ఒక వీరుని తండ్రి అంతరంగం

ABN , First Publish Date - 2020-06-23T06:50:16+05:30 IST

ఒకపక్క పుత్ర శోకం, మరొక పక్క దేశం కోసం తమ కుమారుడు ప్రాణాలు అర్పించాడన్న గర్వం కలగలిసి ఆ కుటుంబాన్ని ముంచెత్తుతున్నాయి. కొడుకు కర్మకాండలు నిర్వహిస్తూ సాధారణ తండ్రిలా శోకాన్ని ఆపుకోలేకపోయారు...

ఒక వీరుని తండ్రి అంతరంగం

‘ఇది మాకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటు. కానీ దేశరక్షణ బాధ్యతలో సంతోష్‌ వీరమరణం పొందడం నాలో పుత్రోత్సాహాన్ని కల్గించింది. నా జన్మ సార్థకమైంది’.

కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్‌


ఒకపక్క పుత్ర శోకం, మరొక పక్క దేశం కోసం తమ కుమారుడు ప్రాణాలు అర్పించాడన్న గర్వం కలగలిసి ఆ కుటుంబాన్ని ముంచెత్తుతున్నాయి. కొడుకు కర్మకాండలు నిర్వహిస్తూ సాధారణ తండ్రిలా శోకాన్ని ఆపుకోలేకపోయారు కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్‌. మరోపక్క, చిన్నప్పటి నుంచి ఏ ఆశయంతో పెంచారో అదే ఆశయ సాధనలో కుమారుడు ప్రాణాలర్పించినందుకు మనసుకు సర్దిచెప్పుకుంటున్నారు. పాతికేళ్ల కిందట కొడుకుని సైన్యంలోకి పంపి దేశ రక్షణలో బలిదానం ఇచ్చిన ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఉపేందర్‌తో గంటకు పైగా సంభాషించిన తర్వాత, ఒక వీరుని తండ్రి తన కొడుకు గురించి పంచుకున్న విషయాలు ఇలా నలుగురికీ తెలియజేయాలనిపించింది.


సంతోష్‌బాబు వయస్సు నలభైకి దగ్గర. ఆ వయస్సు వారు ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో వర్క్‌ఫ్రం హోమ్‌లో ఉన్నారు. అయితే చదువులో చురుకైన సంతోష్‌ సైన్యంలో చేరి మైనస్‌ డిగ్రీల చలిలో దేశ సరిహద్దుల్లో గస్తీ బాధ్యతల్లో ఉన్నారు. ఇంతగా దేశభక్తి నరనరాల్లో జీర్ణించుకోవడానికి బీజం ఎక్కడ పడింది? ఉపేందర్‌ బ్యాంక్‌ ఉద్యోగంలో చేరక ముందు, ఒకసారి సైన్యంలో చేరాలని ప్రయత్నించి విఫలమయ్యారు. సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని మూడు దశల ఎంపికలో ఒక దశలో నెగ్గలేకపోయారు. అప్పటినుంచి ఆ కసి మనసులో ఉండిపోయింది. బ్యాంక్‌ జాబ్‌లో చేరాక తరచూ బదిలీలు అవుతుండేవి. దీంతో కొడుక్కి కుదురైన చదువు రాదేమోనన్న బెంగ ఆయనను వెంటాడింది. ఆ సమయంలో కోరుకొండ ప్రవేశ పరీక్ష గురించి ఎవరో చెప్పారు. అప్పుడాయన ఆదిలాబాద్‌ జిల్లా లక్సంపేటలో ఎస్‌.బి.హెచ్‌.లో పనిచేస్తున్నారు. ఒకరోజు సెలవు పెట్టి విజయనగరం వెళ్లి తెలిసిన వారి ద్వారా కోరుకొండ సైనిక్‌ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని కలిశారు. అక్కడి చదువుసంధ్యలు, క్రమశిక్షణ, మానసిక, శారీరక వికాసానికి అనుసరించే పద్ధతులు చూపిస్తూ ఆ ఉపాధ్యాయుడు చివరగా ఒక మాట అన్నారు. ‘బయట ఉంటే మీ అబ్బాయి ఎలా ఉంటాడో చెప్పలేను గాని ఇక్కడ చేర్పిస్తే మాత్రం భవిష్యత్తులో చెడిపోడు. ఈ దేశంలో బాధ్యత గల పౌరుడిగా నిలుస్తాడు’ అని. ఈ మాటలు ఉపేందర్‌ హృదయాన్ని తాకాయి. అప్పటివరకు చదువు కోసం అంతదూరం పంపాలా? అన్న మీమాంసలో ఊగిసలాడిన ఉపేందర్‌ నిర్ణయం తీసేసుకున్నారు. పైగా అక్కడ 23 జిల్లాల నుంచి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) పిల్లలు ఉండటంతో విశాల దృక్పథం అలవడుతుందనిపించింది. సంతోష్‌ చేత ఎంట్రన్స్‌ రాయిస్తే సెకండ్‌ ర్యాంక్‌ వచ్చింది. విజయనగరం జిల్లా కోరుకొండ స్కూల్‌లో సంతోష్‌ను చేర్పించడంతో పాటు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసి ఉపేందర్‌ విజయనగరం బదిలీ చేయించుకున్నారు. సంతోష్‌ అక్కడ 6వ తరగతి నుంచి ప్లస్‌ టు వరకు చదువుకున్న ఏడు సంవత్సరాలు ఉపేందర్‌ విజయనగరంలో మూడేళ్లు, పక్కనే ఉన్న విశాఖ జిల్లాలో మరో మూడేళ్లు, మరో సంవత్సరం కాస్త దగ్గరగా విజయవాడ బ్రాంచ్‌లలో పనిచేశారు.


