Abn logo
Apr 21 2021 @ 00:44AM

మళ్లీ కట్టఢీ .. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ

 8గంటలకే దుకాణాలు మూత.. 

 అత్యవసర సర్వీసులకు మినహాయింపు

 మే1 ఉదయం వరకు అమలుకు ఉత్తర్వులు

ఖమ్మం/కొత్తగూడెం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మళ్లీ గతేడాది ఇవాళ్లి రోజుల్లో ఉన్న పరిస్థితులే మళ్లీ రాబోత్ను సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనా రెండోదశ వ్యాప్తి విపరీ తంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలకమైన కర్ఫ్యూ నిర్ణయం తీసుకుంది. వైరస్‌ ఉధృతిని అరికట్టడంలో భాగంగా మళ్లీ కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది మొదటి దశ వ్యాప్తి సమయంలో  ఒక్కరోజు జనతా కర్ఫ్యూ విధించి మరుసటి రోజు లాక్‌డౌన్‌ ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పది రోజులపాటు రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ విష్ణు వారియర్‌ కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంగళవారం రాత్రి నుంచే కర్ఫ్యూను అమలు చేయగా.. ఇది మే 1 ఉదయం వరకు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో గతేడాది కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించిన నాటి రోజులను ప్రజలు మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పడిన బాధలను, అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల ఆగడాలను అరికట్టేలా పోలీసు శాఖ తీసుకున్న చర్యలు పునరావృతమవుతాయంటూ చర్చించుకుంటున్నారు. 

అత్యవసర సేవలకు ఆంక్షల్లేవ్‌.. 

రాత్రి వేళల్లో మాత్రమే కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆ నిర్ణీత సమయంలో పలు అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చింది. అందులో ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మిడియా, టెలీకమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌ కేబుల్‌ సర్వీసులు, ఐటీ సర్వీసులు, గూడ్స్‌ సర్వీసులు, పెట్రోల్‌ పంపులు, గ్యాస్‌ సర్వీసులు, విద్యుత్‌ సర్వీసులు, నీటి సరఫరా, పారిశుధ్యం, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు లాంటి వాటికి మినహాయింపులు ఇస్తున్నట్టు పేర్కొంది. వాటితోపాటు అత్యవసర విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, వైద్యసేవల కోసం ఆసుపత్రులకు వెళ్లే గర్భిణులు, రోగులు, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్లకు వెళ్లే వారు సంబంధిత టిక్కెట్లతో వెళ్లడానికి అనుమతులిచ్చింది. 

థియేటర్లూ బంద్‌.. ‘వకీల్‌సాబ్‌’కు మాత్రమే అనుమతి

ఇప్పుడిప్పుడే నడుస్తున్నాయనుకున్న సినిమా థియేటర్లు మళ్లీ మూతపడనున్నాయి. బుధవారం నుంచి థియేటర్లను బంద్‌ చేయాలని థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే అనుమతి పొందిన కారణంగా వకీల్‌సాబ్‌ సినిమా ఉన్న థియేటర్లు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. ఇరుజిల్లాల్లో ప్రస్తుతం 33థియేటర్లు నడుస్తుండగా.. ఖమ్మం జిల్లాలో 16, భద్రాద్రి జిల్లాలో 17 ఉన్నాయి. ఆయా థియేటర్లలో ఖమ్మం నగరంలో 8, మధిరలో 3, సత్తుపల్లి 3, వైరా 1, నేలకొండపల్లి 1, కొత్తగూడెం 5, పాల్వంచ 3, భద్రాచలంలో 3, సారపాక ఒకటి, ఇల్లెందు 3, మణుగూరు రెండు ఉన్నాయి. వాటిల్లో 500 నుంచి 900 వరకు సీట్లు ఉండగా వాటిల్లో రూ.10, 20, 50, 70 లెక్కన థియేటర్‌ను భట్టి టిక్కెట్లు విక్రయాలు జరుగుతుంటాయి. అలా ఒక్కో థియటర్‌కు సీట్లు పూర్తిగా నిండితే ఒక్కో ఆటకు సుమారు రూ.40 నుంచి రూ.45వేల వరకు రాబడి ఉంటుంది. ఇలా రోజుకు రూ.1.80లక్షలు ఆదాయం వస్తుంది. అలా రోజుకు సుమారు రూ.60లక్షలు యజమానులకు నష్టం చేకూరనుంది. 

