ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్..‌ తస్మాత్‌ జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

ఐదు వేల రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరకు ఎలాంటి ఆధారాలు చూపించకుండానే లోన్‌ వస్తుందంటే, ఎవరైనా ఎగిరి గంతేస్తారు.

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్..‌ తస్మాత్‌ జాగ్రత్త!

ఐదు వేల రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరకు ఎలాంటి ఆధారాలు చూపించకుండానే లోన్‌ వస్తుందంటే, ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు తారుమారైన సందర్భంలో ఈ పూట గడిస్తే చాలు అనే దయనీయ పరిస్థితి చాలాచోట్ల ఉంది. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని మనీ లెండింగ్‌ యాప్స్‌ రెచ్చిపోతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం కరోనా పాండమిక్‌తో దేశవ్యాప్తంగా 41 లక్షల మంది యువత ఉపాధిని కోల్పోయారు.


సరిగ్గా అదే సమయంలో ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చే అప్లికేషన్స్‌ సగటున నాలుగు లక్షల నుంచి పది లక్షల వరకు కొత్త వినియోగదారులను కేవలం రెండు మూడు నెలల్లోనే పొందడం గమనార్హం. అంటే పరోక్షంగా ఉపాధిని కోల్పోయినవారు రోజు గడవడం కోసం ఇలాంటి అప్లికేషన్లలో అప్పులు తీసుకుంటున్నారు.


వైఫై క్యాష్‌, రూపీ ప్లస్‌, స్నాపిట్‌ లోన్‌, ఓకే క్యాష్‌, గో క్యాష్‌, ఫ్లిప్‌ క్యాష్‌, ఇ-క్యాష్‌ వంటి అనేక లోన్‌ యాప్స్‌ ఆర్థికంగా అవసరంలో ఉన్న వారికి వల వేస్తున్నాయి. ఒక ప్రామాణిక విధానం లేకుండా వివిధ యాప్స్‌ భారీగా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అలాగే లోన్‌ విషయంలో చేతికి వచ్చేది అతి కొద్ది మొత్తం మాత్రమే. ఉదాహరణకు.. వైఫై క్యాష్‌ భాగోతం చూద్దాం. లోన్‌ ఇచ్చే మొత్తం రూ. 10,500 అనుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజ్‌ పేరుతో 2,100, జిఎస్‌టి పేరుతో 378 రూపాయలను తగ్గించుకుని కేవలం 8,022 రూపాయలే చేతికిస్తారు. కానీ వడ్డీని మాత్రం 10,500కి వసూలు చేస్తారు.


315 రూపాయల వడ్డీతో కలుపుకుని చెల్లించాల్సిన మొత్తం రూ. 10,815. ఆలస్యం అయితే భారీగా లేట్‌ ఫీజు వసూలు చేయడంతో పాటు ఇక బాధితుడి పరువు తీసే పనిలో ఉంటారు. అధిక శాతం లోన్‌ యాప్స్‌ కేవలం ఏడు నుంచి ఇరవై ఒకటి రోజుల అతి పరిమిత గడువుతో 20 వేల లోపు రుణాన్ని మంజూరు చేస్తూ వినియోగదారులపై గడువు లోపు చెల్లించాలని వత్తిడి తెస్తున్నాయి.


అధిక శాతం చైనావే!

ఇంకా లోతుగా పరిశీలిస్తే, ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అధిక శాతం లోన్‌ యాప్స్‌ చైనాకి చెందినవి. అవి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలను బేఖాతరు చేస్తున్నాయి. కొన్ని యాప్స్‌ అయితే భారతదేశానికి చెందిన మైక్రోఫైనాన్స్‌ యాప్‌ అయిన ‘udhaarload, flipcash‘ వంటి యాప్స్‌కి నకిలీలుగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో నిన్న మొన్నటి వరకూ చలామణి అయ్యాయి. వాటిని ఇటీవల గూగుల్‌ సంస్థ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. మన దేశంలో ఫైన్‌టెక్‌ కంపెనీలు పనిచేయాలంటే తప్పనిసరిగా ఇండియాలో ఉన్న నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. సంబంధిత యాప్స్‌ ఆ మేరకు కొన్ని ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.


