నోటరీ..చీటర్స్‌!

ABN , First Publish Date - 2021-01-11T08:21:41+05:30 IST

ఖాళీ జాగా కనబడితే చాలు.. కబ్జాదారులు గద్ధల్లా వాలిపోతున్నారు. అది ప్రభుత్వ స్థలమని తెలిస్తే.. వారికి పండుగే..! ప్రైవేటు స్థలమైతే కొంత రిస్కు తీసుకుంటారు. మొత్తానికి వారుగానీ కన్నేశారంటే.. స్థలం

నోటరీ..చీటర్స్‌!

ప్రభుత్వ భూములు హాంఫట్‌!.. పాత నోటరీలకు నాంపల్లి అడ్డా.. అక్కడి నుంచే కబ్జాలకు స్కెచ్‌ 

ఫోర్జరీ సంతకాలతో పత్రాల సృష్టి

సర్కారీ భూముల్ని కాజేసిన కబ్జాదారులు

పోలీసు, రెవెన్యూ సిబ్బందీ పాత్రధారులే?

ప్రభుత్వ, విపక్ష పెద్దలకూ వాటాలు!!


మియాపూర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఖాళీ జాగా కనబడితే చాలు.. కబ్జాదారులు గద్ధల్లా వాలిపోతున్నారు. అది ప్రభుత్వ స్థలమని తెలిస్తే.. వారికి పండుగే..! ప్రైవేటు స్థలమైతే కొంత రిస్కు తీసుకుంటారు. మొత్తానికి వారుగానీ కన్నేశారంటే.. స్థలం హాంఫట్టే..! పాత నోటరీలతో, ఫోర్జరీ సంతకాలతో.. ఎక్కడా అనుమానం రాకుండా డాక్యుమెంట్లు సృష్టిస్తారు. కబ్జా చేసేస్తారు.   రెవెన్యూ, మునిసిపల్‌, పోలీసు శాఖల అధికారులూ.. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉంటూ.. భూబకాసరులకు వంత పాడుతున్నారు. ఈ వ్యవహారానికి నాంపల్లి అడ్డాగా ఉంది. 1995-2000 సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించిన రూ. 5 మొదలు.. రూ. 100 విలువ చేసే నోటరీలు, నాన్‌-జ్యుడీషియరీ స్టాంపు పేపర్లు ఇక్కడ లభ్యమవుతాయి. డాక్యుమెంట్ల జిరాక్సు పత్రాలు ఉంటే చాలు.. అందులో ఉండే యజమానుల సంతకాలను అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసేవారు ఇక్కడ కోకొల్లలు..! ఇలా దశాబ్దాల కాలంలో హైదరాబాద్‌ శివార్లలోని జవహర్‌నగర్‌, గాజులరామారం, నాగోల్‌, హయాత్‌నగర్‌, షేక్‌పేట్‌, గోపన్‌పల్లి, శేరిలింగంపల్లి, చందానగర్‌, హఫీజ్‌పేట్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కబ్జాదారులు కర్పూరంలా కరిగించేశారు.


ఆ భూములే ప్రధాన టార్గెట్‌?

రెండు దశాబ్దాల క్రితం వరకు నగరం, శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పోరంబోకు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, సర్కారు స్థలాలు ఉండేవి. వీటిల్లో ఎక్కువగా ఖుర్షీద్‌ జాహీ పాయ్‌గా, చావూస్‌ నవాబులు, కాందిశీకులకు సంబంధించిన భూములపై కబ్జాదారుల కన్ను పడింది. సీఎస్‌14/1958 కేసులో ఉన్న భూ ములు కూడా చాలా వరకు నకిలీ నోటరీలతో కనుమరుగయ్యాయి. ఈ కేసుకు సంబంధించి హఫీజ్‌పేట్‌తోపాటు.. హైదర్‌నగర్‌, బోయిన్‌పల్లి, హస్మత్‌పేట్‌ ప్రాం తాలకు చెందిన భూములు ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం వరకు ఖాళీగా.. పోరంబోకుగా ఉన్న ఈ భూములపై.. నగ ర శివార్లు అభివృద్ధి చెందుతున్న తరుణంలో కబ్జాదారుల కన్ను పడింది. అంతే..! ఒక పకడ్బందీ నేరశైలిని అవలంబించి.. ఈ భూములను ఆక్రమించేశారు. ఈ క్రమంలో పేదలను పావులుగా వాడుకున్నారు. వారితో ఇళ్లు కట్టించి.. నివాసముండేలా చేశారు. పనిలోపనిగా కబ్జాదారులు కూడా ప్లాట్లు చేసి, ఒకట్రెండు గదులున్న ఇళ్లను నిర్మించారు. నాంపల్లిలో పాతకాలం నాటి నోటరీలను కొనుగోలు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఆ స్థలాలకు యజమానులైపోయారు. అప్పట్లో స్థానిక రెవెన్యూ వ్యవస్థ పట్వారీలు, గిర్దవర్లు, వారి పరిధిలో పనిచేసే కావలికార్లు, కారోబార్ల చేతుల్లో ఉండేది. 


