హుజురాబాద్‌లో ఎగిరేది టీఆర్‌ఎస్ జెండానే: ఎన్నారై నాయకులు

ABN , First Publish Date - 2021-07-30T00:30:57+05:30 IST

హుజురాబాద్‌లో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే అని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి

హుజురాబాద్‌లో ఎగిరేది టీఆర్‌ఎస్ జెండానే: ఎన్నారై నాయకులు

హైదరాబాద్: హుజురాబాద్‌లో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే అని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 



టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే.. రైతుబంధు, దళిత బంధు వంటి పథకాలు అమలవుతాయని.. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే వీటిని రద్దు చేస్తాయని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను కేసీఆర్ తన సోదరుడిగా భావించి ఎన్నో అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే స్వప్రయోజనాల కోసం, చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపించారు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అనిల్ కూర్మాచలం అన్నారు. ఉపఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు బీజేపీని విమర్శించిన ఈటల రాజేందర్.. ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. 


ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నారై తెరాస యూకే ప్రత్యేక కార్యాచరణతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రాజ్ కుమార్ శానబోయిన మరియు విక్రమ్ కుమార్, తిరుమందాస్ నరేష్, రఘువరన్ హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్ రెడ్డి, హుజురాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ గాలి రాకేష్, టిఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T00:30:57+05:30 IST