ఆ బంతి వేగం 156.22 కి.మీ.

ABN , First Publish Date - 2020-10-16T10:09:18+05:30 IST

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ ఎన్రిచ్‌ నోకియా రికార్డు సృష్టించాడు.

ఆ బంతి వేగం 156.22 కి.మీ.

ఐపీఎల్‌లో నోకియా రికార్డు

దుబాయ్‌: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ ఎన్రిచ్‌ నోకియా రికార్డు సృష్టించాడు. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు బట్లర్‌కు వేసిన బంతి ఏకంగా 156.22 కి.మీ. వేగంతో దూసుకెళ్లింది. అయితే ఈ బంతిని బట్లర్‌ బౌండరీకి తరలించగా తర్వాతి బంతిని సైతం 155.1 కి.మీ. వేగంతో వేసి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరో బంతిని కూడా 154.74 కి.మీ. వేగంతో  సంధించి టాప్‌-3 ఫాస్టెస్ట్‌ బంతులను తన పేరిటే లిఖించుకున్నాడు. ఈ దెబ్బకు గతంలో డెక్కన్‌ చార్జర్స్‌ తరఫున పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ 154.40 కి.మీ. వేగంతో నమోదు చేసిన రికార్డు గల్లంతైంది. అయితే తాను సృష్టించిన రికార్డు గురించి ముందుగా తెలీదని మ్యాచ్‌ అనంతరం నోకియా చెప్పాడు. ‘ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఐదో బంతిని అంత వేగంగా వేశానని నాకు తెలీదు. అందరూ ఈ విషయం గురించి మాట్లాడుతుంటే అర్థమైంది’ అని దక్షిణాఫ్రికాకు చెందిన నోకియా చెప్పాడు. లీగ్‌ ఆరంభానికి ముందు క్రిస్‌ వోక్స్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన నోకియాను కేవలం రూ.20 లక్షలకే ఢిల్లీ కొనుగోలు చేసింది. 

Updated Date - 2020-10-16T10:09:18+05:30 IST