వారిని మచ్చిక చేసుకున్న కబ్జాదారులు.. రిజిస్ట్రేషన్లు లేకుండా.. కేవలం నోటరీలతోనే.. స్థలాలను ఆక్రమించారు. ఆ తర్వాత.. విద్యుత్తు సిబ్బందికి ఆమ్యామ్యాలిచ్చి.. అక్కడి ఇళ్లకు కరెంటు మీటర్లు తీసుకోవడం.. మునిసిపల్‌ సిబ్బందితో కుమ్మక్కై ఇంటినెంబర్లు సంపాదించేవారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లించి, ఆయా ఇళ్లను చట్టబద్ధం చేసేవారు. ‘‘మాకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే చాలు.. చార్మినార్‌నైనా రిజిస్టర్‌ చేస్తాం’’ అంటూ ఓ సందర్భంలో సబ్‌-రిజిస్ట్రార్లు బాహాటంగా చెప్పిన విషయం తెలిసిందే..! అప్పట్లో కబ్జాదారులు ఎలాంటి ఇళ్లనైనా, స్థలాలనైనా ఎలా రిజిస్ట్రేషన్‌ చేయించారనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన బిల్డింగ్‌ రెగ్యులేషన్‌(బీఆర్‌ఎస్‌).. ఈ కబ్జాలకు మరింత చట్టబద్ధత కల్పించేందుకు వరంగా మారింది. ఇక 150 గజాలలోపు స్థలాలకు ఉచిత క్రమబద్ధీకరణ, ఆపైన స్థలాలకు నిర్ణీత ఫీజుతో రెగ్యులరైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు 58, 59లు.. సాదా బైనమాల క్రమబద్ధీకరణ పథకాలు కబ్జాదారులకు కలిసివచ్చాయి.


ఒక ప్లాటు.. ఇద్దరు ముగ్గురు యజమానులు?

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, ప్లాట్లు చేసి అమ్మేసిన కబ్జాదారుల దాహం అంతటితో తీరలేదు. చాలా చోట్ల వారు ఒకే ప్లాట్‌ను ఇద్దరు, ముగ్గురికి విక్రయించి పబ్బం గడిపారు. ఉదాహరణకు శేరిలింగంపల్లి మండల పరిధిలోని హఫీజ్‌పేట సర్వే నంబర్‌-80 భూముల్లో.. 1985-90 మధ్య కాలంలో నోటరీలపై ప్లాట్లను విక్రయించారు. ఆ క్రమంలో ప్రేమ్‌నగర్‌, మార్తాండనగర్‌, ఆదిత్యనగర్‌, సుభాష్‌ చంద్రబో్‌సనగర్‌ పుట్టుకొచ్చాయి. నిజానికి వీటిల్లో చాలా ప్లాట్లను పాయ్‌గా, చావూస్‌ వంశీయులు విక్రయించారు. అయితే.. పెద్దగా అభివృద్ధి జరగని కాలంలో ప్లాట్ల యజమానులు ఎక్కడో ఉండేవారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను పెద్దగా పట్టించుకోలేదు. 1998లో హైటెక్‌సిటీ రావడం.. 2000 సంవత్సరం తర్వాత కొండాపూర్‌ పరిసరాలకు ఆర్టీసీ సేవలు పెరగడంతో ఇక్కడి ప్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో.. కబ్జాదారులు నాంపల్లి అడ్డా నుంచి పాతకాలం నోటరీలను కొనుగోలు చేసి.. ఖాళీగా ఉన్న ప్లాట్లను ఇతరులకు విక్రయించడం ప్రారంభించారు. రాత్రికి రాత్రే ఇళ్లల కట్టుకోవాలనే షరతు విధించేవారు. ఆ వెంటనే కరెంటు కనెక్షన్‌, ఇంటి నంబరు తీసుకోవడానికి సహకరించేవారు. 2000-01 మధ్య కాలంలో ఇక్కడ మార్కెట్‌ ధర గజానికి రూ. 500- రూ. 750 ఉంది.