కోరుకొండ స్కూల్‌లో చదువు ముగిసిన తర్వాత దాదాపు విద్యార్థులందరి తర్వాతి అడుగు ఎన్‌.డి.ఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ) వైపే. ఇప్పుడు మరొకసారి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. సంతోష్‌బాబు ఇప్పుడు చిన్నవాడేం కాదు. 17-18 ఏళ్ల వయస్సు. ఉపేందర్‌ కొడుకు అభిప్రాయం తీసుకున్నారు. ‘ఇందులో ఆలోచించేది ఏముంది? ఎన్‌.డి.ఏ. ఎంట్రన్స్‌ రాస్తా’నన్నాడు. ఆ దృఢ నిర్ణయం విన్న తర్వాత, వారు ఇంకేం మాట్లాడలేదు. ఎన్‌.డి.ఏ ఎంట్రన్స్‌లో ఆల్‌ ఇండియా 120 ర్యాంక్‌ వచ్చింది. బంధుమిత్రులందరికీ తెలిసిపోయింది. సంతోష్‌ని సైన్యంలోకి పంపుతున్నామని. ఒక్కగానొక్క కొడుకుని సైన్యంలోకి పంపేస్తారా? అంత అవసరం ఏమొచ్చింది? అంటూ ప్రశ్నలూ, హెచ్చరికలు వినిపించాయి. ఉపేందర్‌, ఆయన భార్య మంజుల బాగా ఆలోచించారు. సంతోష్‌ అభిప్రాయం పదే పదే అడిగారు, మళ్లీ భవిష్యత్తులో డాడీ బలవంతంపై ఆర్మీలోకి వెళ్లాను అని అనుకోకూడదని. సంతోష్‌ మళ్లీ స్థిరమైన స్వరంతో చెప్పారు. ‘సైన్యంలోకి వెళితే శత్రువులతో ప్రాణభయమనేగా అందరూ అనుకొనేది. ఒక విషయం మరిచిపోతున్నారు. శత్రువు దగ్గర ఎలా ఆయుధాలైతే ఉంటాయో - మన చేతిలోనూ ఆయుధాలుంటాయి. మనల్ని మనం రక్షించుకుంటూ దేశాన్ని రక్షించాలి. ఇందులో రిస్క్‌ ఏముంది? అన్నారు. నిజానికి ఉపేందర్‌ ఉద్దేశమూ, సంకల్పమూ అదే.


