Abn logo
Aug 2 2020 @ 02:33AM

విశాఖలో మరో ఘోరం

  • క్రేన్‌ కుప్పకూలి 11 మంది దుర్మరణం
  • హిందూస్థాన్‌ షిప్‌యార్డులో ప్రమాదం

విశాఖలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్జీ పాలిమర్స్‌తో మొదలైన విషాదాల పరంపర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్ఎల్‌)లో ట్రయల్‌ రన్‌లో ఉన్న భారీ క్రేన్‌ కూలిపోవడంతో... 11 మంది మరణించారు. శనివారం మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు హెచ్‌ఎ్‌సఎల్‌ సిబ్బంది కాగా, మిగిలిన వారు ప్రైవేటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు!


ట్రయల్‌ రన్‌లో ఉండగానే కూలిన క్రేన్‌

గరిష్ఠ సామర్థ్యంతో పరీక్షిస్తుండగా తెగిన లాక్‌లు

బేస్‌మెంట్‌తో విడిపోయి పడిపోయిన క్యాబిన్‌

అందులో ఉన్న పదిమంది అక్కడికక్కడే మృతి

కింద ఉన్న మరొకరు కూడా మృత్యువాత

మృతుల్లో నలుగురు షిప్‌యార్డు సిబ్బంది

క్రేన్‌ బిగించి ట్రయల్‌రన్‌ చేయని ముంబై సంస్థ

స్థానిక సంస్థలతో పరీక్షిస్తుండగానే ప్రమాదం


విశాఖపట్నం/మల్కాపురం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన హెచ్‌ఎస్ఎల్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రయల్‌ రన్‌లో ఉన్న భారీ క్రేన్‌ కుప్పకూలింది. హెచ్‌ఎస్‌ఎల్‌లో భారీ నౌకలను నిర్మిస్తారు. యార్డులో తయారుచేసిన విడి భాగాలను పట్టాలపై కదిలే భారీ క్రేన్ల సాయంతో తీసుకెళ్లి... ఒక్కొక్కటిగా అమర్చుతూ నౌకలను తయారుచేస్తారు. ఈ పనులకోసం జెట్టీలో 70 టన్నుల సామర్థ్యంగల క్రేన్‌ను ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటుకు ఐదేళ్ల క్రితం ముంబైకి చెందిన అనుపమ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ రెండేళ్ల కిందట క్రేన్‌ విడిభాగాలను ఇక్కడికి తీసుకువచ్చి, బిగించేసి వెళ్లిపోయింది. ట్రయల్‌ రన్‌ మాత్రం చేయలేదు. రెండేళ్లు ఎదురుచూసిన అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించే కాంట్రాక్టును... స్థానికంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌, లీడ్‌ ఇంజనీర్స్‌, స్క్వాడ్‌-7 అనే మూడు సంస్థలకు ఇచ్చారు. కొద్దిరోజులుగా ఈ ట్రయల్‌రన్‌ జరుగుతోంది. శుక్రవారం 60 టన్నుల బరువు నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. దీంతో శనివారం 70 టన్నుల బరువుతో క్రేన్‌ గరిష్ఠ సామర్థ్యాన్ని పరీక్షించాలని నిర్ణయించారు. ఉదయాన్నే ఈ కసరత్తు మొదలైంది. క్రేన్‌ పట్టాలపై ముందుకూ, వెనక్కూ కదిలిస్తున్నారు.  భూమికి దాదాపు 40 అడుగుల ఎత్తున్న క్రేన్‌ క్యాబిన్‌లో 10 మంది సిబ్బంది కూర్చుని దానిని పరిశీలిస్తున్నారు. కేబిన్‌ను 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో... 70 టన్నుల బరువును తట్టుకోలేక క్రేన్‌ పట్టు తప్పిపోయింది. ఒకవైపు నుంచి బేస్‌మెంట్‌ పైకి లేచింది. భారీ క్రేన్‌ పెద్ద శబ్దంతో పక్కకు ఒరిగిపోయింది.


అంతకుముందే... క్యాబిన్‌కు, బేస్‌మెంట్‌కు మధ్య సంధానం తెగిపోయింది. క్యాబిన్‌ వేగంగా నేలను గుద్దుకుంది. దీంతో...అందులో ఉన్న పది మంది అక్కడికక్కడే మరణించారు. కింద ఉన్న మరొకరు కూడా చనిపోయారు. ప్రమాదం విషయం తెలియగానే... షిప్‌యార్డు సిబ్బందితోపాటు కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెచ్‌ఎస్ఎల్‌ గేటు దగ్గరకు వచ్చి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో  ఆందోళనకు దిగారు. పోలీసులు కొన్ని మృతదేహాలను వెనుక వైపు నుంచి కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా విశాఖ నగరం, గ్రామీణ ప్రాంతానికి చెందినవారేనని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణకు రెండు కమిటీలు వేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు. హెచ్‌ఎస్ఎల్‌లో ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో ఒక అంతర్గత కమిటీని వేయడానికి చైర్మన్‌ శరత్‌బాబు అంగీకరించారని వివరించారు. ఇది కాకుండా జిల్లా యంత్రాంగం మరో కమిటీని వేసింది.


 మృతులు వీరే...

1) ఐబీసీ వెంకటరమణ(42), వర్క్‌మెన్‌, హెచ్‌ఎస్ఎల్‌

2) సత్తిరాజు(51), వర్క్‌మెన్‌, హెచ్‌ఎస్ఎల్‌

3) జి.జగన్‌మెహన్‌రావు(41), వర్క్‌మెన్‌, హెచ్‌ఎస్ఎల్‌

4) కె.దుర్గాప్రసాద్‌(32), హెచ్‌ఎస్ఎల్‌ ఉద్యోగి

5) ఎంఎన్‌ వెంకటరావు(35), కాంట్రాక్ట్‌ వర్కర్‌, గ్రీన్‌ఫీల్డ్‌

6) డి.చైతన్య(25), కాంట్రాక్ట్‌ వర్కర్‌, గ్రీన్‌ఫీల్డ్‌

7) పి.శివ(35), కాంట్రాక్ట్‌ వర్కర్‌, గ్రీన్‌ఫీల్‌

8) టీవీ రత్నం(43), కాంట్రాక్ట్‌ వర్కర్‌, 

స్క్వాడ్‌ అండ్‌ సెక్యూరిటీ

9) పి.నాగదేవులు(35), కాంట్రాక్ట్‌ వర్కర్‌, లీడ్‌ ఇంజనీర్స్‌

10) పి.భాస్కరరావు(35) కాంట్రాక్ట్‌ వర్కర్‌

మరో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది.


దిగ్ర్భాంతికరం: చంద్రబాబు 

విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కూలి అనేకమంది మృతి చెందారన్న వార్త దిగ్ర్భాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ‘‘ప్రమాద సమయంలో క్రేన్‌ వద్ద 30మంది వరకు ఉన్నారంటున్నారు.వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 
Advertisement
Advertisement
Advertisement