హ్యాట్రిక్‌తో ఘనంగా..

ABN , First Publish Date - 2020-02-28T10:09:40+05:30 IST

ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మాత్రమే రాణించినా బౌలర్ల సమష్ఠి దాడితో..

హ్యాట్రిక్‌తో ఘనంగా..

  • న్యూజిలాండ్‌పై  ఉత్కంఠ విజయం
  • చెలరేగిన షఫాలీ
  • టీ20 మహిళల ప్రపంచకప్‌
  • సెమీస్‌లో భారత్‌

 వరుసగా మూడు మ్యాచ్‌లు.. మూడు విజయాలు. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ అసాధారణ ఆటతీరుతో మహిళల ప్రపంచక్‌పలో భారత అమ్మాయిలు వహ్వా.. అనిపిస్తున్నారు. కివీ్‌సతో మ్యాచ్‌లోనూ ఎప్పటిలాగే టీనేజ్‌ సెన్సేషన్‌ షఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ మెరుపు ఆరంభాన్నివ్వగా.. 

ఆ తర్వాత స్వల్ప స్కోరును కాపాడే బాధ్యత బౌలర్లపై పడింది. ఈసారీ ఉత్కంఠను అధిగమిస్తూ వారు జట్టుకు విజయాన్నందించారు. తద్వారా ఈ మెగా టోర్నీలో సెమీ్‌సకు చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. అయితే 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలోనూ కివీస్‌ బ్యాట్స్‌వుమన్‌ అమేలియా కెర్‌ ఆఖరి బంతి వరకూ భారత శిబిరంలో ఓటమి భయాన్ని రేపింది. కానీ శిఖా పాండే సూపర్‌ బౌలింగ్‌తో జట్టు గట్టెక్కింది. 


మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మాత్రమే రాణించినా బౌలర్ల సమష్ఠి దాడితో గురువారం జరిగిన ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై మూడు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచిన భారత్‌ ఇతర జట్లకన్నా ముందే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. తానియా భాటియా (23) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో రాధా యాదవ్‌ (9 బంతుల్లో 1 సిక్స్‌తో 14 నాటౌట్‌) కీలక పరుగులు సాధించింది. అమేలియా కేర్‌, రోజ్‌మేరీ మెయిర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసి ఓడింది. అమేలియా కేర్‌ (19 బంతుల్లో 6 ఫోర్లతో 34 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. దీప్తి, శిఖా, రాజేశ్వరి, పూనమ్‌, రాధా యాదవ్‌ తలో  వికెట్‌ తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షఫాలీ వర్మ నిలిచింది.


ఆఖర్లో ఉత్కంఠ రేపినా..: 134 పరుగుల లక్ష్యం కివీస్‌ ముందు తక్కువే అనిపించింది. అయితే ఈసారి కూడా బౌలర్లు మాయ చేయకపోరా అన్న అంచనాలను మనోళ్లు నిజం చేసి చూపించారు. రెండో ఓవర్‌ నుంచే వికెట్ల పతనాన్ని ఆరంభించారు. కీలక బ్యాటర్స్‌ సోఫీ డివైన్‌ (14), సుజీ బేట్స్‌ (6) విఫలమవడంతో కివీస్‌ 34 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ స్పిన్‌తో ఇబ్బందిపెట్టారు. అయితే మిడిలార్డర్‌ ప్లేయర్స్‌ భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మార్టిన్‌ (25), మ్యాడీ గ్రీన్‌ (24) కలిసి నాలుగో వికెట్‌కు 43 రన్స్‌ జోడించినా స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీ అవుటయ్యారనే ఆనందం ఎక్కువసేపు లేకుండా కెర్‌, జెన్సెన్‌ (11) కాసేపు భారత్‌ను భయపెట్టారు. 12 బంతుల్లో 34 పరుగులు రావాల్సిన దశలో కెర్‌ చుక్కలు చూపించింది. పూనమ్‌ వేసిన 19వ ఓవర్‌లో ఆమె నాలుగు ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా టెన్షన్‌ మొదలైంది. దీంతో చివరి 6 బంతుల్లో 16 రన్స్‌ కష్టం కాదేమో అనిపించింది. శిఖా పాండే వేసిన ఓవర్‌ తొలి బంతినే జెన్సెన్‌ ఫోర్‌గా మలిచింది. అయితే ఆ తర్వాత మూడు బంతులకు సింగిల్స్‌ మాత్రమే వచ్చాయి. ఇక రెండు బంతుల్లో రెండు ఫోర్లు సాధిస్తే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళుతుందనగా ఐదో బంతిని కెర్‌ అద్భుత స్కూప్‌ షాట్‌తో బౌండరీకి తరలించింది. అయితే యార్కర్‌గా వేసిన చివరి బంతిని కెర్‌ భారీ షాట్‌ ఆడాలని చూసినా విఫలమైంది. దీనికితోడు రెండో పరుగు కోసం వెళ్లి జెన్సెన్‌ రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది.

