జ్ఞానంతోనే తొలగే ‘అహం’ భావన

ABN , First Publish Date - 2020-06-23T09:50:21+05:30 IST

మనకు నిరంతరం వచ్చే ఆలోచనలే, సంకల్పాలే, వృత్తులే మనసు. అయితే, ఈ ఆలోచనలన్నీ అహం అనే వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. కనుక ఈ అహం అనే వృత్తే మనసు అని తెలుసుకోవాలని దీని అర్థం. భగవాన్‌ రమణమహర్షి మానవాళికి అందించిన 31 శ్లోకాల

జ్ఞానంతోనే తొలగే ‘అహం’ భావన

వృత్తయస్త్వహం వృత్తి మాశ్రితః

వృత్తయోమనో విద్ధ్యహం మనః


మనకు నిరంతరం వచ్చే ఆలోచనలే, సంకల్పాలే, వృత్తులే మనసు. అయితే, ఈ ఆలోచనలన్నీ అహం అనే వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. కనుక ఈ అహం అనే వృత్తే మనసు అని తెలుసుకోవాలని దీని అర్థం. భగవాన్‌ రమణమహర్షి మానవాళికి అందించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞానం.. ‘ఉపదేశసారం’ గ్రంథంలోని 18వ శ్లోకమిది. మనసంటే ఏమిటనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఎలా ఆలోచించాలో రమణులు ఈ  శ్లోకం ద్వారా తెలిపారు. మనసు అనేది ఒక వస్తువు కాదు. కాళ్లు, చేతులు, తల, మీసాలు, గడ్డాలు ఉన్న వ్యక్తి కాదు. మరేమిటి? అంటే.. నిరంతరం కదులుతుండే ఆలోచనలే మనసు. ఆ ఆలోచనలనే సంకల్పాలని, భావనలని, వృత్తులని అంటారు. ప్రతిరోజూ మనకు ఇలాంటి ఆలోచనలు, వృత్తులు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఇది చెట్టు, ఇది పుస్తకం, ఇది కుర్చీ, అది మేడ, అది ఆకాశం.. ఇలా ఎన్నో వృత్తులు కదిలిపోతూ ఉంటాయి. ఇలా కదిలిపోయే వృత్తులు అనేకం. అనంతం. అయితే, ఈ వృత్తులన్నీ ‘నేను’ అనే ఒకే ఒక్క వృత్తి వల్ల.. ‘అహం’ వృత్తి వల్లే కదులుతున్నాయి. ‘నేను’ అనే భావన ఉంటేనే ఈ వృత్తులన్నీ. ఆ భావనే లేనప్పుడు ఇక ఏ ఆలోచనలూ కదిలే అవకాశం లేదు. సముద్రం ఉన్నప్పుడే అలలు నిరంతరాయంగా కదులుతుంటాయి. సముద్రమే లేకపోతే ఇక అలలకు ఆస్కారం ఎక్కడుంది? అది గోడ.. అని ఎలా తెలిసింది? ‘నేను’ చూశాను గనుక. అది పక్షి అని.. ‘నేను’ చూశాను గనకే తెలిసింది.


అంటే.. అనేక విషయాలు తెలియబడుతున్నాయి. వాటన్నింటినీ తెలుసుకునే ‘నేను’ ఒకటి ఉన్నది. ఇలా తెలియబడేవన్నీ ‘ఇదం’ భావనలని.. తెలుసుకొనేది ‘అహం’ భావన అని.. వేదాంతం చెబుతోంది. ఈ రెండూ (ఇదం-అహం) బాగా అర్థమైతే వేదాంతం బాగా తెలిసినట్లే. ‘ఇదం’ భావనలన్నీ ‘నా’కన్నా వేరైనవి. వాటిని తెలుసుకునేది, అర్థం చేసుకునేది, భావించేది ‘అహం’ భావన. ఇదే ‘నేను (ఫాల్స్‌ ఐ)’. ఇదం భావనలన్నింటికీ ఆధారం ఒకే ఒక్కటైన అహం భావనయే. ఈ శ్లోకంలోని మొదటి పాదం అర్థం అదే. ‘వృత్తయఃతు అహం వృత్తిం ఆశ్రితా’.. అన్ని వృత్తులూ అహం వృత్తిని ఆశ్రయించుకుని ఉంటాయి. బిడ్డలు అనేకమంది ఉండొచ్చు. తల్లి మాత్రం ఒక్కరే. నేను చూశాను, నేను తిన్నాను, నేను వెళ్లాను, నేను మాట్లాడాను.. ఇలా అన్నిటికీ ఆధారం ‘నేను’ అనే వృత్తి ఒక్కటే. ఇదం వృత్తులూ మారుతూ ఉంటాయి. అవి అహం వృత్తి మీద ఆధారపడి ఉంటాయి. మరి.. ఇదం వృత్తులు లేకపోతే అహం వృత్తి ఉంటుందా? ఉండదా? అంటే.. ఉంటుంది. ఇక్కడే యోగమార్గానికి, జ్ఞాన మార్గానికి గల భేదాన్ని అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. ‘యోగః చిత్తవృత్తి నిరోధః’ అన్నారు. చిత్తవృత్తులను అంటే ఇంతవరకూ చెప్పుకున్న ఇదం వృత్తులను.. అన్ని ఆలోచనలనూ నిరోధించడమే యోగం. అన్ని ఆలోచనలూ నిరోధించబడినా.. అలానిరోధించబడ్డాయనే ఆలోచన మాత్రం ఉంటుంది. అదే అహం వృత్తి (ఫాల్స్‌ ఐ). ‘నాకు ఈ రోజు ధ్యానం చక్కగా కుదిరిందండీ’ అని గ్రహించడం కూడా అహం వృత్తే. దాన్ని కూడా తొలగించేదే జ్ఞానమార్గం. యోగ మార్గం ద్వారా కేవలం ‘ఇదం’ భావనలను మాత్రమే నిరోధించవచ్చు. ‘అహం’ భావన పోవాలంటే అందుకు కావాల్సింది జ్ఞానమార్గమే సరైనది. అది ఎలా సాధ్యమవుతుందనే విషయాన్ని రమణులు తదుపరి శ్లోకంలో తెలిపారు.

-దేవిశెట్టి చలపతిరావు

Updated Date - 2020-06-23T09:50:21+05:30 IST