ఉద్యోగులకు మళ్లీ పాత వేతనాలే

ABN , First Publish Date - 2021-06-22T08:30:49+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు ఊరిస్తూనే ఉన్నాయి. ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది.

ఉద్యోగులకు మళ్లీ పాత వేతనాలే

  • ఊరిస్తున్న కొత్త జీతాలు
  • పాత స్కేళ్ల ప్రకారమే బిల్లులు
  • సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కానందునే..
  • 10 లోపు వ్యత్యాస సొమ్ములు
  • ట్రెజరీస్‌ డైరెక్టరేట్‌ నుంచి ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు ఊరిస్తూనే ఉన్నాయి. ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. తొలుత 30%  ఫిట్‌మెంట్‌ ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించాక నెలలు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత ఫిట్‌మెంట్‌ జీవోలు జారీ కావడంతో జూన్‌ నెలకు సంబంధించి పెరిగిన వేతనం జూలై ఒకటో తేదీన తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఉద్యోగులు భావించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి కూడా పాత వేతనాలే అందనున్నాయి. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖ లు పాత స్కేళ్ల ప్రకారమే బిల్లులు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా శాఖల్లో వేతనాల కసరత్తు పూర్తయింది. జిల్లాల్లో సబ్‌ట్రెజరీ ఆఫీసులు, జంట నగరాల్లో పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసులకు బిల్లులను సమర్పిస్తున్నారు. అయితే కొత్త వేతనాల వ్యత్యాస సొమ్ము మాత్రం జూలై 10 లోపు అందనుంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌.. ఆయా శాఖ ల ఉన్నతాధికారులకు అంతర్గత ఆదేశాలిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి పీఆర్సీ కాలంలో అందాల్సిన డీఏల మొత్తం 30.392 శాతాన్ని వారి మూలవేతనంలో సర్కారు విలీనం చేసింది. దీనికి 30ు ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త స్కేళ్లను నిర్ధారించాల్సి ఉంది.


ఈ వేతనాలను ఎలా నిర్ధారించాలో వివరిస్తూ రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ మార్గదర్శక జీవోలను కూడా జారీ చేసింది. దీనిప్రకారం డ్రాయింగ్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధికారులు(డీడీవో)లు వేతనాలను లెక్కగట్టాలి. కానీ, సచివాలయం నుంచి కేంద్రీకృతంగా ఉండే సెంట్రల్‌ సర్వర్‌లో ఆయా శాఖల వారిగా కొత్త వేతనాలను అప్‌డేట్‌ చేయలేదు. దీనికి ఇంకా సమయం పట్టేలా ఉందని ట్రెజరీ వర్గాలంటున్నాయి. 


అప్‌డేట్‌ కాని సాఫ్ట్‌వేర్‌..

జిల్లాల్లోని డీడీవోలు ప్రతి నెలా 15 నుంచి 25వ తేదీలోపు సబ్‌ ట్రెజరీ ఆఫీసు(ఎ్‌సటీవో)లకు తమ కింద గల ఉద్యోగుల వేతన బిల్లులను సమర్పిస్తుంటారు. అదే జంట నగరాలకు సంబంధించి విభాగాధిపతులు ప్రతి నెలా 22వ తేదీలోపు పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసులకు బిల్లులను సమర్పిస్తారు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంటుంది. హార్డ్‌ కాపీలను ఆయా ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాల్లో సమర్పిస్తారు. ఆ బిల్లులను పరిశీలించి, రిజర్వు బ్యాంకుకు చెందిన ఈ-కుబేర్‌కు బదిలీ చేస్తారు. ఆ బిల్లుల ఆధారంగా ‘నేషనల్‌ ఎలకా్ట్రనిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(ఎన్‌ఈఎ్‌ఫటీ)’ పద్ధతిన ఈ-కుబేర్‌ నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అవుతుంటాయి. కానీ, వేతనాల సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయకపోవడంతో కొత్త వేతనాలు ఒకటో తేదీన అందే పరిస్థితి లేదు. అందుకే పాత వేతనాల ప్రకారమే బిల్లులు చేసి పంపిస్తున్నారు. 

Updated Date - 2021-06-22T08:30:49+05:30 IST