‘ప్రైవేటు’కు దోచిపెట్టేందుకే కొత్త ఇసుక విధానం

ABN , First Publish Date - 2021-06-03T05:58:19+05:30 IST

మొత్తం 471 ఇసుక రీచ్‌లలో రెండేళ్లపాటు ఇసుక వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసుకోవటానికి బడా కార్పొరేటు కంపెనీలు కాక ఇంకెవరు పోటీపడతారు. ఇలా రాష్ట్రంలోని చిన్నచిన్న కాంట్రాక్టర్లు....

‘ప్రైవేటు’కు దోచిపెట్టేందుకే కొత్త ఇసుక విధానం

మొత్తం 471 ఇసుక రీచ్‌లలో రెండేళ్లపాటు ఇసుక వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసుకోవటానికి బడా కార్పొరేటు కంపెనీలు కాక ఇంకెవరు పోటీపడతారు. ఇలా రాష్ట్రంలోని చిన్నచిన్న కాంట్రాక్టర్లు పోటీ పడకుండా రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా చేయడంలోనే అసలు కుట్ర ఉంది.


రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నూతన ఇసుక విధానంపై చర్చ జరుగుతున్నది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నట్లుగానే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఇసుక రీచ్‍లను తమ బాధ్యత నుంచి తప్పించి కార్పొరేట్ కంపెనీకి అప్పగించింది.


రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానం కాంట్రాక్టర్లకు కాసుల పంట పండించేలా, వినియోగదారులకు గుదిబండలా తయారయిందని వేరే చెప్పనవసరం లేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఇరవై రెండు మాసాల్లో రెండు కొత్త ఇసుక పాలసీలు తెచ్చి ఆ రంగంలో అనిశ్చితికి కారణమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని ఇసుక విక్రయ వ్యవస్థ లోపాలను చక్కదిద్దడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఇసుక దోపిడీ డ్వాక్రా గ్రూపుల ముసుగులో జరిగింది. ఇప్పుడు గంపగుత్తగా ఒకే కార్పొరేట్ కంపెనీకి అప్పగించి ప్రైవేటు దోపిడీకి గేట్లు బార్లా తెరిచారు.


ఆన్‌లైన్ విధానంపై వచ్చిన ఆరోపణలపై వేసిన మంత్రుల కమిటీ చివరికి ప్రైవేటీకరణకు పథకానికి పచ్చజెండా ఊపింది. ఆ పథకంలో భాగంగానే జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టు సంస్థకు ఏమీ మిగలదు అనే వాదనను ప్రభుత్వం ప్రచారంలో పెట్టింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం మొత్తం రాష్ట్రంలోని ఇసుక రీచ్‍లలో రెండు కోట్ల టన్నుల ఇసుక తవ్వితే, టన్నుకు 475 రూపాయల లెక్కన ఇసుక అమ్మకం వలన రూ.950 కోట్లు వస్తాయని, అందులో సర్కారుకు రూ.750 కోట్లు, నిర్వహణ ఖర్చులు రూ.65 కోట్లు పోగా మిగిలేది రూ.145 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం చెబుతోంది. కంపెనీ నుంచి రూ.120 కోట్ల బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటామని, కేవలం రూ.25కోట్ల కోసం ఏ సంస్థ అయినా అంత ష్యూరిటీ ఇవ్వటానికి ముందుకు వస్తుందా అనీ ప్రభుత్వం చెబుతోంది. నమ్మేవాళ్ళు ఉంటే ఎన్ని కథలైనా చెబుతారు.


ఇసుక తవ్వకాలకు, అమ్మకాలకు మొత్తం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విడగొట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలను జోన్ 1గాను; పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలను జోన్ 2 గాను; నెల్లూరు, రాయలసీమ జిల్లాలను కలిపి జోన్ 3గాను విడగొట్టారు. మొత్తం 471 ఇసుక రీచ్‌లలో రెండేళ్లపాటు ఇసుక వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసుకోవటానికి బడా కార్పొరేటు కంపెనీలు కాక ఇంకెవరు పోటీపడతారు. ఇలా రాష్ట్రంలోని చిన్నచిన్న కాంట్రాక్టర్లు పోటీ పడకుండా రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా చేయడంలోనే అసలు కుట్ర పథకం ఉంది.


‘ఇసుక విధానంపై విష ప్రచారాలు నమ్మకండి’ అంటూ జగన్ మీడియాలోనేగాక అన్ని దినపత్రికలలోనూ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెట్టి వాస్తవాలను తలకిందులు చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కాంట్రాక్టర్ ఎంపిక కోసం అత్యంత పారదర్శక విధానాన్ని పాటించామని చెప్పటం జనం చెవిలో పూలు పెట్టడమే! రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్ చేయడం ద్వారానే బడా కాంట్రాక్టర్‌కు అవకాశం కల్పించడం నిజం కాదా!


రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా రవాణా ఖర్చులతో కలిపి గరిష్ఠంగా ఏ ధరకు అమ్మ వచ్చో ప్రభుత్వం నిర్ణయించి ప్రకటిస్తుంది అనటంలోనూ మోసం ఉంది. గతంలో రవాణా చార్జీల బాదుడు పేరుతో ప్రజలు నష్టపోయారు. రాష్ట్రమంతా ఒక బడా కంపెనీ గుప్పిట్లో ఉన్న తర్వాత అక్రమ రవాణాను అరికడతామనటం వట్టి బూటకం. ఖనిజ వనరులను నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎండిసిని పూర్తిగా పక్కన పెట్టి ఒక బడా ప్రైవేటు కంపెనీకి పగ్గాలు అప్పజెప్పటమంటే సహజ వనరు అయిన ఇసుకను ప్రైవేటు రాబందులకు అప్పజెప్పడం కాదా!


ఈ అక్రమ విధానంపై రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ సరైన విమర్శ చేయటం లేదు. కాంట్రాక్టరుకు అనుభవం లేదనీ, నష్టాలలో ఉన్న కంపెనీ అనీ పైపై విమర్శలు చేస్తున్నారు తప్పితే అసలు ఇసుక రీచ్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటం లేదు. ప్రైవేటీకరణ విధానాలు అన్ని విధాలా నష్టదాయకం కనుక నూతన ఇసుక విధానం పేరుతో రాష్ట్రంలోని ఇసుక రీచ్‍లను బడా కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం మాని ప్రభుత్వమే ఇసుక వనరుల బాధ్యతను చేపట్టాలి. ఇంతకాలంగా అధికారంలో ఉన్న పార్టీలు ఇసుక రీచ్‍ల విషయంలో చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా సామాజికపరంగా చాలా నష్టాలు జరిగాయి. భవిష్యత్తులో మరిన్ని నష్టాలు జరగకుండా, జల వనరులను కాపాడుకోవడానికి అన్ని వర్గాల ప్రజలూ రాష్ట్రంలో ఇసుక వనరుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమైక్య పోరాటం చేయాలి.


ముప్పాళ్ళ భార్గవశ్రీ

సిపిఐ ఎమ్మెల్ రాష్ట్ర నాయకులు

Updated Date - 2021-06-03T05:58:19+05:30 IST