ఆర్నెల్లయినా అంతంతే

ABN , First Publish Date - 2021-12-02T07:53:10+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దళిత బంధు’ అట్టహాసంగా మొదలైనా..

ఆర్నెల్లయినా అంతంతే

  • గాడిన పడని దళిత బంధు
  • వాసాలమర్రిలో వాహనాలతోనే సరి
  • హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఫీల్డ్‌ విజిట్‌లు, మేళాలతో కాలయాపన
  • ఆ 4 మండలాలకు ఏర్పాటుకాని కమిటీలు.. 
  • మార్చినాటికి రాష్ట్రవ్యాప్త అమలుపై సందేహాలు
  • ఉన్న ఉపాధిని వదులుకుని వచ్చి దళిత బంధు కోసం ఎంతోమంది ఎదురుచూపులు


హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దళిత బంధు’ అట్టహాసంగా మొదలైనా.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. దళిత సాధికారత పేరుతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. పథకం ప్రారంభమై సుమారు 6 నెలలు కావస్తున్నా లబ్ధిదారులందరికీఆర్థిక సహాయం అందకపోవడంతో వారు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ దళిత కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి గాను ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై దళిత మేధావులు, కుల సంఘం నాయకులు, దళిత రాజకీయ నేతలతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశమై దశలవారీగా చర్చలు జరిపారు. ముందుగా ప్రతి నియోజకవర్గంలో వంద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్న కేసీఆర్‌.. ఆ తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గం, సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో సంతృప్త స్థాయిలో దళితబంధు వర్తింపజేస్తామన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలకు ముందే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసినా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 79 దళిత కుటుంబాలు ఉండగా.. అందరినీ ఈ పథకానికి ఎంపిక చేశారు. కానీ, ఇప్పటి వరకూ కేవలం 10 మంది లబ్ధిదారులకు సంబంధించిన యూనిట్లు మాత్రమే అందాయి. అవి కూడా భారీ వాహనాలు, ఆటో ట్రాలీలే.


 మరో 30 యూనిట్లు సిద్ధంగా ఉన్నా.. వాటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియక లబ్దిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకర్గంలో ఇంత వరకూ ఒక్క యూనిట్‌ కూడా గ్రౌండ్‌ కాలేదు. అధికారిక లెక్కల ప్రకారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 23,183 దళిత కుటుంబాలు ఉన్నాయి. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. ఆగస్టు 16న శాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆ తర్వాత మొదటి దశలో సుమారు 17 వేల మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. దళిత రక్షణ నిధికి రూ.10 వేలు తగ్గించి రూ.9.90 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. అయితే.. ఖాతాలో నగదు వేసినా, అక్కడ ఇప్పటికీ శిక్షణ కార్యక్రమాలే కొనసాగుతున్నాయి. ఎక్కువగా పాల ఉత్పత్తికి సంబంధించిన దరఖాస్తులు రావడంతో ఆయా గ్రామాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసి బస్సుల్లో దరఖాస్తుదారుల్ని కరీంనగర్‌ డెయిరీకి తీసుకెళ్లి ఫీల్డ్‌ విజిట్‌ చేయిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన దరఖాస్తు దారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాలు నిర్వహిస్తున్నారు.  దరఖాస్తుదారులు కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనాలకు సంబంధించి వాహన డీలర్లతో ఎక్స్‌పోలు ఏర్పాటు చేస్తున్నారు.


కమిటీలేవి..?

వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకర్గం తర్వాత రాష్ట్రానికి నాలుగు దిక్కుల్లోని నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ నాలుగు మండలాలు.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలం,   కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలం.  ఈ నాలుగు మండలాల్లో దళిత బంధు కోసం ఇదివరకే రూ.250 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం సమర్థంగా అమలయ్యేలా చూసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉండగా.. ఆ నాలుగు మండలాల్లో గ్రామ, మండల స్థాయి కమిటీలు కూడా ఇప్పటిదాకా ఏర్పాటు కాలేదు. సీఎం మాత్రం.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి హుజూరాబాద్‌లో ప్రతి కుటుంబానికీ దళిత బంధు నిధులు అందజేస్తామని ప్రకటించారు. మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బు మార్చి నాటికి అందజేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 20 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఈ పథకంపై ఆశపెట్టుకున్న దళిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా.. బతుకు తెరువు  కోసం ఇన్నాళ్లుగా ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లిన వేలాది దళిత కుటుంబాలు ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధును నమ్ముకుని తిరిగి సొంత గ్రామాలకు చేరుకున్నాయి. అలా ఉన్న ఉపాధి వదులుకుని వచ్చిన వారంతా.. ఇప్పుడిక్కడ సరైన ఉపాధి లభించక, దళిత బంధు ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.


ఎన్నో ఆశలు పెట్టుకున్నాం

దళిత బంధు పథకంలో భాగంగా కార్లు కొనుగోలు చేసి ట్యాక్సీలు నడుపుకొందాం అనుకున్నా. కానీ రోజులు గడుస్తున్నా పథకం అమలు ఒక కొలిక్కి రావట్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా దళితుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలూ అమలు చేయలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టడంతో మాలాంటి వాళ్లం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్‌ చేసి ఖాతా లాక్‌ చేశారు. నిరుద్యోగులు సైతం ఈ పథకంపై ఆశలు పెట్టుకున్నారు. గొప్ప పథకాన్ని నీరుగారుస్తున్నారు. కాలయాపన చేయకుండా ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం దళిత బంధును వెంటనే అమలు చేయాలి.

                                                                                          - పుల్లూరి కుమార్‌ (కోరపల్లి గ్రామం)


పూర్తిస్థాయిలో అమలు చేయాలి

దళిత బంధు పథకంతో ట్రాక్టర్‌ కొనుగోలు చేసి మా బతుకు మార్చుకుందాం అనుకున్నా. కానీ అలా జరగట్లేదు. హుజూరాబాద్‌ నియోజకర్గంలో ఎన్నికల కోడ్‌ పేరుతో దళిత బంధుకు బ్రేక్‌ వేశారు. ఆ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. నవంబరు 4న పథకం పునః ప్రారంభం అవుతుందని చెప్పినా ఇప్పటి వరకు అమలు కాలేదు. దళిత బంధు పూర్తిస్థాయిలో అమలు చేయాలి. నిరుద్యోగ యువతను ఆదుకోవాలి.

- కవ్వం యాదగిరి (దేశాయపల్లి గ్రామం)

Updated Date - 2021-12-02T07:53:10+05:30 IST