ఆహార వైవిధ్యం... ఆదివాసీలకు వరం!

ABN , First Publish Date - 2020-06-22T05:30:00+05:30 IST

తరతరాలుగా పోషకాహార లేమి ఆదివాసీ మహిళలు, చిన్నారులకు శాపంగా మారింది. వారికి ‘ఇక్రిశాట్‌’ సంస్థ ‘గిరి పోషణ’ ప్రాజెక్ట్‌తో ఆహార వైవిఽధ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది...

ఆహార వైవిధ్యం... ఆదివాసీలకు వరం!

తరతరాలుగా పోషకాహార లేమి ఆదివాసీ మహిళలు, చిన్నారులకు శాపంగా మారింది. వారికి ‘ఇక్రిశాట్‌’ సంస్థ ‘గిరి పోషణ’ ప్రాజెక్ట్‌తో ఆహార వైవిఽధ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఆదివాసీ చిన్నారులు, గర్భిణీలు, బాలింతల కోసం ‘ఆరోగ్యపంట’ పండిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణలోని మూడు జిల్లాలతో పాటుగా దక్షిణాదిన 13 వేల మందికి పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల  ఈ ప్రాజెక్ట్‌ను మరింత వేగవంతం చేసింది. ఆ వివరాలే ఇవి...  


ఆదివాసీ మహిళలకు మంచి రోజులు వచ్చాయి. ‘గిరి పోషణ’ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో ‘ఇక్రిశాట్‌’ (ఇంటర్నేషనల్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమీ-ఆరిడ్‌  ట్రోపిక్స్‌) నిర్వహిస్తోంది. దీని ద్వారా తెలంగాణలోని ఆదివాసీలకు బలవర్థక ఆహారాన్ని అందిస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆదివాసీల ఇళ్లకే ఈ పోషకాహారాన్ని చేరవేస్తోంది. ఇది డైట్‌ డైవర్సిఫికేషన్‌ (ఆహార వైవిధ్యం గల)ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కన్నా ముందు ‘న్యూట్రీ ఫుడ్‌ బాస్కెట్‌’ పైలెట్‌ ప్రాజెక్టును ‘ఇక్రిశాట్‌’ విజయవంతంగా పూర్తిచేసింది. ప్రస్తుతం తెలంగాణాలోని ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం గిరిజన ప్రాంత ఐటీడీఏల (ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీ) పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నారు. 


సంప్రదాయ ఆహారంతో ఆరోగ్యం!

 పాతరోజుల్లో మన పెద్దవాళ్లు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేవారు. పైగా స్థానిక ఆహార సంస్కృతిలో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆహార పరమైన వైవిధ్యం కూడా వీటిల్లో ఉంది. వీటిల్లో సూక్ష్మపోషక పదార్థాలతో పాటు ప్రోబయాటిక్స్‌, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పప్పుల్లో మాంసకృతులు ఉంటాయి. వైవిధ్యభరితమైన పోషకాహారాన్ని గిరిజన మహిళలు, ఆరేళ్లలోపు పిల్లలకు అందించాలన్నదే ‘గిరిపోషణ’ ప్రాజక్టు లక్ష్యం. భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాల్లో 60శాతం పైగా మహిళల్లో, ఐదు సంవత్సరాల పిల్లల్లో యాభై శాతం మందికి పైగా రక్తహీనత ఉందని సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా 35 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు.


పిల్లల్లో ఎదుగుదల సమస్యను కూడా గుర్తించారు. ఇక్రిశాట్‌కి చెందిన ‘అగ్రి బిజినెస్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫామ్‌’ (ఎఐపీ) న్యూట్రిషన్‌ నాలెడ్జ్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌పీకే) ద్వారా మూడు ట్రైబల్‌ బ్లాకుల్లోని పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, యువతులకు వైవిధ్యమైన ఆహారం అందిస్తున్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ ద్వారా అందిస్తున్న వైవిధ్య ఆహారం గిరిజనుల ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టు ఇక్రిశాట్‌ నిర్వహిస్తుంది. నిధులు, సహాయ, సహకారాలు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ కమిషనరేట్‌ అందిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ‘గిరి పోషణ’ 7,241 మంది లబ్దిదారులకు అందింది’ అని ఎన్‌పీకె కార్యక్రమం చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) డాక్టర్‌ సైకత్‌ దత్త మజుందార్‌ చెబుతున్నారు. 






పోషకాల పారిశ్రామికవేత్తలుగా...

 పోషకాహార ఉత్పత్తులను ఆదివాసీలకు అందివ్వడమే కాకుండా స్థానిక మహిళలను పోషకాహార ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా నిలబడేలా ‘ఇక్రిశాట్‌’ శిక్షణ ఇస్తోంది. వీరికి ఫుడ్‌ ప్రోసెసింగ్‌, ఫుడ్‌ సేఫ్టీ, ఫుడ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఫుడ్‌ ప్యాకేజింగ్‌, లేబిలింగ్‌, షెల్ఫ్‌ లైఫ్‌, బిజినెస్‌ ప్లాన్‌ డెవలప్‌మెంట్‌,  డాక్యుమెంటేషన్‌, రికార్డు కీపింగ్‌లలో శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు 75 మంది గిరిజన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లని తయారుచేశారు కూడా. ఇక మూడు ఐటీడీఏల్లో ఎనిమిది ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ‘‘ఆదివాసీ మహిళలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించడంతో పాటు, వారిని సాధికారులను చేయడం, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తీసుకురావడం వంటి లక్ష్యాలను కూడా పెట్టుకున్నాం’’ అని మజుందార్‌ వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ ఆదివాసీలను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతోందనడంలో సందేహం లేదు.   




రెడీ టు కుక్‌... రెడీ టు ఈట్‌...

‘ఇక్రిశాట్‌’ అందిస్తున్న వాటిల్లో జొన్నలు, మల్టీగ్రెయిన్‌ మీల్‌, న్యూట్రీ బిస్కెట్లు, ఎనర్జీ బార్‌, స్వీట్‌ మీల్స్‌, జోవర్‌ బైట్స్‌, జోవర్‌ మీల్‌... కొన్ని. వీరందించే ఆరు ఉత్పత్తుల్లో మూడు ‘రెడీ టు కుక్‌’ అయితే మూడు ‘రెడీ టు ఈట్‌’ రూపంలో ఉంటాయి. ఈ మధ్యే మిల్లేట్‌ ఫ్లేక్స్‌ మిక్స్చ్‌ర్‌, పల్లీ చిక్కీ, రాగి, బెల్లం చిక్కీ వంటివి కూడా అందిస్తున్నారు. ఆదివాసీలకు పోషకాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా, ఐటీడీఏ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో పోషకాహారాన్ని ఆదివాసీ కుటుంబాల ఇళ్లకే చేరవేస్తున్నారు. 


-నాగసుందరి

Updated Date - 2020-06-22T05:30:00+05:30 IST