ఎన్‌.డి.ఎ.లో మూడేళ్ల కోర్సు డిగ్రీతో సమానం. అది పూర్తికాగానే సైనిక, వాయు, నావికా దళాల్లో దేనిలో చేరతారన్న ఛాయిస్‌ అడుగుతారు. సంతోష్‌ ముందు ఎయిర్‌ ఫోర్స్‌లో చేరి యుద్ధ విమానాల పైలెట్‌ కావాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ఆలోచన ఆదిలోనే ఆగిపోయింది. ఆర్మీనే ఎంచుకున్నారు. ఎన్‌.డి.ఏ నుంచి డెహ్రడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీ (ఐ.ఎం.ఏ)కు శిక్షణకు పంపారు. ఐ.ఎం.ఏలో శిక్షణ పూర్తయ్యాక సర్వీస్‌లో కమిషన్డ్‌ ఆఫీసర్‌ (సర్వీసులో చేరిక) హోదా ఇచ్చేటప్పుడు రక్షణ దళాలు తల్లిదండ్రులకు ఇచ్చే ప్రాధాన్యత అపూర్వం. అమ్మానాన్నలను అతిథులుగా ఆహ్వానించి ఫైవ్‌స్టార్‌ సౌకర్యాలు కల్పించి - ఆర్మీ అధికారుల సమక్షంలో ఆఫీసర్‌ హోదా తెలిపే స్టార్‌ చిహ్నాన్ని తల్లిదండ్రులతోనే తమ పిల్లల భుజంపై అలంకరింపజేస్తారు. ఉన్నతాధికారులు చేయాల్సిన ఆ పనిని స్వయంగా తల్లిదండ్రుల చేత చేయించడం వెనుక సందేశం స్పష్టం - ‘మా అబ్బాయిని దేశ రక్షణకై స్వయంగా అంకితం చేస్తున్నాము’ అని. ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ఉపేందర్‌, మంజుల గర్వంతో ఉప్పొంగిపోయారు. నేను ఒకప్పుడు కలగన్న ఆర్మీ ప్రవేశాన్ని సంతోష్‌ నెరవేర్చాడని ఉపేందర్‌ ఎంతో తృప్తి చెందారు.


సంతోష్‌ బాబు చురుకైనవాడు, తెలివైనవాడు. అత్యంత క్రమశిక్షణ చూపడంతో ఆర్మీలో చేరిన 16 ఏళ్లలో వేగంగా ప్రమోషన్లు పొంది కల్నల్‌ స్థాయికి చేరారు. ఈ హోదాను కమాండింగ్‌ హోదా అంటారు. అంటే, ఈ హోదాలో తనతో ఉండే దళాన్ని నడిపిస్తారు, లక్ష్యంవైపు కదిలేలా నాయకత్వం వహిస్తారు. మనం రిస్క్‌గా భావించే ప్రతి సందర్భాన్ని కమాండర్లు ఒక సువర్ణావకాశంగా ఎదురుచూస్తారు. సంతోష్‌బాబు సరిగ్గా అలాంటివారే. పాకిస్తాన్‌ సరిహద్దు గ్రామాలలో ఉగ్రవాద ముష్కరులు విరుచుకుపడినప్పుడల్లా వారిని అడ్డుకునే దళాలలో తాను లేనందుకు బాధపడేవారని ఉపేందర్‌ చెప్పారు. 2007లో ఆ అవకాశం రానే వచ్చింది. ఆయన నియంత్రణ పరిధిలో చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సంతోష్‌ బాబు హతమార్చారు. అప్పుడాయన పొందిన తృప్తి అంతా ఇంతా కాదని ఉపేందర్‌ అంటారు. ఉన్నతాధికారులు సంతోష్‌ సాహసానికి మెచ్చి ఎన్నో ప్రశంసాపత్రాలు, పతకాలు ఇచ్చారు. వాటిని చూసి సంతోష్‌ మురిసిపోయేవారు. మళ్లీ మళ్లీ అలాంటి అవకాశం కోసం కాచుకునే ఉండేవారు. మాతృదేశాన్ని ప్రత్యర్థుల నుంచి రక్షించే మహత్తర ఘడియల కోసం నిరీక్షించేవారు. రిస్క్‌ అనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ వచ్చేది కాదు. శత్రువుకు తనకు ప్రమాదం కలిగించే అవకాశం ఎంత ఉందో అంతకంటే ముందు శత్రువును తాను మట్టుపెట్టే అవకాశం తన చేతుల్లోనే ఉందని తరచు వ్యాఖ్యానించేవారు. అనుకున్నట్టుగానే ఆ అవకాశం గల్వాన్‌ లోయ వద్ద సరిహద్దును ప్రత్యర్థుల నుంచి రక్షించే రూపంలో వచ్చింది. అయితే ఆ ప్రయత్నంలో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. యావత్‌ దేశ ప్రజానీక హృదయాలలో విషాదాన్ని నింపారు.