 ఎన్నికల నిర్వహణపై పార్టీల్లో ఉత్కంఠ..

ఓ వైపు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల సందడి మొదలైంది. మరో 9రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. ఈక్రమంలో కర్ఫ్యూ విధించడంతో అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా అన్న అంశంపై అటు రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కరోనా వేళ ఎన్నికల జరిగినా పోలింగ్‌ శాతం ఆశించినంత వస్తుందా లేదా అనుమానం వ్యక్తం చేస్తున్న సమయంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారని, ఆ తర్వాత వెంటనే లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందన్న ప్రచారం జరుగుతుండటంతో మున్ముందు ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. ఎన్నికలు నిలిపివేస్తారా? లేదంతే కర్ఫ్యూ జరిగేది రాత్రి వేళల్లోనే కాబట్టి నిబంధనల మధ్య ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎన్నికలు ముగిసిన తర్వాత లాక్‌డౌన్‌ ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

గుర్తింపు కార్డులు ఉంచుకోవాలి

ఆర్వీ కర్ణన్‌, ఖమ్మం కలెక్టర్‌ 

కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన కర్ఫ్యూ జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయనున్నాం. అత్యవ సర సేవలు మినహాయించి మిగిలిన వాణిజ్య సేవలు, వ్యాపార సంస్థలన్ని రాత్రి 8 గంటల్లోపు మూసివేయాలి. లేదంటే కర్ఫ్యూ ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు తీసుకో వాల్సి వస్తుంది. కర్ఫ్యూ వేళల్లో ప్రయాణాలు చేసేవారు తమ టిక్కెట్లను, ఇతర అత్యవసర సేవలందించే సిబ్బంది తమ గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలి. అందరూ సహకరించి కరోనా వ్యాప్తినియంత్రణకు నడుం బిగించాలి. 

కర్ఫ్యూను పటిష్ఠంగా అమలుచేయాలి

ఏంవీ రెడ్డి, భద్రాద్రి  కలెక్టర్‌ 

నైట్‌కర్ఫ్యూను యంత్రాంగం పటిష్ఠంగా అమలుచేయాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. తగిన కారణా లు లేకుండా కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుం టాం. పగటి వేళ సంచరించేటప్పుడు కూడా మాస్క్‌ తప్పని సరిగా ధరించాలి. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. 

రాష్ట్ర, అంతరాష్ట్ర సర్వీసులు యథాతథం

విష్ణు వారియర్‌, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ 

కరోనా నిబంధనల్లో భాగంగా ఏర్పాటు చేసిన కర్ఫ్యూ సమయంలో రాష్ట్ర, అంతరాష్ట్ర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి. మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకివచ్చింది. రాత్రి 8 గంటల వరకే కార్యాలయాలు, దుకాణా లు మూసివేయాలన్నారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన అత్యవసర సర్వీసులు మినహా ఎవరూ రాత్రి 9 గంటలనుంచి బయటకు రావొ ద్దు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించి కరోనా కట్టడికి కలిసిరావాలి. 

కరోనా నివారణ చర్యలకు ప్రజలు సహకరించాలి 

సునీల్‌దత్‌,  భద్రాద్రి ఎస్పీ 

కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి. ప్రజలందరూ పగటి పూట ఆరుబయట సంచరించే టప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి 8గంటల తర్వాత అన్ని వ్యాపార సముదాయాలు మాసివేయాలి. కర్ప్యూనుంచి మినహాయింపు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్‌ సిబ్బంది, మీడియా ప్రతినిధులు విధిగా తమ ఐడీ కార్డులను కలిగి ఉండాలి.  


Advertisement
Advertisement