Abn logo
Feb 17 2020 @ 05:50AM

నిలేసి చదివించే నేర్పు కనిపించడం లేదు

ఇప్పుడు నా వయస్సు 85 ఏళ్ళు. ఈనాటికీ చదవడమే నాకు ఇష్టం. నిత్యం చదువుతాను. సాహిత్యంలో అన్ని ప్రక్రియలకి సంబంధించిన పుస్తకాలు అందులో ఉంటాయి. కానీ నా ప్రాధాన్యం మాత్రం కథే. కథలంటే నాకు అమితమైన ఇష్టం.

భమిడిపాటి జగన్నాథరావు


తెలుగు రచయితల్లో ప్రత్యేకమైన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు గారు. త్రికాలాల్లో మనిషికి ప్రాణప్రదమైన మానవత్వం తల్లివేరుగా ఆయన కథలు అల్లుకొచ్చారు. సన్నటి ఆకుపచ్చ తీగలోంచి వికసించే పూలంతటి కోమలంగా వాటిని సృజించారు. అందుకనే కాబోలు, ఆయనలోని చేతనా సౌకుమార్యం తనని అమితంగా ఆకర్షించిందన్నారు ఇస్మాయిల్‌ గారు. విస్తారంగా రాయకపోయినా, మధ్యేమధ్యే విరామం పాటించినా కథల పందిరి నీడని ఆయనెన్నడూ వదిలిపెట్టలేదు. 


తొలినాళ్ళ నుంచి కథలు చదవడం, విశిష్ట రచయితల్ని గుర్తించడం, మేలిమి కథల్ని పదుగురితో పంచుకోవడం విధిగా ఆచరించారు. ఆయన కనుగొన్న రచయితల్లో త్రిపుర గారు ప్రథముడని అంటారు. చలం, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, త్రిపుర వంటి ఇష్ట కథకుల ఔన్నత్యానికి నమస్కరిస్తూనే, యువ రచయితల్లో కొందరి రచనా కౌశలం చూసి పులకించిపోతుంటారు. గత డెబ్బై ఏళ్ళలో నాలుగు దఫాలుగా కొనసాగిన ఆయన సృజనలోంచి ముప్పై కథల్ని మాత్రమే పాఠకులకి అందుబాటులో ఉంచారు.


అవన్నీ గోదావరి వంతెన దాటే ప్రయాణీకులు జీవ జలాల్లోకి రాగి కాసులు విసిరే సత్యకాలపు కథలు. జీవితంలో వేదన, దుఃఖం, పోరాటమే కాకుండా ప్రేమ, శాంతి, ఆనందం కూడా ఉంటాయని రుజువు చూపిన కథలు. ఆయన కరుణార్ద్ర నేత్రాలతో, అంతఃచక్షువుతో దర్శించిన మానవ సంబంధాల్లోని సున్నితమైన కథలు. విజయవాడలో ఓ సాయంత్రం జగన్నాథరావు గారితో జరిపిన సంభాషణలో, తరతరాల కథ చుట్టూ తన జీవన గమనంతో పాటు పఠనానుభవం, రచనా నేపథ్యం గురించి అనేక సంగతులను ఇలా జ్ఞాపకం చేసుకున్నారు.


కృష్ణా జిల్లా గుడివాడలో 1934 జూన్‌ 20న పుట్టాను. అసలు ఊరు పశ్చిమ గోదావరిలోని ఆకివీడు. మా అమ్మ సుబ్బలక్ష్మి. పుస్తకాలు విరివిగా చదివేవారు. నా సాహిత్యా భిరుచికి అదొక కారణం. అన్నయ్య కుక్కుటేశ్వరరావు కూడా మంచి చదువరి. అప్పట్లో డిటెక్టివ్‌ నవలలు బాగా వచ్చేవి. అందులో బెంగాలీ నుంచి అనువాదాలు ఎక్కువగా ఉండేవి. అవీ, తెలుగు సాహిత్యం అమ్మ, అన్నయ్య చదివేవారు. నాతోనూ చదివించేవారు. ఆ విధంగా నా పఠనాసక్తి పెరిగింది.