భారత బ్యాటింగ్‌.. అదే తీరు: ఓపెనింగ్‌లో షఫాలీ చెలరేగడం.. మిగతా వారంతా బ్యాట్లెత్తేయడం.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఇదే సీన్‌ కనిపించింది. అయితే చివర్లో టెయిలెండర్లు విలువైన పరుగులు జోడించడం భారత్‌కు కలిసివచ్చింది. స్టార్‌ బ్యాట్స్‌వుమెన్‌ స్మృతి మంధాన (11), జెమీమా (10), హర్మన్‌ప్రీత్‌ (1) విఫలమైనా భారత్‌ పోరాడే స్కోరును సాధించడం షఫాలీ పుణ్యమే. రెండు ఫోర్లతో టచ్‌లో ఉన్నట్టే కనిపించిన స్మృతి రెండో ఓవర్‌లోనే వెనుదిరిగింది. ఈదశలో తానియా, షఫాలీ జోడీ ఆదుకుంది. ఐదో ఓవర్‌లో వర్మ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదింది. 8, 10వ ఓవర్‌లో తానిచ్చిన రెండు క్యాచ్‌లను కివీస్‌ ఫీల్డర్లు వదిలేశారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 51 పరుగులు జోడించింది. అయితే 11వ ఓవర్‌ నుంచి కివీస్‌ బౌలర్లు పైచేయి సాధించారు. 12వ ఓవర్‌లో జెమీమా అవుట్‌ కాగా, షఫాలీ మాత్రం 4,6తో ఎదురుదాడికి దిగింది. కానీ 18 పరుగుల తేడాతో హర్మన్‌, షఫాలీ, వేద (6), దీప్తి (8)ల వికెట్లు కోల్పోవడం భారత్‌ స్కోరుపై ప్రభావం చూపింది. చివరి ఓవర్‌లో రాధా యాదవ్‌ వేగంగా ఆడి 12 రన్స్‌ సాధించడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది.


షఫాలీ రికార్డు

16 ఏళ్ల షఫాలీ వర్మ కొత్త రికార్డు నెలకొల్పింది. తొలిసారిగా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ఆమె ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో 172.72 స్ట్రయిక్‌ రేట్‌తో 114 పరుగులు సాధించింది. దీంతో ఓ టీ20 ప్రపంచక్‌పలో అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. బౌండరీ (11 ఫోర్లు, 8 సిక్సర్లు)ల పరంగా కూడా ప్రస్తుతానికి ఈ టోర్నీలో ఆమే ముందుంది. ఇక అంతర్జాతీయ మహిళల టీ20ల్లో కనీసం 200 పరుగులు చేసిన వారిలోనూ షఫాలీ స్ట్రయిక్‌ రేట్‌ (147.97) అత్యధికం కావడం విశేషం. ఆ తర్వాత క్లో ట్రియాన్‌ (దక్షిణాఫ్రికా 138.31), అలీసా హీలీ (ఆసీస్‌ 129.66) ఉన్నారు. షఫాలీ 17 టీ20ల్లో 438 పరుగులు సాధించింది. 


 స్కోరుబోర్డు

భారత్‌: షఫాలీ వర్మ (సి) జెన్సెన్‌ (బి) కెర్‌ 46; స్మృతి మంధాన (బి) తహుహు 11; తానియా భాటియా (సి) కెర్‌ (బి) మెయిర్‌ 23; జెమీమా (సి) కెర్‌ (బి) మెయిర్‌ 10; హర్మన్‌ప్రీత్‌ (సి అండ్‌ బి) కాస్పెరెక్‌ 1; దీప్తి శర్మ (సి) జెన్సెన్‌ (బి) డివైన్‌ 8; వేద (ఎల్బీ) కెర్‌ 6; శిఖా పాండే (నాటౌట్‌) 10; రాధా యాదవ్‌ (రనౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 133/8. వికెట్ల పతనం: 1-17, 2-68, 3-80, 4-93, 5-95, 6-104, 7-111, 8-133. బౌలింగ్‌: తహుహు 2-0-14-1; మెయిర్‌ 3-0-27-2; డివైన్‌ 2-0-12-1; అన్నా పీటర్సన్‌ 2-0-19-0; జెన్సెన్‌ 3-0-20-0; కెర్‌ 4-0-21-2; కాస్పెరెక్‌ 4-0-19-1.

న్యూజిలాండ్‌: రాచెల్‌ ప్రీస్ట్‌ (సి) రాధా యాదవ్‌ (బి) శిఖా పాండే 12; డివైన్‌ (సి) రాధా యాదవ్‌ (బి) పూనమ్‌ 14; సుజీ బేట్స్‌ (బి) దీప్తి శర్మ 6; గ్రీన్‌ (సి) తానియా (బి) గైక్వాడ్‌ 24; మార్టిన్‌ (సి) రోడ్రిగ్స్‌ (బి) రాధా యాదవ్‌ 25; కెర్‌ (నాటౌట్‌) 34; జెన్సెన్‌ (రనౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 130/6. వికెట్ల పతనం: 1-13, 2-30, 3-34, 4-77, 5-90, 6-129. బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-27-1; శిఖా పాండే 4-0-21-1; రాజేశ్వరి గైక్వాడ్‌ 4-0-22-1; పూనమ్‌ యాదవ్‌ 4-0-32-1; రాధా యాదవ్‌ 4-0-25-1.

Updated Date - 2020-02-28T10:09:40+05:30 IST