ఆ తర్వాత 2005-10 మధ్య కాలంలో అనూహ్యంగా రూ. 10వేల దాకా పెరిగింది. దీంతో.. కబ్జాదారులు మరోసారి పాతకాలం నోటరీలతో ఖాళీ ప్లాట్లను మింగేశారు. నగర శివార్లలోని హయాత్‌నగర్‌, జవహర్‌నగర్‌, యాప్రాల్‌, ఘట్కేసర్‌ వంటి ప్రాంతాల్లోనూ ఇదే తరహా నేరశైలితో భూబకాసురులు ఖాళీ స్థలాలను ఇతరులకు అంటగట్టారు. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కబ్జాదారులకు అనుకూలంగా ఉండే పోలీసులు.. సివిల్‌ వివాదమంటూ దాటేసేవారు. ఇలాంటి వ్యవహారంలోనే 2000 సంవత్సరంలో ఓ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌ అయ్యాడు. తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు అప్పట్లో ఓ రెవెన్యూ అధికారి సస్పెండయ్యాడు. రిజిస్ట్రేషన్లు లేకుండా.. నోటరీలతో కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదనే భావనతో చాలా మంది బాధితులు మిన్నకుండిపోయారు. ఒక్క సుభాష్‌ చంద్రబో్‌సనగర్‌లోనే 100 మంది దాకా బాధితులు ఉన్నారు. 


రెవెన్యూ సిబ్బందిని బెదిరించి

మాట వింటే సరి.. లేకుంటే బెదిరింపులే అన్న రీతిలో కబ్జాదారులు ఆయా ప్రాంతాల్లోని రెవెన్యూ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టుల నుంచి తీసుకున్న ప్రిలిమినరీ డిక్రీలు.. కాంప్రమైజ్‌ డిక్రీలను అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారులకు ముప్పుతిప్పలు పెట్టారు. ఓ రెవెన్యూ అధికారికి ఇలాంటి వ్యవహారాలపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నందుకు.. కోర్టు ధిక్కరణ కింద రెండు నెలల జైలు శిక్ష పడింది. ఆ ఘటనతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆచితూచి అడుగులు వేయడం ప్రారంభించారు. రెండు దశాబ్దాల క్రితం బడా కబ్జాదారులను చూసి.. స్థానికంగా చోటా కబ్జాదారులు పుట్టుకొచ్చారు. గచ్చిబౌలి సమీపంలోని అంజయ్యనగర్‌లో ఈ కోవకు చెందిన ఓ కబ్జాదారు ఏకంగా ‘‘మీ పేరు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటా. ఎస్సీ ఎస్టీ కేసు పెడతా’’ అని రెవెన్యూ అధికారులను బెదిరించేవాడు. ఇతను కూడా 2000-05 మధ్య కాలంలో పైన పేర్కొన్న నేరశైలిలో ఐటీఐ భూముల్లో ఇళ్లను నిర్మించి, విక్రయించాడు. ఓ సారి రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చడానికి వస్తే.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని, నానా హంగామా చేశాడు.


అధికార, విపక్షాల నేతలకూ వాటా?

భూకబ్జాల వ్యవహారంలో తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు.. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా దాదాపు అన్ని పార్టీల నేతల హస్తముందనే ఆరోపణలున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. కబ్జాదారులు ఆ పార్టీకి జైకొడతారు. అవసరమైతే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను వాటాదారులుగా చేరుస్తారు. పేదల పక్షాన ధర్నాలకు దిగే విపక్ష నేతలనూ మచ్చిక చేసుకుంటారు. ఈ క్రమంలోనే హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌ బీ-బ్లాక్‌, హనీఫ్‌ కాలనీల్లో ఓ ఎమ్మెల్సీ స్వయంగా తిరిగి.. తనకు వాటాగా దక్కిన ప్లాట్లను విక్రయించారు. 


కేసులు అంతంతే..!

నకిలీ నోటరీల దందా యథేచ్ఛగా సాగుతున్నా.. పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు అంతంత మాత్రమే. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అప్పట్లో ఒకట్రెండు కేసులు నమోదు చేశారు. సైబరాబాద్‌లో ప్రభాకర్‌రెడ్డి కమిషనర్‌గా ఉన్న సమయంలో నకిలీ పత్రాలతో భూదందా కేసులను సీరియ్‌సగా తీసుకున్నారు. ఆ తర్వాతి కాలంలోనూ నకిలీ నోటరీలు తయారు చేసే ముఠాలపై మియాపూర్‌, రాయదుర్గం, చందానగర్‌, హయాత్‌నగర్‌, అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-01-11T08:21:41+05:30 IST