Abn logo
Jul 5 2020 @ 00:00AM

బిడ్డలతో... ఎన్టీఆర్‌ ప్రయోగాలు!

Kaakateeya

‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా జూన్‌ 21వ తేదీ ఆదివారం సంచికలో, ఆంధ్రజ్యోతి ‘నవ్య - దృశ్యం’ పేజీలో వచ్చిన ‘నాన్న బాటలో తొలి అడుగు’ ఆర్టికల్‌ చదివాం. అందులో ఎన్టీఆర్‌ కుమారుడైన హరికృష్ణకు ‘తల్లా? పెళ్ళామా?’ (1970) చిత్రం షూటింగులో జరిగిన విషయాన్ని... మరో కుమారుడు బాలకృష్ణకు తన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ (1974)లో జరిగినట్టుగా పొరపాటుగా రాశారు. ‘తాతమ్మ కల’లో నాయనమ్మ చనిపోవడం ఉండదు. దానికి ఏడవడమూ ఉండదు. అసలు ఆ సినిమాలో భానుమతి చేసిన పాత్ర నాయనమ్మ కాదు... తాతమ్మ! నిజానికి, ఎన్టీఆర్‌ చేత సెట్లో చెంపదెబ్బ తిన్నది బాలకృష్ణ కాదు... హరికృష్ణ. సినీ అభిమానులు, చరిత్ర ప్రియుల కోసం ఆ రెండు చిత్రాలకు సంబంధించి మరికొన్ని విశేషాలు, వివరాలు...


ఎన్టీఆర్‌ కుమారుడైన హరికృష్ణ చిన్నతనంలో తండ్రి దగ్గర కాకుండా, ఎక్కువగా తన తాతయ్య లక్ష్మయ్య చౌదరి దగ్గర కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామంలో గారాబంగా పెరిగారు. చిన్నారి ముద్దుల మనుమడిని వెండితెరపై ప్రధానపాత్రలో నటింపజేయాలని లక్ష్మయ్యకు ఉండేది. అలా ‘శ్రీకృష్ణావతారం’ (1967) చిత్రంలో బాలకృష్ణుడిగా పసివయసులో హరికృష్ణ తెరపై కొద్దిసేపు మెరిశారు. తరువాతి కాలంలో హరికృష్ణ ప్రధాన పాత్రలో సినిమా తీయాలంటూ, ఎన్టీఆర్‌పై లక్ష్మయ్య ఒత్తిడి చేశారు. ఆ సమయంలో రచయిత డి.వి. నరసరాజు సైతం ‘మాయాబజార్‌’ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని, ‘తమ్ముడి పెళ్ళి - మామ భరతం’ అనే స్ర్కిప్టు రాసి, ఇచ్చారు. కానీ, ఎన్టీఆర్‌ అప్పుడున్న కుటుంబ జీవితంలోని పరిణామాలను తీసుకొని, ‘తల్లా? పెళ్ళామా?’ స్ర్కిప్టు సిద్ధం చేసి, తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా, స్వీయదర్శకత్వంలో రూపొందించారు. మనుమడి పాత్రను హరికృష్ణతో ధరింపజేశారు. చైల్డ్‌ ఆర్టిస్టుగా పూర్తిస్థాయి పాత్రలో హరికృష్ణ నటించడం అదే మొదటిసారి. కొడుకులు, కోడళ్ళు వదిలేసినా, నాయనమ్మ (నటి శాంతకుమారి) దగ్గరకు వస్తాడు మనుమడు (చిన్నారి హరికృష్ణ). ఆ మనుమణ్ణి సాక్షాత్తూ బాలకృష్ణుడిగా ఊహించుకుంటూ, ‘నన్ను ఉద్ధరించడానికి వచ్చావా నాయనా!’ అంటూ ‘మమతలెరిగిన నా తండ్రి’ (శాంతకుమారి స్వీయగళంలో పాడిన పాట) అని పాడుతూ. చివరకు మనవడి చేతిలోనే నాయనమ్మ కన్నుమూస్తుంది. ఆ సమయానికి కొడుకులు (నాగభూషణం, ఎన్టీఆర్‌), కోడళ్ళు (దేవిక, చంద్రకళ) ఇంటికి వచ్చే భావోద్వేగభరితమైన పతాక సన్నివేశం అది.


మద్రాసులోని ఓ స్టూడియోలో ఈ సన్నివేశ చిత్రీకరణ జరుగుతోంది. మనుమడి చేతుల్లోనే నాయనమ్మ చనిపోయింది కాబట్టి, ఆ సన్నివేశంలో హరికృష్ణ ఏడుస్తూ నటించాలని దర్శకుడు ఎన్టీఆర్‌ చెప్పారు. కానీ, పిల్లవాడైన హరికృష్ణ మాత్రం ‘‘మా నాయనమ్మ ఇంటి దగ్గరే నిక్షేపంగా ఉంటే నేనెందుకు ఏడుస్తాను?’’ అని మొండికేశాడు. సెట్లోనే మనుమడు హరికృష్ణను చూస్తున్న గారాబు తాతయ్య లక్ష్మయ్యను ఏదో మిష మీద తెలివిగా తమ్ముడు త్రివిక్రమరావుతో బయటకు పంపారు ఎన్టీఆర్‌. ఆయన అలా బయటకు వెళ్ళగానే, కెమేరాను రెడీ చేయించి, హరికృష్ణను సన్నివేశానికి తగ్గట్టు ఏడ్పు నటించమన్నారు. వినకపోయేసరికి, లాగి పెట్టి చెంప మీద కొట్టారు. హరికృష్ణ ఏడవడం మొదలుపెట్టగానే, కావాల్సిన దృశ్యాన్ని చిత్రీకరించారు ఎన్టీఆర్‌. సన్నివేశం పండింది. తండ్రి తనను కొట్టిన సంగతి తాతయ్యకు ఫిర్యాదు చేద్దామని హరికృష్ణ చూస్తే, ఆయన అక్కడ లేరు. కీలక పాత్ర చనిపోయే ఉత్కంఠభరిత క్షణాల్లో ఒకవైపు పాట, మరో వైపు సినిమాల్లోని ఇతర ముఖ్యపాత్రలు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తూ, వస్తూ ఉండడమనే ఇంటర్‌ కట్‌ దృశ్యాలను వాడే ధోరణిని కూడా ‘తల్లా? పెళ్ళామా?’ బాగా పాపులర్‌ చేసింది. సినీ కెరీర్‌ తొలినాళ్ళలో జరిగిన ఆ సంగతులను హరికృష్ణ తరువాతి కాలంలో పదే పదే గుర్తు చేసుకొనేవారు.