నాన్న సూర్యనారాయణ ఎక్సయిజ్‌ డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా చేశారు. ఉద్యోగరీత్యా ఆయనకి బదిలీలు ఉండేవి. అందువల్ల నా చదువు అమలాపురం, తాడేపల్లి గూడెం, పెంటపాడు, తణుకు, భీమవరం తదితర చోట్ల కొనసాగింది. భీమవరంలో చదివిన కాలం (1945-1953) నా జీవితంలో ఎంతో విలువైనది. ఒక్క మాటలో చెప్పాలంటే భీమవరం నా జీవితాన్ని తీర్చిదిద్దింది.


అక్కడ చదువుకున్నప్పుడు, మా స్కూలు పక్కనే ఒక లైబ్రరీ ఉండేది. దాని గురించి నేను ఎరుగను. ఓ రోజున నా మిత్రుడి వస్తువొకటి ఆ ప్రాంగణంలోకి పడిపోయింది. దానిని తీసుకోవడానికి వెళితే పుస్తకాలు కనిపించాయి. ‘గ్రంథాలయం’ అనే బోర్డూ కనిపించింది. ఆ గ్రంథాలయా ధికారితో పరిచయం పెంచుకున్నాను. ఆయనే నాకు guide చేసి ఎన్నో పుస్తకాలను చదివించాడు. నా ఆసక్తి ఎలా ఉండే దంటే, కొన్నిసార్లు మధ్యాహ్నం స్కూలు మానేసి గ్రంథాలయం లోనే పుస్తకాలు చదువుకుంటూ ఉండిపోయేవాణ్ణి. 


ఆ రోజుల్లో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా పాలగుమ్మి పద్మరాజు గారు ఉండేవారు. నా సాహిత్య, వ్యక్తిత్వాలపై ఆయన స్ఫూర్తి ఉంది. పెద్దాడ రామస్వామి అప్పట్లో మా ప్రిన్సిపల్‌. ఆయన Shakespeare expert. మా కాలేజీ మామిడితోటలో ఉండేది. సాయంత్రం వేళ పెట్రోమాక్స్‌ లైట్ల వెలుగులో షేక్స్‌పియర్‌ నాటకాలను ఆయన బోధించే వారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి ఆసక్తిగా వినేవారు. దిగుమర్తి సీతారామస్వామి మాకు తెలుగు చెప్పేవారు. ఆయన రాసే పద్యాలు ‘భారతి’లో అచ్చయ్యేవి. దిగుమర్తి వారి సాంగత్యం గొప్ప ఉత్తేజం. 


బీఎస్సీ అయ్యాక బెనారస్‌ వెళ్ళి కెమికల్‌ ఇంజనీరింగ్‌లో చేరాను. అక్కడ నా ఆరోగ్యం చెడిపోవడంతో వెనక్కి వచ్చే శాను. కొత్తగా మరేదైనా కోర్స్‌ చేయాలనుకున్నాను. నాగపూర్‌ వెళ్ళి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీలో చేరాను. అప్పటికి అది కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సు. అక్కడే రెండేళ్ళు చదివాను. 


ఆ తర్వాత కొత్త కొత్త ప్రదేశాలకు తిరగాలనిపించింది. అది చేయమని, ఇది చేయమని మా నాన్న నన్ను వత్తిడి పెట్టేవారు కాదు. ఆయన్ని అందరూ gentleman అని పిలిచేవారు. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం కంటే కొంచెం ఎక్కువ. సంపన్నులం కాదు. అయినా కొన్నాళ్ళు దేశం పట్టుకు తిరిగాను. కోల్‌కతా, ముంబై, ఢిల్లీలలో కొంత కాలం ఉన్నాను. చివరికి 1963లో రేణిగుంటలోని ‘తిరుపతి కాటన్‌ మిల్స్‌’లో ఉద్యోగిగా చేరాను. అక్కడ ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళి నాకు కావలసిన పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాణ్ణి.


