క్లినికల్‌ ట్రయల్స్‌కు నిమ్స్‌ సిద్ధం

ABN , First Publish Date - 2020-07-05T07:16:27+05:30 IST

కరోనా నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు నిమ్స్‌ సిద్ధమైంది.

క్లినికల్‌ ట్రయల్స్‌కు నిమ్స్‌ సిద్ధం

బంజారాహిల్స్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు నిమ్స్‌ సిద్ధమైంది. ఈ నెల 7 నుంచి 28 రోజుల పాటు మానవులపై ప్రయోగాలను చేపట్టనుంది. శనివారం నిమ్స్‌ ఎథికల్‌ కమిటీ సమావేశమై.. మానవ ప్రయోగాలకు ఆమోదించింది. సమావేశ వివరాలను ఐసీఎంఆర్‌కు పంపించారు. అక్కడి నుంచి మరోమారు ఆదేశాలు అందిన తర్వాత మంగళవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం చాలామంది ముందుకొస్తున్నారని, వారందరి పేర్లను నమోదు చేసుకుంటున్నామన్నారు. ఎంపిక చేసిన వ్యక్తులకు మొదటి డోసు ఇస్తామని, రెండు రోజులపాటు వారిని ఆస్పత్రిలో వైద్య బృందం పర్యవేక్షణలో పెడతామని చెప్పారు. 14 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తామన్నారు. ఇలా 30-60 మందికి క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తామన్నారు. రెండు దశల ట్రయల్స్‌ తర్వాత నివేదికలను ఐసీఎంఆర్‌కు పంపిస్తామని వివరించారు. మొదటి దశలో 375 అంశాలపై.. రెండో దశలో 875 అంశాలపై ట్రయల్స్‌ ఉంటాయని చెప్పారు.

Updated Date - 2020-07-05T07:16:27+05:30 IST