అధికారులెవరూ పట్టించుకోలేదు.. మీరైనా న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-09-13T09:40:18+05:30 IST

‘‘ప్రభుత్వ భూములను రైతుల పేరిట ఆన్‌లైన్‌ చేయించి, పట్టాలు ఇప్పిస్తానని నమ్మించిన తహసీల్దార్‌..

అధికారులెవరూ పట్టించుకోలేదు.. మీరైనా న్యాయం చేయండి

  • సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
  • తిరుపతి కలెక్టరేట్‌లో ఘటన.. రుయాకు తరలింపు

తిరుపతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ భూములను రైతుల పేరిట ఆన్‌లైన్‌ చేయించి, పట్టాలు ఇప్పిస్తానని నమ్మించిన తహసీల్దార్‌.. మా వద్ద నుంచి రూ.1.50 కోట్లు తీసుకున్నారు. కానీ ఆన్‌లైన్‌ చేయలేదు.. పట్టాలు కూడా ఇవ్వలేదు.. తీసుకున్న డబ్బులు తిరిగివ్వకపోగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. ముఖ్యమంత్రి మంత్రి కార్యాలయాన్ని (సీఎంవో) కూడా ఆశ్రయించాం. కలెక్టరేట్‌లో మొరపెట్టుకున్నాం. అయినా న్యాయం జరగలేదు. కనీసం మీరైనా మాకు న్యాయం చేయండి’’ అంటూ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎదుట భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్‌లో కలకలం రేపింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన అరిగెల నాగార్జున (32), ఆయన భార్య భవాని (30) సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్‌కు వచ్చారు.


చిట్టమూరు మండలంలో ప్రభుత్వ భూములను రైతుల పేర్లను ఆన్‌లైన్‌ చేస్తానంటే.. తాము 2017-19 మధ్యకాలంలో 46 మంది రైతుల నుంచి రూ.150 కోట్లు వసూలు చేసి అప్పటి తహసీల్దారు చంద్రశేఖర్‌కు ఇచ్చామని, ఆయన ఆయా రైతుల పేర్లను ఆన్‌లైన్‌ చేయలేదని, పట్టాలూ ఇవ్వలేదని, తీసుకున్న డబ్బు కూడా వాపస్‌ చేయలేదని ఆరోపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో నెల్లూరు కలెక్టర్‌కు, తర్వాత సీఎం కార్యాలయానికీ ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదన్నారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అక్కడే ఉన్న ఎమ్మెల్యే సంజీవయ్య దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనకు విషయం వివరిస్తూనే నాగార్జున ఒక్కసారిగా బ్లేడుతో చేయి మణికట్టు కోసుకున్నాడు. భవానీ పురుగుల మందు తాగేసింది. హుుటాహుటిన వారిని 108లో రుయా ఆస్పత్రికి తరలించారు. నాగార్జున పరిస్థితి బాగానే ఉందని, భవాని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  

Updated Date - 2022-09-13T09:40:18+05:30 IST