Abn logo
Apr 30 2021 @ 00:00AM

ఈశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకుందాం!

ప్రసిద్ధ వైజ్ఞానికుడు ఐన్‌స్టీన్‌ తన సహచరుడితో కలిసి పరిశోధనల్లో నిమగ్నమై ఉండేవాడు. వారిద్దరూ కలిసి ఏడువందలకు పైగా ప్రయోగాలు చేశారు. ఏవీ సఫలం కాకపోవడంతో ఆయన సహచరుడు నిరాశ చెందాడు. ప్రయోగాలు ఆపేద్దామన్నాడు. అప్పుడు ఐన్‌స్టీన్‌ ‘‘ఇప్పటికి ఏడు వందల దిశల్లో అన్వేషించాం. ఇక మనం అన్వేషించాల్సినవి చాలా తక్కువ. వాటిలో ఏదో ఒక దానిలో విజయం ఉంది’’ అన్నాడు. చివరకు వారికి విజయం లభించింది. సత్యం కోసమైనా, ఈశ్వరుడి కోసమైనా మొదలుపెట్టిన అన్వేషణ సఫలమయ్యేదాకా ఆపకూడదు.


ఒక రామాయణ కథ ఉంది. సీత కోసం శ్రీరాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో వెతుకుతున్నప్పుడు వారికి జటాయువు కనిపించింది. రావణుడి నుంచి సీతను విడిపించే ప్రయత్నంలో తన రెక్కలు విరిగి నిస్సహాయురాలినయ్యానని వారికి చెప్పింది. 

జటాయువును శ్రీరాముడు ఒడిలోకి తీసుకొని ‘‘నన్ను ఏదైనా కోరుకో!’’ అని అడిగాడు. 

‘‘ప్రభూ! మీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏదీ లేదు’’ అంది జటాయువు. 

‘‘జటాయూ! నువ్వు జీవనదానం చెయ్యాలని కోరుకున్నా నీకు ప్రసాదిస్తాను’’ అన్నాడు శ్రీరాముడు.

‘‘ప్రభూ! మీరు నాకు అన్నీ ఇచ్చేశారు. ఇక ఇవ్వడానికి ఏదీ మీ దగ్గర మిగలలేదు. అందుకే మీ నుంచి నేనేదీ కోరుకోను’’ అంది.

ఇది విన్న లక్ష్మణుడికి కోపం వచ్చింది. ‘‘నువ్వు ఒక పక్షివి. క్షుద్రమైన పక్షి బుద్ధితో... మీ దగ్గర ఇవ్వడానికేదీ లేదని భగవంతుడితో ఎంత సంకుచితంగా చెబుతున్నావ్‌!’’ అన్నాడు. 

అప్పుడు జటాయువు ‘‘ఒక సంపన్నుడికి కొడుకు పుడితే అందరికీ మిఠాయిలు పంచుతాడు. కానీ ఆ శిశువుకు మిఠాయి తినిపించడు. అయితే, అతని సంపద స్వతహాగా ఎవరికి చెందుతుంది?’’ అని అడిగింది. 

‘‘అతని పుత్రుడికే కదా ఆ సంపదంతా లభించేది’’ అన్నాడు లక్ష్మణుడు.

‘‘మరి నేను నా తండ్రి ఒడిలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నదంతా నాకు లభించింది. ఇప్పుడు వేరేగా నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఏం మిగిలింది?’’ అని జటాయువు ప్రశ్నించింది.

ఇష్ట దైవంతో తండ్రి, పుత్రుల బంధాన్ని పెనవేసుకొనేలా భక్తి ఉండాలి. అది దాతకూ, యాచకుడికీ ఉండే సంబంధం కాదు. శివ పరమాత్మ అవసరం కల్పానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. ఈ యుగంలో అనుభవజ్ఞుడైన వృద్ధుని సాకార శరీరంలో ఆయన ఉంటాడు. అది కూడా ఆ శరీరం ద్వారా తన పిల్లలైన మానవులతో ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పుకోవడానికే! పతితులను పవిత్రులుగా చేయడానికే! కానీ భౌతిక అవసరాల్లో బందీ అయిన మానవుడు ఆయనకు సమీపంగా వెళ్ళలేని పరిస్థితి. ఈ విషయం గ్రహించి... సాధన మార్గంలో ముందుకు వెళుతూ, తమ అవసరాలను అత్యల్పంగా భావించేవారే పరమాత్మ సామీప్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు.

భగవంతుణ్ణి ‘సర్వవ్యాపి’ అన్నారు. అంటే అనుభవానికి అతీతమైనవాడు. నామరూపాలకు అతీతమైనవాడు. ఆయనే ఈశ్వరుడు. ఆయన అందరికీ పరమ పిత. తన పిల్లలైన మానవులు తన సహాయం లేకుండా తనతో సంబంధాన్ని ఏర్పరచుకోలేరనీ, తనను వెతకలేరనీ ఆయనకు తెలుసు. అందుకే తన నిజమైన ఉనికిని కొందరు అదృష్టవంతులకు అనుభవంలోకి తెస్తాడు. అదే జరగకపోతే ఆయన నిరాకార స్వరూపం గురించి చర్చ ఉండేదే కాదు. ప్రపంచంలో మనుషులు ఒకరిమీద ఒకరు ఆధారపడుతూ ఉంటారు. ఈ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. మరోవైపు ఈశ్వరుడితో కూడా ఇలాంటి సంబంధాలతోనే తమ పనులు జరిపించుకోవాలనుకుంటారు. అలాంటి స్వార్థపరులను పరమాత్మ ఎలా ఇష్టపడగలడు? ‘నేను పరమాత్మకు ఉపయోగపడాలి’ అని మానవులు అనుకోవాలి.

ఒక రోగి ఆరోగ్యవంతుడు కావడానికి ఔషధం, శక్తి, పథ్యం అవసరం. అలాగే మనోవికారాలనే రోగాన్ని నిర్మూలించడానికి ‘సహజ జ్ఞానం’ అనే ఔషధం, ‘సహజ యోగం’ అనే శక్తి, ‘సాంగత్యదోషం నుంచి రక్షించడం’ అనే పథ్యం అవసరం. పరమాత్మతో తండ్రీ, పుత్రుల బంధాన్ని ఏర్పరచుకుంటే... అన్ని చింతల నుంచీ, సమస్యల నుంచీ విముక్తులం అవుతాం. 

నేటి మానవుడు దేవుడిపై నమ్మకం ఉన్నట్టు మాట్లాడతాడు. కానీ ఈశ్వరుడు లేనేలేనట్టు జీవిస్తాడు. చాలామంది భక్తులు కూడా దేవాలయంలో ఈశ్వరుడి ఎదుట ప్రతిజ్ఞలు చేస్తారు. తమ పని కాగానే మరిచిపోతారు. కొంత డబ్బు ఖర్చు చేసి, కానుకలో, ప్రసాదాలో సమర్పించి, తమ బాధ్యత తీరిపోయిందనుకుంటారు. ఈశ్వరుడి మీద పూర్తి నమ్మకం ఉంచి, ఆయనతో సర్వ సంబంధాలూ ఏర్పరచుకుంటే... కర్మలో ఆయన సహాయకారి అవుతాడు. కోరికలకు అతీతంగా ఉంటేనే ఈశ్వరుడితో సంబంధాలను అనుభవంలోకి తెచ్చుకోగలం. 

- బ్రహ్మకుమారీస్‌

9010161616


Advertisement
Advertisement
Advertisement