జలాశయాల వద్ద కొనసాగుతున్న పహారా

ABN , First Publish Date - 2021-07-03T08:12:45+05:30 IST

కృష్ణా నదిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల వద్ద శుక్రవారం మూడో రోజు కూడా పోలీసు పహారా కొనసాగింది.

జలాశయాల వద్ద కొనసాగుతున్న పహారా

సాగర్‌, పులిచింతల, జూరాలలో పోలీసు బలగాలు


నాగార్జునసాగర్‌/చింతలపాలెం, ధరూరు/నాగర్‌కర్నూల్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల వద్ద శుక్రవారం మూడో రోజు కూడా పోలీసు పహారా కొనసాగింది. పులిచింతల, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల వద్ద ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గుంటూరు, నల్లగొండ జిల్లాల ఎస్పీలు, సాగు నీటి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగర్‌ ప్రధాన జల విద్యుత్కేంద్రానికి వెళ్లే మార్గంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 14 మంది ఏఎ్‌సఐలు, 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. జెన్‌ కో ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ వైపు 150 మంది, ఏపీ వైపు 200 మంది బందోబస్తు ఉన్నారు. ప్రాజెక్టుపై నుంచి వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి.


గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు, ఎగువ జల విద్యుత్‌ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆత్మకూర్‌, అమరచింత, మక్తల్‌, దేవరకద్ర, మరికల్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రాజెక్టు మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ జల విద్యుత్కేంద్రాన్ని ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌ పరిశీలించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్కేంద్రం పోలీసు పహారాలోనే ఉంది.

Updated Date - 2021-07-03T08:12:45+05:30 IST