నాలుగు నెలలుగా జీతాల్లేవు

ABN , First Publish Date - 2020-08-10T09:11:26+05:30 IST

ఆరు నెలలపాటు పూర్తిస్థాయి వీసీ, ఎండీ లేక అవస్థలు పడిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌)కు కొత్త అధికారి వచ్చినా ..

నాలుగు నెలలుగా  జీతాల్లేవు

దిక్కుతోచని స్థితిలో స్పోర్ట్స్‌ స్కూల్‌ సిబ్బంది

గచ్చిబౌలి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులదీ ఇదే వ్యథ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆరు నెలలపాటు పూర్తిస్థాయి వీసీ, ఎండీ లేక అవస్థలు పడిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌)కు కొత్త అధికారి వచ్చినా ‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే’ అనే చందాన పరిస్థితి తయారైంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని నియమించడం పక్కనపెడితే ఉన్న సిబ్బందికి జీతాలు చెల్లించడంలో కూడా శాట్స్‌ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఔట్‌సోర్సింగ్‌ కోచ్‌లతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 63 మంది ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

ప్రత్యేక బడ్జెట్‌ లేమితో..

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ 1992లో స్థాపించినప్పుడు దానికి ప్రత్యేక బడ్జెట్‌ ఉండేది. ఆర్థిక శాఖ నుంచి నేరుగా నిధులు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు వరకు ఈ ప్రత్యేక బడ్జెట్‌ విధానం కొనసాగేది. అనంతరం శాట్స్‌ బడ్జెట్‌లో దీనిని కలిపేశారు. దీంతో ప్రస్తుతం స్పోర్ట్స్‌ స్కూల్‌కి ఓఎ్‌సడీ ఉన్నా సిబ్బందికి జీతాలు చెల్లించడానికి శాట్స్‌ మీద ఆధారపడాల్సి వస్తోంది. విచిత్రమేమిటంటే కోచింగ్‌ సిబ్బందిలో శాట్స్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఆరుగురికి క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తుండగా వారితో  పాటు పనిచేస్తున్న మిగిలిన 63 మంది సిబ్బందికి మాత్రం కొవిడ్‌-19 సాకుతో నిలిపేశారు. వీరితో పాటు గచ్చిబౌలి స్టేడియంలో ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న 25 మంది హౌస్‌కీపింగ్‌ సిబ్బందికి కూడా మూణ్నెళ్లుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. జీతాల చెల్లింపులో జాప్యంతో పాటు ఉద్యోగుల వేతనంలో ఈఎ్‌సఐకి కోత విధిస్తున్న మొత్తాన్ని కూడా సక్రమంగా జమ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాట్స్‌ ఉన్నతాధికారులు ఇప్పటికైనా దయదలచి తక్షణ మే తమ జీతాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఔట్‌సోర్సింగ్‌, కాం ట్రాక్టు సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - 2020-08-10T09:11:26+05:30 IST