢిల్లీ సభకు వెళ్లొచ్చిన కొడుకు నుంచి వృద్ధులైన తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది. వారు అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో మార్చి 29న తల్లి, 30న తండ్రి మృతి చెందారు. వారికి కరోనా పట్ల అవగాహన లేక పోవడం వల్లనే ప్రాణ నష్టం జరిగింది. శనివారం మచిలీపట్నానికి చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందారు. అతను బెంగూళూరు, చెన్నై వంటి నగరాల్లో వ్యాపారం చేసుకుంటుంటారు. అతనికి కరోనా వైరస్‌ ఎక్కడ, ఎలా అంటుకుందో తెలియదు. కానీ ఏడెనిమిది రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. కానీ అతను ఇవేమీ పట్టించుకోకుండా మందుల షాపుల దగ్గర టాబ్లెట్లు తీసుకొచ్చి వాడుకునేవాడు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో నాలుగు రోజుల క్రితం బందరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. శనివారం అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో వైద్యులు విజయవాడ తరలించారు. 24 గంటల వ్యవధిలోనే శ్వాస సంబంధిత సమస్యతో అతను మృతి చెందారు. వయస్సు చిన్నదైనా నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మిగిలిన మూడు కేసుల విషయంలో కూడా నిర్లక్ష్యం, అవగాహన లేమి వల్లే వారు ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-04-06T09:05:42+05:30 IST