‘భరత్‌ అనే నేను’ తరహాలో ‘మైండ్‌బ్లాంక్‌’ జరిమానాలు

ABN , First Publish Date - 2020-10-22T09:34:19+05:30 IST

హీరో మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో వాహనదారులకు సీఎం భరత్‌ విధించే జరిమానాలు గుర్తుకు తెచ్చే విధంగా రాష్ట్రప్రభుత్వం దిమ్మతిరిగే

‘భరత్‌ అనే నేను’ తరహాలో ‘మైండ్‌బ్లాంక్‌’ జరిమానాలు

అనవసరంగా హారన్‌ కొడితే 2 వేలు ఫైన్‌

గీతదాటితే దిమ్మతిరిగినట్లే! 

బండి వేగంగా నడిపితే వెయ్యి బాదుడు

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు పది వేలు

రేసింగ్‌ రూ.5-10 వేలు

రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ లేకపోతే 2-5 వేలు

పర్మిట్‌ లేకుండా వాడితే పది వేలు

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే 1,000

అనవసరంగా హారన్‌ మోగిస్తే 2,000

పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే

డ్రైవింగ్‌ లైసెన్స్‌ జప్తు

రవాణాశాఖ ఉత్తర్వులు


అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): హీరో మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో వాహనదారులకు సీఎం భరత్‌ విధించే జరిమానాలు గుర్తుకు తెచ్చే విధంగా రాష్ట్రప్రభుత్వం దిమ్మతిరిగే రీతిలో ఫైన్లు ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మోటార్‌ వాహనాల నిబంధనలను ఉల్లంఘించినవారికి విధించే జరిమానాలను భారీగా పెంచింది. మోటార్‌ సైకిళ్లు, సెవెన్‌ సీటర్‌ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు సవరిస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది. బండి వేగంగా నడిపితే రూ.1,000.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు.. రేసింగ్‌ మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు.. రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు.. పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు.. ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం.. వాహనం బరువు చెకింగ్‌ కోసం ఆపకపోయినా రూ.40 వేలు జరిమానా.. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.1,000, అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ.1,000, రెండోసారి రూ.2 వేలు జరిమానా.. వాహన తనిఖీ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750, సమాచారం ఇవ్వకపోతే రూ.750, అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేలు, అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5 వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించింది.


రవాణా నిబంధనలు షెడ్యూల్‌ 7 ప్రకారం నియమావళిని ఉల్లంఘించిన వాహన తయారీదారు, డీలర్‌, దిగుమతిదారులకు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా జప్తు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కండక్టర్‌ లైసెన్స్‌కు అర్హత లేకుండా కండక్టర్‌గా పనిచేస్తే అలాంటి వారిపై కూడా రూ.1,000 జరిమానా విధిస్తారు.

Updated Date - 2020-10-22T09:34:19+05:30 IST