సంతోష్‌బాబు కల్నల్‌ స్థాయికి ఎదిగినా కుటుంబ బాంధవ్యాలలో ఒదిగిపోయేవారు. ఆర్నెల్లకోసారి నెలరోజుల సెలవులపై ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఉపేందర్‌ కుటుంబం, సతీమణి సంతోషి నాన్నగారు తల్లాడ వెంకటేశ్వర్ల కుటుంబం, సోదరి శ్రీమతి శృతి కుటుంబం ఇలా సమీప అన్ని కుటుంబాలతో సందడే సందడి. తిరుపతి, శ్రీ శైలం ఇలా టూర్లు ప్లాన్‌ చేసి అందరూ కలిసి వెళ్లివచ్చేవారు. సివిల్‌ లైఫ్‌లో వాడు నాకు ఆప్త నేస్తం, మేం క్లోజ్‌ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. ఆ నెలరోజులు ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం అంటారు ఉపేందర్‌. వాడికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏ చిన్న విషయం మర్చిపోయేవాడు కాదు. మేమందరం కలిసి వెళ్లిన టూర్లు, కలిసి జరుపుకున్న ఫంక్షన్స్‌ గురించి తేదీలతో సహా గుర్తుపెట్టుకునేవాడు. వాడికి ఎంత గ్రాస్పింగ్‌ అంటే ఢిల్లీ వెళ్లిన కొత్తలో జి.పి.ఆర్‌.ఎస్‌ మ్యాప్‌ లేకుండా స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయేవాడు అని ఉపేందర్‌ గుర్తు చేసుకున్నారు. 


సైన్యంలోకి వెళ్లిన అందరికీ ఈ పరిస్థితి ఎదురవ్వదు. తమ కుటుంబానికే ఈ విషాదాంతం ఎందుకు ప్రాప్తించిందని ఉపేందర్‌ కుటుంబం భావిస్తోందా?- ‘సాధారణంగా నాకు కన్నీరు రాదు. మావాళ్ళెవరైనా ఎప్పుడైనా ఏడుస్తుంటే కన్నీళ్ళు రాకుండా ఏడ్వమనేవాడిని. అలాంటిది సంతోష్‌ కర్మకాండలు జరుపుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని ఉపేందర్‌ పూడుకుపోయిన గొంతుతో అన్నారు. ‘కోడలిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కానీ గుండె నిబ్బరం చేసుకొని ఆమే మమ్మల్ని ఓదారుస్తోంది’ అన్నారు ఉపేందర్‌. ‘ఇది మాకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటు. కానీ దేశరక్షణ బాధ్యతలో సంతోష్‌ వీరమరణం పొందడం నాలో పుత్రోత్సాహాన్ని కల్గించింది. నా జన్మ సార్థకమైంది’ అన్నారు ఉపేందర్‌. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే యజ్ఞంలో అసువులు బాసిన సంతోష్‌ కుటుంబం వెంట 130 కోట్ల హృదయాలున్నాయి. వారు ఏకాకి కాదు.

యస్‌.వి. సురేష్‌

(సంపాదకులు–ఉద్యోగ సోపానం)

Updated Date - 2020-06-23T06:50:16+05:30 IST