Abn logo
Jan 21 2021 @ 00:33AM

80సీ మినహాయింపు పరిమితి రూ.2 లక్షలు!?

కొత్త బడ్జెట్‌లో  ప్రకటించే అవకాశం

పన్ను శ్లాబులు మాత్రం యథాతథమే..!! 


న్యూఢిల్లీ: వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయం పన్ను(ఐటీ) శ్లాబులను సవరించే అవకాశాలేం కన్పించడం లేదు. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని మాత్రం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచే అవకాశముందని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ పరిమితిని రూ.3 లక్షల వరకు పెంచాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. తద్వారా కుటుంబాల పొదుపు, క్యాపిటల్‌ మార్కెట్లో రిటైల్‌ పెట్టుబడులకు మద్దతు లభిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 4-5 ఏళ్ల నుంచి ప్రభుత్వం 80సీ పన్ను మినహాయింపు పరిమితిని యథాతథంగానే కొనసాగిస్తూ వచ్చింది.


కరోనా సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు తరిగిపోయాయని, ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులందరికీ ఊరట కల్పించడం సాధ్యపడకపోవచ్చని ఐటీ అధికారి పేర్కొన్నారు. కాకపోతే, పొదుపు, పెట్టుబడులు, గృహ కొనుగోళ్లను ప్రోత్సహించేలా ఈసారి బడ్జెట్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐటీ సెక్షన్‌ 80సీ కింద వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల(హెచ్‌యూఎ్‌ఫ)కు చెందిన వారు  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్లు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు తదితరాలపై ఏడాదికి రూ.లక్షన్నర వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 


సెక్షన్‌ 80డీ పరిమితి కూడా పెంచే అవకాశం 

కరోనా వ్యాప్తితో ఆరోగ్య బీమా ఆవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై ఐటీ పన్ను మినహాయింపు పరిమితిని సైతం పెంచేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం, ఐటీ సెక్షన్‌ 80డీ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపుల్లో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. 


గిరాకీ పెంచాలి: ఇండస్ట్రీ 

ఈసారి బడ్జెట్‌లో వస్తు గిరాకీతోపాటు మౌలిక వసతుల ప్రాజెక్టులపై పెట్టుబడులు పెరిగేలా చర్యలు చేపట్టాలని, సామాజిక రంగాలకు కేటాయుంపులు పెంచాలని పారిశ్రామిక  వర్గాలు కోరుతున్నాయి. దేశంలో వస్తు తయారీ రంగ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు పరిశోధన, అభివృదిఽ్ధ ్ధ(ఆర్‌ అండ్‌ డీ), భవిష్యత్‌ సాంకేతికతలను ప్రో త్సహించేందుకు ఈసారి బడ్జెట్లో మరిన్ని చర్యలు చేపట్టాలని ఫిక్కీ, ధృవ అడ్వైజర్స్‌ సంయుక్త సర్వేలో ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డారు. 


వాహనాలకు తరుగు ప్రయోజనాలివ్వండి: ఫాడా 

వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు వాహనాలపై తరుగుదల ప్రయోజనాలను ప్రవేశపెట్టాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీల్స్‌ అసోసియేషన్‌(ఫాడా) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, కార్పొరేట్లకు తరుగుదల ప్రయోజనాలను క్లెయిమ్‌ చేసుకోగలిగే కాలపరిమితిని పొడిగించాలని బడ్జెట్‌ సిఫారసుల్లో పేర్కొంది. అంతేకాదు, 0.1 శాతం వార్షిక టీసీఎస్‌ (లావాదేవీ మూలం వద్ద పన్ను వసూలు) నిబంధన నుంచి ఆటో డీలర్లకు మినహాయింపు ఇవ్వాలని అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. వాహన రిటైల్‌ విక్రయ రంగంపై ఈ నిబంధన పెనుభారంగా మారిందని ఫాడా పేర్కొంది. 


ఒకే గొడుగు కిందికి ఆర్‌ఆర్‌బీలు 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల (ఆర్‌ఆర్‌బీ) విభాగంలో భారీ సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌బీలన్నింటినీ హోల్డింగ్‌ కంపెనీ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఈ సారి బడ్జెట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకే గొడుగు కింద చేర్చడం ద్వారా ఆర్‌ఆర్‌బీల్లో పాలన ప్రమాణాలను పెంచడంతోపాటు మార్కెట్‌ నుంచి నిధుల సేకరణకూ ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 43 ఆర్‌ఆర్‌బీలున్నాయి దేశవ్యాప్తంగా 21,871 శాఖలను నిర్వహిస్తున్నాయి. 


శాశ్వత రీఫైనాన్సింగ్‌ వసతి ఏర్పాటు చేయాలి: ఎన్‌బీఎ‌ఫ్‌సీలు 

తమకు నిధుల లభ్యతను కొనసాగించాలని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు(ఎన్‌బీఎ్‌ఫసీ) ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తమకు రుణాలిచ్చేలా బ్యాంక్‌లను మరింతగా ప్రోత్సహించాలంటున్నాయి. ఈసారి బడ్జెట్‌లో తమ రంగానికి శాశ్వత రీఫైనాన్సింగ్‌ వసతిని ప్రకటించాలని, విదేశాల నుంచి వాణిజ్య రుణాల సేకరణ నిబంధనలను సడలించాలని ఎన్‌బీఎ్‌ఫసీలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement