ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఖజానాపై కన్ను..!

ABN , First Publish Date - 2021-11-12T13:32:06+05:30 IST

రాష్ట్రాభివృద్ధి సంస్థ కోసం..

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఖజానాపై కన్ను..!

250 కోట్లకు స్కెచ్‌!

6 నెలలుగా పట్టు వదలని ఆరోగ్య శాఖ 

ఇస్తారా.. ఇవ్వరా.. అంటూ తీవ్ర ఒత్తిళ్లు 

సాధ్యం కాదంటున్నా వదలని అధికార్లు

తోడైన సీఎం కార్యాలయ అధికారి 

రెండు రోజులుగా వరుసపెట్టి ఫోన్లు 

రేపు అత్యవసరంగా ఈసీ సమావేశం 

వల్లకాదంటూ సెలవుపై వెళ్లిపోయిన వీసీ 

వీసీ లేకున్నా ఈసీ పెడతామంటూ పట్టు 

పైసా వసూల్‌పై ఉద్యోగుల ఆందోళన?


(అమరావతి-ఆంధ్రజ్యోతి): 

‘‘మాకు అర్జెంట్‌గా రూ.250 కోట్లు కావాలి. మీ విశ్వవిద్యాలయం ఖాతా నుంచి రాష్ట్రాభివృద్ధి సంస్థకు పంపించండి. ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఇస్తారా..? ఇవ్వరా..? ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం.. ముందు డబ్బులు పంపి, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో తీర్మానం చేసుకోండి. ఇదే మీకు చివరి అవకాశం. ఆ తర్వాత మీ ఇష్టం’’.

- ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులకు సీఎంవో ఉన్నతాధికారి చేసిన హెచ్చరిక ఇది. 


రాష్ట్రాభివృద్ధి సంస్థ కోసం ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిధులను ప్రభుత్వం కొల్లగొడుతోంది. పైసా వసూల్‌ లక్ష్యంగా వర్సిటీ అధికారులపై ఆరోగ్యశాఖ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వానికి అత్యవసరంగా రూ.250 కోట్లు కావాలని, ఆ నిధులు హెల్త్‌ వర్సిటీ ఇవ్వాలంటూ ఆ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. గత 6నెలలుగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారుల మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది. రెండు రోజుల నుంచి సీఎంవోలో కీలక అధికారి రంగంలోకి దిగారు. ఇరువైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో వర్సిటీ వీసీ టూర్‌ పేరుతో విశాఖకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వర్సిటీకి రూ.450 కోట్లు నిధులున్నాయి. జాతీయ బ్యాంకులో ఎఫ్‌డీల రూపంలో ఉన్న వీటిని బయటకు తీసుకురావడం రోజుల వ్యవధిలో ఆయ్యే పని కాదు.


పైగా వర్సిటీ నుంచి రూపాయి తీసుకోవాలన్నా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) అనుమతి తప్పనిసరి. ఇదే విషయాన్ని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ అధికారులు వారం రోజుల నుంచి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అవసరమైతే అత్యవసరంగా ఈసీ సమావేశం పెట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. 11న(గురువారం) ఉదయం మీటింగ్‌ పెట్టాల్సిందే అంటూ 10న హుకుం జారీ చేశారు. ఒక్కరోజులో సమావేశం సాధ్యం కాదని, ఈసీ సభ్యులకు సమాచారం ఇవ్వాలంటే రెండు రోజుల వ్యవధి కావాలని అధికారులు వివరించారు. దీంతో శనివారం నాటికి ఈసీ మీటింగ్‌ పూర్తి కావాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మరోవైపు సీఎంవోలో కీలకమైన ఐఏఎస్‌ అధికారి నేరుగా వర్సిటీ ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడుతూ మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. 


సింగిల్‌ పాయింట్‌ అజెండా 

ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, ఆయుష్‌ కమిషనర్‌తో పాటు మరో ఐదుగురు నామినేటేడ్‌ సభ్యులు ఉంటారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ చరిత్రలో ఇప్పటి వరకూ సింగిల్‌ పాయింట్‌ అజెండాతో ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదు. తొలిసారిగా రూ.250కోట్ల నిధులు రాష్ట్రాభివృద్ధి సంస్థకు బదలాయించడానికి ఆమోదం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు మొదలయ్యే ఈ మీటింగ్‌ 3.30కు ముగియనుంది. చైర్మన్‌ హోదాలో ఉన్న వీసీ ఈ సమావేశానికి వస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీసీ రాకపోయినా ఈసీ మీటింగ్‌ నిర్వహించాల్సిందేనని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గట్టి పట్టుదలతో ఉన్నారు. 


వర్సిటీకి రూ.కోట్లలో నష్టం 

ప్రస్తుతం వర్సిటీ వద్ద ఉన్న రూ.450కోట్లలో విభజన చట్టం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.170 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లు బదలాయిస్తే మిగిలేది కేవలం రూ.30కోట్లు మాత్రమే. ఈ నిధులతో వర్సిటీ నిర్వహణ కష్టంగా మారుతుంది. వర్సిటీకి ఏటా దాదాపు రూ.70కోట్లు అవసరం. ఈ నిధులు ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి లేదు. కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్థులు కట్టే ఫీజులు, పరీక్షల ఫీజులు, ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీతో వర్సిటీ నిర్వహణ, ఇతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు రూ.250 కోట్లు తీసుకుపోవడం వల్ల ఈ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు ఏటా వచ్చే వడ్డీ పరంగా కూడా వర్సిటీకి తీవ్రమైన నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌డీసీకి నిధుల బదలాయింపు వ్యవహారంపై హెల్త్‌ వర్సిటీ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-11-12T13:32:06+05:30 IST