త్రిపుర రాసిన గొప్ప కథ ‘పాము’ని రేణిగుంటలో ఉన్నప్పుడే చదివాను. ఆ పూట భోజనం కూడా చేయలేదు. 18 పేజీల ఉత్తరం రాశాను. ఆ రచయిత చిరునామా తెలియదు. త్రిపుర పేరు రాసి కేరాఫ్‌ ‘భారతి’ పత్రికకి పోస్ట్‌ చేశాను. ఆ ఉత్తరాన్ని వాళ్ళు వెంటనే త్రిపురకి పంపించారు. ఆయనతో పరిచయం ఏర్పడింది. త్రిపురకి అభిమానిగా మారాను. ఆయన నన్ను "My first and last fan was Jagannadha Rao' అనే వారు. ‘పాము’ కథ కంటే ముందే ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’ అనే కథ ఆంధ్రపత్రికలో వచ్చింది. అది చదివిన జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత నేను ఆంధ్రజ్యోతి వీక్లీ అడ్రస్‌ ఇస్తే, దానిలో ‘భగవంతం కోసం’ కథ రాశారు. ‘చీకటి గదులు’ కథ ‘భారతి’లో వచ్చింది. తెలుగు పాఠకుల్ని ఓ సుడిగాలిలా, ఓ ప్రభంజనంలా, ఊపిరాడనీయకుండా ఉర్రూతలూపి, విచలితుల్ని, విభ్రాంతుల్ని చేశారు త్రిపుర గారు. శిల్పపరంగా కూడా అమోఘం, అద్వితీయమనిపించే శిల్ప పరిణతిని కథల్లో పొదిగి తెలుగు కథను పరిపుష్టం చేశారు. ఆయన దస్తూరి చాలా బాగుండేది. చక్కని ఉత్తరాలు రాసేవారు. 


1951లో రచనారంగంలోకి వచ్చాను. ఆ ఏడాది ఒక కథ రాశాను. అప్పటికే మా అన్న నాతో చలం పుస్తకాలు చదివించాడు. ఆ ప్రేరణతో ఆయన లాగే రాయాలని ఆ కథ రాశాను. కానీ అలా రాయకూడదని తెలుసుకుని దాన్ని అట్టేపెట్టేశాను. కొన్నేళ్ళ తర్వాత, అంటే 1959లో ఆ కథ ఆంధ్రపత్రికలో వచ్చింది. భమిడిపాటివారి కుటుంబం అంటే హాస్యానికి ప్రసిద్ధి కదా! అందువల్ల సరదాగా రాయాలని 1952లో ఓ రెండు కథలు రాశాను. అనంతర కాలంలో నా అభిప్రాయం మారింది. ఇకమీదట lighter wayలో రాయకూడదని అనిపించింది. సరైన పద్ధతిలో రాయాలని నిశ్చయించుకున్నాను. 


మిగతా ప్రక్రియలు రాయడం చేతకాదు కనుక కథని ఎంచుకున్నాను. పదో తరగతిలో పద్యాలు రాసే ప్రయత్నం చేశాను. కానీ అది నాకు నప్పదని అనిపించింది. నవల రాసేటంత ఓపిక, జ్ఞానం నాకు లేవు. నాటకం రాయడం కష్టం. అందుకే నేను నా అభివ్యక్తికి కథని ఎన్నుకున్నాను. నాకు జీవిత చరిత్రలంటే కూడా ఆసక్తి. జీవిత చరిత్రలలో సమాజ చిత్రణ, మనుషులు పడే సాధక బాధకాలు అన్నీ ఉంటాయి. అప్పటి కాలం, పరిస్థితులను వీలైనంత వాస్తవికంగా, సత్యపూరితంగా రాసే అవకాశం వాటిలో ఉంటుంది. ఇక తెలుగులో నవలా సాహిత్యం విషయానికి వస్తే, వాసిలో తక్కువే అనుకుంటాను. కన్నడ, బెంగాలీల కన్నా మనం వెనకబడే ఉన్నామనిపిస్తుంది. పాఠకుల అభిరుచి కూడా మారింది. నాసిరకం కథలు బాగున్నా యనే ధోరణి పెరిగింది. 