ఉద్యమకాలంలో... ఆ సినారె గీతం

1970 జనవరి 10న రిలీజైన ‘తల్లా? పెళ్ళామా?’ చిత్రంలోని ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అనే సినారె గీతం ఓ సంచలనం. అది ఇప్పటికీ పాపులరే. అప్పటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో జాతి సమైక్యతను కోరుతూ ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా రాయించుకొన్న గీతం అది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఎస్టేట్‌ పేరిట థియేటర్ల కాంప్లెక్స్‌ ఎన్టీఆర్‌ కట్టిన కొత్త రోజులవి. ఆ పాట వల్ల తెలంగాణ ఉద్యమకారులు కోపగించి, ఎస్టేట్‌ మీదకు వచ్చే ప్రమాదం ఉందని సినారె హెచ్చరించారు. కానీ, ఎన్టీఆర్‌ మాత్రం ‘‘ఆర్థిక ప్రయోజనాల కోసం అభిరుచిని వదులుకోలేం బ్రదర్‌!’’ అంటూ, పట్టుబట్టి ఆ పాట రాయించారు. సినిమాలో పెట్టారు. అన్నిటినీ ఎదుర్కొని, ఆ పాటను అలాగే ఉంచారు. ‘తల్లా? పెళ్ళామా?’ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఉంది. ఆ చిత్రాన్ని తరువాతి కాలంలో దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్‌ హిందీలో ‘బిదాయీ’గా నిర్మించారు. అక్కడా అది హిట్టే! దానికి వచ్చిన లాభాలతోనే ఆయన ఇవాళ్టి ప్రసిద్ధమైన ప్రసాద్‌ ఫిల్మ్‌ లేబొరేటరీని నెలకొల్పారు. ఆ తరువాత చాలాకాలానికి కమలహాసన్‌ ‘మరో చరిత్ర’ హిందీ రీమేక్‌ ‘ఏక్‌ దూజే కేలియే’ తెచ్చిన లాభాలతో ప్రసాద్‌ ల్యాబ్‌ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించినట్టు ఎల్వీ ప్రసాదే తెలిపారు. ఆ రకంగా ‘తల్లా? పెళ్ళామా?’కు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.రెండు వెర్షన్ల బాలకృష్ణ తొలి చిత్రం ‘తాతమ్మకల’

ఇక, బాలకృష్ణ చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన తొలి చిత్రం ‘తాతమ్మ కల’కు కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తాతమ్మగా భానుమతి నటించిన ఆ చిత్రంలో ఆమెకు భర్తగా, మనుమడిగా పెద్ద ఎన్టీఆర్‌ది ద్విపాత్రాభినయం. ఇక, మునిమనుమడి పాత్ర బాలకృష్ణది. ఆనాటి ప్రభుత్వ విధానమైన కుటుంబ నియంత్రణను విమర్శిస్తూ, ఎన్టీఆర్‌ ‘తాతమ్మ కల’ను రూపొందించారు. 1974 ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం సహజంగానే పెద్ద చర్చ రేపింది. సినిమా రిలీజైన యాభై రోజుల తరువాత ఎన్టీఆరే స్వయంగా ఆ చిత్రాన్ని థియేటర్ల నుంచి ఉపసంహరించారు. తరువాత కొంత కథనం, రైతు సమస్యలే ప్రధానాంశంగా క్లైమాక్స్‌ మార్చి, కొత్త దృశ్యాలు చిత్రీకరించి, రీ సెన్సార్‌ చేయించి, ఆ రెండో వెర్షన్‌ ‘తాతమ్మ కల’ను 1975 జనవరి 8న రీ రిలీజ్‌ చేశారు ఎన్టీఆర్‌. మునిమనుమడు బాలకృష్ణకూ, తాతమ్మ భానుమతికీ మధ్య అనుబంధం చూపే ఈ చిత్రం రెండో వెర్షన్‌లో పాటలు పార్ట్‌లీ కలర్‌లో ఉండడం విశేషం. అలా నాన్న ఎన్టీఆర్‌ బాటలో సినీ రంగంలో అడుగులు వేసిన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణల తొలినాళ్ళ చిత్రాలు రెండూ తెలుగు సినీ చరిత్రలో వేర్వేరు కారణాలతో ప్రత్యేకంగా నిలిచాయి.


బి.పి. చక్రధర్‌, అనంతపురం


Advertisement
Advertisement