పేమెంట్‌ గేట్‌వే లేకుండా

రుణాన్ని మంజూరు చేసే సమయంలో లోన్‌ యాప్స్‌ తప్పనిసరిగా ఒక బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా IMPS సర్వీసుని ఉపయోగిస్తూ రుణ గ్రహీతకు అప్పు ఇవ్వాలి. అలాగే రుణాన్ని వసూలు చేసే సమయంలో కూడా CCavenue, billdesk, payumoney వంటి ఏదైనా పేమెంట్‌ గేట్‌వేని ఉపయోగించాలి. కానీ ఈ యాప్స్‌ దీనికి భిన్నంగా పేటీయం, ఇతర యూపీఐ విధానాల ద్వారా వసూళ్లు చేస్తున్నాయి. వాటికి ప్రామాణికత ఉండదు. నిజంగా రుణం అవసరం అయిన వారే కాదు, గూగుల్‌ ప్లే స్టోర్‌లో ప్రముఖంగా కన్పించడానికీ, తమ రేటింగ్‌ పెంచుకోవడానికీ, యూజర్‌ బేస్‌ పెంచుకోవడానికీ సంబంధిత యాప్స్‌ కొన్ని బోట్స్‌ని కూడా ఉపయోగించి ఇన్‌స్టాల్స్‌ సంఖ్యని, రేటింగ్‌నీ పెంచుకున్నట్లు లోతుగా పరిశీలిస్తే అర్థమవుతోంది. ప్రొఫైల్‌ పిక్‌కీ, పేరుకీ సంబంధం లేకుండా రాండమ్‌గా రివ్యూలు రాసి ఉంటాయి. మామూలు వినియోగదారులు గుడ్డిగా ఆయా రివ్యూలను చదివి సంబంధిత యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నారు.


ఇలా బెదిరిస్తున్నాయి..

లోన్‌ రికవరీ విషయంలో లోన్‌ యాప్స్‌ దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. మొట్టమొదట మీద క్రెడిట్‌ స్కోర్‌ (సిబిల్‌ స్కోర్‌)  గణనీయంగా తగ్గేలా చూస్తామని లోన్‌ యాప్స్‌ ప్రతినిధులు బెదిరిస్తారు. ఆ తరవాత పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌ నకిలీ కాపీలను పంపించి భయభ్రాంతుల్ని చేస్తారు. డబ్బులు చెల్లించకపోతే ఇంటికి పోలీసులను పంపిస్తామని హెచ్చరిస్తారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున నకిలీ సీల్‌తో ఒక సర్క్యులర్‌ బాధితుడికి పంపిస్తారు. అప్పటికీ లోన్‌ తీసుకున్న వ్యక్తి స్పందించకపోతే సిబిఐ నుంచినకిలీ లెటర్‌ సృష్టించి బెదిరిస్తారు. ఇవన్నీ కూడా చట్టబద్ధమైన చర్యలు అన్న భ్రమని రుణ గ్రహీతకు కల్పించడానికి స్టాంప్‌ పేపర్‌ మీద నోటీసులు పంపిస్తారు. అలాగే సంబంధిత యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో రుణ గ్రహీత ఫోన్‌ నుంచి సేకరించిన అడ్రస్‌బుక్‌లోని అతని బంధువులు, స్నేహితులకి వరుసగా వాట్సప్‌ ద్వారా, టెలిగ్రామ్‌ ద్వారా, కొన్ని సందర్భాల్లో ఫోన్‌ కాల్స్‌ ద్వారా వార్నింగ్‌ పంపిస్తారు.