రాయకుండా ఉండలేనితనం, నా ఆలోచనలను పాఠకు లతో పంచుకోవాలనే కుతూహలమే నన్ను రచనకి ప్రేరేపి స్తాయి. కొన్నాళ్ళు రచనలు కొనసాగిస్తాను. సచేతనంగానే కొంత కాలం రాయడం మానేస్తాను. దీర్ఘమైన విరామం తీసుకుంటాను. 1952 నుంచి 1968 వరకూ 17 కథలు రాశాను. ఆ తర్వాత ఎన్నో విషయాలలో రాజకీయంగా, సామాజికంగా వచ్చిన మార్పులను తెలుసుకోవడం కోసం పుస్తకాలు చదువుతూ ఉండిపోయాను. 1968-1980 మధ్య ఏమీ రాయలేదు. 1980-1984 మధ్య ఆరు కథలు రాశాను. 1982లో ‘సముద్రం’ కథ రాశాను. నేను రాసిన వాటిలో ఆ కథ నాకు ఇష్టం. అంటే అది నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. 


1984 నుంచి మళ్ళీ కలం మూసేశాను. చదువులో పడ్డాను. 1999 వరకూ రాయలేదు. 1999 నుంచి 2003 వరకూ వరుసపెట్టి ఏడు కథలు రాశాను. అవి కూడా త్వరగానే ప్రచురితమయ్యాయి. ఈ రోజుల్లో రాసిన వాటిలో ‘మంటల్లో జాబిల్లి’, ‘మువ్వలు’, ‘బంతి’ కథలు కూడా నాకు తృప్తినిచ్చాయి. మిగతావి నా వరకు నేను average కథలనే అనుకుంటాను. 2003 తర్వాత తిరిగి కలం మూసేశాను. ఇటీవలే చినుకు పత్రికలో రెండు కథలు, నవ్య వీక్లీలో ఒక కథ, రచన మంత్లీలో ఒక కథ రాశాను. ఇవన్నీ కూడా 2015 వరకూ రాసినవే. ఆ తర్వాత శాశ్వతంగా నా కలం మూసేయాలని అనుకున్నాను. 


‘భమిడిపాటి జగన్నాథరావు కథలు’ (1996) పేరిట 15 కథలతో ఒక సంపుటం, ‘మువ్వలు’ (2009) శీర్షికన 15 కథలతో మరొక పుస్తకం, ‘అడుగుజాడలు’ (2012) పేరుతో ఎంపిక చేసిన పది కథలతో మూడో సంకలనం వెలువ డ్డాయి. నేను చేసిన కొన్ని రచనలు, నా కథలపై సహ రచయితలు రాసిన వ్యాసాలు, నా పుస్తకాలపై వచ్చిన సమీక్షలు కలిపి ‘పరస్పరం’ (2016) అనే పుస్తకాన్ని మిత్రులు ప్రచురించారు. 


ప్రపంచ కథాసాహిత్యంలో మపాసా, ఓ హెన్రీ, బాల్జాక్‌, టాల్‌స్టాయ్‌ నాకు ఇష్టమైన రచయితలు. తెలుగులో గురజాడ, చలం, చింతాదీక్షితులు, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు, రావిశాస్త్రి, త్రిపుర, ముళ్ళపూడి, కారా అంటే ఇష్టం. ఈ తరం కథకుల్లో డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌రావు, ఆర్‌.ఎం. ఉమామహే శ్వరరావు, ఖదీర్‌బాబు, అట్టాడ అప్పలనాయుడు వంటి పలువురు ఇష్టం. రచయితల కంటే నా చుట్టూ ఉండే జీవితమే నన్ను మిక్కిలి ప్రభావితం చేసింది. 


