Abn logo
Aug 2 2020 @ 05:40AM

దారి కష్టాలు

మధ్యలోనే నిలిచిన డంపింగ్‌యార్డు పనులు

మూడు చోట్ల స్థలాలు మారినా అడ్డంకులు 


శామీర్‌పేట రూరల్‌ : పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతీ గ్రామానికి డంపింగ్‌ యార్డులను నిర్మించాలని పంచాయతీ పాలకవర్గాలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ స్థలం కొరకు గ్రామంలో సర్వే చేపట్టి డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు చేపట్టినా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. శామీర్‌పేట మండలం యాడారం గ్రామంలో డంపింగ్‌యార్డు నిర్మాణానికి మూడు చోట్ల స్థలాలు గుర్తించిన అధికారులు మైసమ్మ చెరువు సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో డంపింగ్‌యార్డుకు దారి లేదని పక్కనే ఉన్న సదురు భూయజమాని అడ్డుగా చుట్టూ ఫెన్సింగ్‌ వేశాడు. ఆ స్థలాన్ని తాము గతంలోనే కొనుగోలు చేశామని డంపింగ్‌యార్డు నిర్మాణ పనులకు దారి ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పానాదిని దారి ఇవ్వకపోవడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు దారి లేక నిలిచిపోయాయి. పాలకవర్గ సభ్యులు, సర్పంచ్‌ సంబంధిత వ్యక్తులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది.  ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌ యాంజాల సుజాతారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Advertisement
Advertisement