ఓ సత్యభామ

ABN , First Publish Date - 2021-07-21T05:37:54+05:30 IST

ముఖ్యమైన పని ఉందని అమ్మ ఫోన్‌ చేస్తే స్నేహితుడితో కలిసి సొంత ఊరు బయలుదేరుతాడు కార్తీక్‌. నాన్న రమ్మాన్నాడని పట్నం నుంచి ఇంటికి వెళుతుంది సత్యభామ.

ఓ సత్యభామ

ముఖ్యమైన పని ఉందని అమ్మ ఫోన్‌ చేస్తే స్నేహితుడితో కలిసి సొంత ఊరు బయలుదేరుతాడు కార్తీక్‌. నాన్న రమ్మాన్నాడని పట్నం నుంచి ఇంటికి వెళుతుంది సత్యభామ. అనుకోకుండా ఇద్దరి ఊరూ ఒక్కటే అవుతుంది. బస్టాండ్‌లో దిగి తమ ఇళ్లకు వెళ్లడానికి ముగ్గురూ షేరింగ్‌ ఆటో ఎక్కుతారు. అక్కడ సత్యభామను చూడగానే మనసు పారేసుకుంటాడు అతడు. సెంటర్‌లో ఆటో ఆగుతుంది. ఆమె దిగి ఇంటి వైపు అడుగులు వేస్తుంది. అతడు ఆమెను ఫాలో అవుతాడు. కాస్త దూరం వెళ్లాక సత్యభామ వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే మాట మారుస్తాడు అతడు. ‘కాస్త ఈ అడ్రెస్‌ చెబుతారా’... తనను అడుగుతాడు. ఆమె చెబుతుంటుంది. కానీ అతడికి అవేవీ వినిపించవు. తననే చూస్తుంటాడు. ‘మీ పేరు చెబుతారా?’... ‘నా పేరు తెలుసుకొని ఏంచేస్తావయ్యా?’... అంటుంది కోపంగా. ‘మీ పేరు అంత చండాలంగా ఉంటుందా? అడగ్గానే అంత కోప్పడుతున్నారు?’... అతడి ప్రశ్న. ‘సత్యభామ’... చికాగ్గా చెబుతుంది తను. ‘మీలానే మీ పేరు కూడా పాతగానే ఉంది’... కార్తీక్‌ వెటకారం. ఆమెకు నషాలానికి అంటుతుంది.


 చివరకు ‘నిన్ను ప్రేమిస్తున్నా’నంటూ ప్రపోజ్‌ చేస్తాడు కార్తీక్‌. అతడి మీద కోపం చల్లారిపోతుంది. ‘నువ్వేంటో తెలియని నేను... నేనేంటో తెలియని నువ్వు. ఇప్పుడు నిన్ను ప్రేమించేస్తే భవిష్యత్తులో నా క్యారెక్టర్‌పైనే డౌట్‌ వస్తుంది. సో... అర్థం చేసుకొంటావనుకొంటున్నా’... మాటల్లో సత్య ఇల్లు వచ్చేస్తుంది. వాకిట్లో ఉన్న వాళ్ల నాన్న ‘ఎవరతను’ అని కూతుర్ని అడుగుతాడు. ఆయన్ని కార్తీక్‌ గమనించడు. ముఖం తిప్పేసుకొంటాడు. ‘అడ్రెస్‌ అడిగితేనూ...’ అంటూ సత్య ఏదో చెప్పబోతుంది. వాకిట్లో ఉన్నది సత్య తండ్రి అని తెలిసి వెనక్కి తిరుగుతాడు కార్తీక్‌. ఆయన ఎవరో కాదు... కార్తీక్‌ వాళ్ల మామయ్య. ‘వీడు మీ విజయవాడ అత్తయ్య కొడుకు కార్తీక్‌’... అంటూ సత్యకు పరిచయం చేస్తాడు తండ్రి. ‘అంటే వీడు నాకు బావా? ఓ గాడ్‌’ అనుకొంటూ లోపలికి వెళ్లిపోతుంది తను. కార్తీక్‌ వచ్చింది కూడా ఆ ఇంటికే. ‘మామయ్య ఎందుకో రమ్మన్నాడు... వెళ్లు’ అని అతడి తల్లి చెప్పింది. ‘ఒక ముఖ్యమైన పని మీద నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. వారం రోజులు ఊరు వెళుతున్నా. నీకు అభ్యంతరం లేకపోతే నేను వచ్చే వరకు ఇక్కడ ఉండు’ అంటాడు మామయ్య. మనోడి ఆనందానికి హద్దులుండవు. ఇక రాత్రింబవళ్లూ తనను చూస్తూ... ప్రేమిస్తూ గడిపేయవచ్చనుకొంటాడు. మరి కలిసొచ్చిన అవకాశం కార్తీక్‌ ప్రేమను పండిస్తుందా? అతడి ప్రేమను ఆమె అర్థం చేసుకొంటుందా? ‘ఓ సత్యభామ’ లఘుచిత్రంలో చూస్తేనే బాగుంటుంది. ఉదయ్‌ ప్రభ, ప్రణీతరెడ్డిలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ షార్ట్‌ ఫిలిమ్‌కు దర్శకత్వం ధనంజయ్‌ నాయుడు. ఓ చిన్న ట్విస్ట్‌తో కథను ఆసక్తికరంగా ముగించడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. గత వారం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పటికి మూడున్నర లక్షల మందికి పైగా వీక్షించారు.

Updated Date - 2021-07-21T05:37:54+05:30 IST