ఎత్తుగడ, పాత్రోచితమైన భాష, మాండలికం, కథన రీతి, సరైన ముగింపు- ఇవన్నీ కలిస్తేనే మంచి కథ అవుతుంది. మంచి భాష వాడినంత మాత్రాన మంచి కథ అయి పోదు. గొప్ప కథల్లో పాత్రలు జీవితాంతం మనల్ని వెంటాడ తాయి. చదివించే కథలు ఇటీవల బాగానే వస్తున్నాయి. కానీ, ఆ రచయితల్లో నిలేసి చదివించే నేర్పు కనిపించడం లేదు. కథా రచనలో ఇంకా మార్పు వస్తే బాగుంటుంది.


నా కథల్లో స్త్రీవాద స్పృహ ఎక్కువగానే ఉంటుంది. మా అమ్మ పడ్డ కష్టాలు, కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగకి ఆమె కళ్ళమ్మట కారే నీరు చూస్తే నాకు తెగ బాధేసేది. మా చుట్టుపక్కల ఉండే మహిళలపై సాగే పైకి కనపడని, కనిపించే హింసని చూడబట్టి స్త్రీవాద చైతన్యం అబ్బింది నాకు. మగవాళ్ళలో సంస్కారహీనత ఇప్పటికీ కొనసాగుతోంది. అది తప్పు అనిపించేది. అందుకే నా రచనల్లో ఆ అంశానికి ప్రాధాన్యం ఇచ్చాను. కానీ మనవాళ్ళ చర్మం దళసరి. తొందరగా చలించరు. నిజానికి చిన్నచిన్న ఉద్యోగులు, కూలిపనులు చేసేవాళ్ళలో ఎంతో సభ్యత కనిపిస్తుంది నాకు. ఆ సంస్కారం నాకెందుకు అలవడ లేదో అని సిగ్గుపడేవాడిని. అయితే దానినంతటినీ కథల్లో రాయలేకపోయాను.


రచయితగా కంటే పౌరుడిగా ఉండటమే నాకు ఇష్టం. నా జీవితం గడిచినంత మేరా బాగానే సాగింది. అయినా భరించలేనంత దుఃఖ సమయాలు ఉన్నాయి. నాకు ఒక్కతే చెల్లెలు. ఆమెతో అనుబంధం ఎక్కువ. ఉన్నట్టుండి చనిపోయింది. అది నా జీవితంలో తట్టుకోలేనంత విషాదం. నాకు ఇద్దరు కుమార్తెలు. ఢిల్లీలో ఉండే తెలుగు కుటుంబానికి చెందిన అబ్బా యితో రెండో అమ్మాయికి పెళ్ళయ్యింది. 1991లో ఆ దంపతులు సింగపూర్‌ వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆ అమ్మాయి incurable cancerతో చనిపోయింది. అది కూడా మరో తీవ్ర మైన shock. నా భార్య సుశీల 2015లో కన్నుమూ సింది. స్నేహితుల వల్ల, పుస్తకాల వల్ల ఆ భారాన్ని మోయగలిగాను. 


11965లో నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. సమాచార, పౌరసంబంధాల శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా, గవర్నర్‌ ప్రెస్‌ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ చేశాను. బెజవాడలో పరిస్థి తులు, వసతులపై మక్కువ కొద్దీ ఇక్కడే స్థిరపడ్డాను. ఇప్పుడు వయస్సు 85ఏళ్ళు. ఈనాటికీ చదవడమే నాకు ఇష్టం. నిత్యం చదువుతాను. సాహిత్యంలో అన్ని ప్రక్రి యలకి సంబంధించిన పుస్తకాలు అందులో ఉంటా యి. కానీ నా ప్రాధాన్యం మాత్రం కథే. కథలంటే నాకు అమితమైన ఇష్టం.

ఇంటర్వ్యూ:
నామాడి శ్రీధర్‌
ఒమ్మి రమేష్‌ బాబు

Advertisement
Advertisement
Advertisement