దాచేస్తే దాగదులే!

ABN , First Publish Date - 2021-07-06T09:02:31+05:30 IST

విశాఖ మన్యం గనులపై వాస్తవాలను గనుల శాఖ అధికారులు దాటవేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా భమిడికలొద్ది గ్రామంలోని గనులపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది

దాచేస్తే దాగదులే!

విశాఖ బాక్సైట్‌పై వాస్తవాలను దాటవేస్తూ అధికారుల వాదనలు

లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ గని తవ్వేస్తున్నారన్న అంశం పక్కకు

15 వేల కోట్ల మాట ‘బినామీ’దే

ఆ మాటలపై ‘ఆంధ్రజ్యోతి’కి ప్రశ్నలు


అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖ మన్యం గనులపై వాస్తవాలను గనుల శాఖ అధికారులు దాటవేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా భమిడికలొద్ది గ్రామంలోని గనులపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. ఆ గనుల్లో జరుగుతున్న అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా రిజర్వు ఫారె్‌స్టలో వేసిన రోడ్డు, అన్నింటికీ మించి లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వేస్తున్న వైనాన్ని ఈ కథనాలు బయటపెట్టాయి. వీటిపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి.. తాము అసలు బాక్సైట్‌ గనులకు అనుమతులే ఇవ్వలేదన్నారు. వారు బాక్సైట్‌ గనులకు అనుమతిచ్చారని ‘ఆంధ్రజ్యోతి’ కూడా రాయలేదు. లేటరైట్‌ గనికి అనుమతిచ్చారని, కానీ ఆ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలు జరిపేస్తున్నారని మాత్రమే రాసింది. అయితే,  ఆ గనిలో ఉన్నది లేటరైటా? బాక్సైటా అన్నది తేలుస్తామని ద్వివేది, వెంకటరెడ్డి చెప్పలేదు. దానిపై నిష్పాక్షికంగా విచారణ చేస్తామని, ఖనిజాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామని కూడా అనలేదు. వాస్తవానికి ఆ గనిలో ఉన్నది బాక్సైట్‌ అని గతం నుంచీ పలువురు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లేటరైట్‌కే అనుమతి ఇచ్చామంటోంది. అనుమతి లేటరైట్‌ పేరుతో ఇచ్చినా...అక్కడున్నది బాక్సైటే అన్న అనుమానం ఉంది.  ఇప్పుడు ప్రభుత్వం అనుమతించిన విశాఖపట్నం జిల్లా భమిడికలొద్దిలో ఉన్న గనిలో 40శాతం కంటే ఎక్కువే బాక్సైట్‌ స్వభావం ఉన్నాయంటున్నారు. అయితే వీటి శాతాన్ని తగ్గించి దాన్ని లేటరైట్‌ పేరుతో అనుమతి ఇచ్చేశారని స్థానికంగా అంతా చెబుతున్నారు. 


బయటపెట్టింది వైసీపీ నేతే

2019లో, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు...శాసనసభ సభాపతికి లేఖ రాశారు. విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుకు సమీపంలో విశాఖజిల్లా నాతవరం మండలం సరుగుడు గ్రామ పంచాయతీ అసనగిరి గ్రామంలో 35.84 హెక్టార్లలో వేలకోట్ల విలువైన బాక్సైట్‌ నిల్వలున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. లేటరైట్‌ పేరుతో దీన్నే తవ్వేశారని ఆయన ఆరోపించారు. సరిగ్గా ఆ అసనగిరికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు అనుమతిచ్చిన భమిడిక లొద్ది గనులున్నాయి. అసనగిరిలో బాక్సైట్‌ అంటే ఇక్కడా బాక్సైట్‌ అనే అర్థం. భమిడికలొద్దిలో ఏకంగా సుమారు 121హెక్టార్లకు అనుమతిచ్చారు. బాక్సైట్‌ శాతం తక్కువగా ఉన్నట్లు చూపించి లేటరైట్‌ కింద అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గనుల శాఖ అధికారులు దీనిపై లోతుగా విచారణ చేయాలి. అవసరమైతే థర్డ్‌ పార్టీ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ తనిఖీలు నిర్వహించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. గనుల శాఖ అధికారులు ఆ పని చేయకుండా ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనాలను ఖండిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టారు. మరోవైపు వెంకటరెడ్డి అయితే...పది రూపాయలు జరిగితే భారీ దోపిడీ జరిగిందని రాయడం సమంజసమేనా? అని ఆవేదనగా ప్రశ్నించారు. అంటే అక్కడ తప్పు జరిగిందనేది వారికీ తెలుసనే అనుకోవాలా?  అసలు అంశం అక్కడున్నది బాక్సైటా? లాటరైటా? అన్నది తేల్చాల్సి ఉండడం. మరోవైపు గతంలో ఇచ్చిన గనుల లీజుల్లో ఆయా గనులు ఏయే సర్వే నంబర్లలో ఉన్నాయన్న వివరాలున్నాయి. ఇప్పుడు భమిడికలొద్దిలో ఇచ్చిన గని లీజులో అసలు సర్వే నంబర్లే లేవు.  


5వేల టన్నులకే రూ.15వేల కోట్లా?

ఐదువేల టన్నుల లాటరైట్‌కే అనుమతిచ్చామని చెప్తున్న అధికారులు...మరి రూ.15వేల కోట్ల ఆదాయం వస్తుందన్న ఈ గనుల దందా బినామీ ఒకరు చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే సదరు బినామీ.. ఒక గిరిజన నాయకుడితో మాట్లాడిన ఒక ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అందులో 15ఏళ్లలో రూ.15వేల కోట్ల ఆదాయం వస్తుందని స్పష్టంగా చెప్పారు. అంటే అక్కడేదో మతలబు ఉందనేగా! 


బాక్సైట్‌ మేజర్‌...లేటరైట్‌ మైనర్‌

బాక్సైట్‌ గనులనే లేటరైట్‌గా ఎందుకు అనుమతులిస్తున్నారన్న దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. విశాఖ మన్యంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. బాక్సైట్‌ అంటేనే మన్యం మండిపడుతోంది. అందుకే ఆ పేరు ఎత్తడం లేదేమోనని అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు బాక్సైట్‌ మేజర్‌ ఖనిజం. దీనిపై విధించే ప్రభుత్వ పన్ను అధికంగా ఉంటుంది. అమ్మితే వచ్చే ధర కూడా ఈ పన్నే ఎక్కువ. అదే లేటరైట్‌ అయితే మైన ర్‌ మినరల్‌. పన్ను తక్కువే ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సింది పెద్దగా ఉండదు. కానీ తవ్వేది బాక్సైట్‌ కాబట్టి అమ్మే ధర ఎక్కువ ఉం టుందనేది వాదన. లేటరైన్‌ను సిమెంటు తయారీలో ఉపయోగిస్తారు. బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి ఉపయోగిస్తారు. ప్రభుత్వ ం పారదర్శకంగా ఆ గనిలో ఉన్న ఖనిజాన్ని పరిశీలించి, పర్యావరణ సంబంధిత అంశాలను, రిజర్వుఫారె్‌స్టలో భారీ చెట్లు అడ్డంగా నరికేయడం, కాలిబాటలను రోడ్డుగా వేసేయడం లాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-07-06T09:02:31+05:30 IST