దీంతో బెదిరిపోయిన అతని స్నేహితులు, బంధువులు రుణ గ్రహీతపై వత్తిడి తీసుకువస్తారు. ఆ వత్తిడికి తట్టుకోలేక అతను కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. మహిళల విషయంలో లోన్‌ యాప్స్‌ ప్రతినిధులు మరింత అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. 


గూగుల్‌ నియమాలివి..

 2019 నవంబర్‌లో గూగుల్‌ సంస్థ లోన్‌ యాప్స్‌ విషయంలో కొన్ని నియమాలు విధించింది. 60 రోజుల లోపు కాల వ్యవధిలో తిరిగి చెల్లించాలని వత్తిడి తెస్తూ, భారీ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న యాప్స్‌ని సంబంధిత యాప్‌ డెవలపర్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిన్న మొన్నటి వరకూ అలాంటి యాప్స్‌ ప్లే స్టోర్‌లో కొనసాగుతూ వచ్చాయి. ఇటీవల గూగుల్‌ కొన్నింటిని గుర్తించి ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది.


రిజర్వ్‌ బ్యాంక్‌ ఏం చెబుతోంది?

లోన్‌ యాప్స్‌ రుణ గ్రహీతల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ఉటంకిస్తూ 2020 జూన్‌ 24న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని విధి విధానాలతో ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. తమ దగ్గర ఆర్థిక సాయం పొంది, దాన్ని యాప్స్‌ ద్వారా రుణం ఇచ్చే సంస్థల వివరాలను ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వెబ్‌సైట్లలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది.


అలాగే లోన్‌ యాప్స్‌ కూడా తమ వెనుక ఆర్థికంగా వనరులు సమకూరుస్తున్న బ్యాంకుల సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియపరచాలి. వినియోగదారులకు ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న వ్యవస్థ గురించి సదరు సంస్థలు వినియోగదారులకి అవగాహన కల్పించాలి. ఈ విషయాల్లో ఏమైనా నియమ ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తప్పవని కేంద్ర బ్యాంక్‌ హెచ్చరించింది. అయినా రిజర్వ్‌ బ్యాంక్‌ కళ్లు గప్పి, దాని నియమాలను ఉల్లంఘిస్తూ అనేక లోన్‌ యాప్స్‌ ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి.


బాధితులు ఏం చేయాలి?

సదరు సంస్థలు పంపించే నోటీసులకు మొదట బాధితులు భయపడకూడదు. అలాగే తమ మిత్రులకు, బంధువులకీ సమస్య గురించి వివరించాలి. వేధింపులకి గురిచేస్తున్నట్లు ఆధారాలను సేకరించి పోలీస్‌ కేస్‌ పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా ఇలాంటి విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడటం సరైన పరిష్కారం కాదు. విలువైన జీవితాన్ని ఇలాంటి చిన్న విషయాలకు కోల్పోవడం అంటే మెరుగైన ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ లేనట్లే భావించాలి. తల్లిదండ్రులు, సమాజం ఒక వ్యక్తికి ఇలాంటి నైతిక భరోసా ఇవ్వడం తప్పనిసరి.


    చలామణిలో ఉన్న కొన్ని యాప్స్‌ 

1.Quickcash 

2. kisht 

3. Loan cloud 

4. Instarupee 

5. Flash rupee 

6. Yesrupee

7. Mastermelon 

8. Cashtrain 

9. Getrupee 

10. Epayloan 

11. Panda rupees

12. Icredit 

13. Easyloan 

14. Rupeeclick 

15. Ocash 

16. Cashmap 

17. Snapit 

18. Rapidrupee 

19. Readycash 

20. Loan bazaar

21. loanbro 

22. cash post 

23. Rupergo 

24. cash port 

25. Rs Rush pro

26. fortune bag 

27.  rupee loan

28. robocash

29. cash Tm

30. Udhar loan

31. Credit free

32. wise credit pro


 -నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST