బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లకు నో ఎంట్రీ !

ABN , First Publish Date - 2021-11-27T06:10:26+05:30 IST

బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించాలన్న టాటా, బిర్లా, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా వంటి కొన్ని దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ఆశలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నీళ్లుచల్లింది. కార్పొరేట్‌...

బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లకు నో ఎంట్రీ !

వర్కింగ్‌ గ్రూప్‌ సిఫారసులను పక్కనపెట్టిన ఆర్‌బీఐ


ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించాలన్న టాటా, బిర్లా, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా వంటి కొన్ని దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ఆశలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నీళ్లుచల్లింది. కార్పొరేట్‌ రంగాన్ని బ్యాంకింగ్‌ విభాగంలోకి అనుమతించాలని ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్‌ ప్రసన్న కుమార్‌ మొహంతి అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్‌ గ్రూప్‌ చేసిన సిఫారసును ఆర్‌బీఐ పక్కన పెట్టింది. గత ఏడాది నవంబరులో సమర్పించిన నివేదికలో ఈ వర్కింగ్‌ గ్రూప్‌ పారిశ్రామిక సంస్థలకు బ్యాంకింగ్‌ లైసెన్సులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అప్పట్లోనే దీనిపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ ఈ విషయాన్ని పక్కనపెట్టిందని భావిస్తున్నారు. 


ఐదేళ్ల వరకు ఓకే : అయితే కొత్తగా బ్యాంకింగ్‌ లైసెన్సు పొందిన ప్రమోటర్లు తొలి ఐదేళ్ల వరకు బ్యాంక్‌ ఈక్విటీలో పూర్తి వాటా కలిగి ఉండేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఐదేళ్ల తర్వాత మాత్రం ఈక్విటీలో ప్రమోటర్ల వాటా 40 శాతం మించకూడదని స్పష్టం చేసింది. ప్రారంభంలో బ్యాంక్‌ వ్యాపార అభివృద్ధికి అవసరమైన నిధులు సమీకరణ దృష్ట్యా  ప్రమోటర్లకు ఈ స్వేచ్ఛ అవసరమని పేర్కొంది. లేకపోతే నిధుల సేకరణ కష్టమై బ్యాంక్‌ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని తెలిపింది. 


15 ఏళ్ల తర్వాతే: దీర్థకాలంలో (15ఏళ్ల తర్వాత) ప్రమోటర్లు  బ్యాంకుల ఈక్విటీలో  తమ వాటాను ప్రస్తుత 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. దీంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రధాన ప్రమోటర్‌ ఉదయ్‌ కోటక్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు హిందుజా సోదరులకు మేలు జరగనుంది. కష్టపడి నిర్మించుకున్న తమ బ్యాంకుల్లో తన వాటాను 15 శాతం దిగువకు కుదించుకోవాలన్న ఆర్‌బీఐ ఆదేశాలపై ఉదయ్‌ కోటక్‌ పోరాటమే చేయాల్సి వచ్చింది. 

Updated Date - 2021-11-27T06:10:26+05:30 IST