హింస అదుపు కేంద్ర బలగాల బాధ్యత మాత్రమే కాదు: అధీర్ రంజన్

ABN , First Publish Date - 2021-04-07T21:47:49+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో హింసను అదుపు చేయాల్సిన బాధ్యత కేవలం కేంద్ర బలగాలదే కాదని..

హింస అదుపు కేంద్ర బలగాల బాధ్యత మాత్రమే కాదు: అధీర్ రంజన్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో హింసను అదుపు చేయాల్సిన బాధ్యత కేవలం కేంద్ర బలగాలదే కాదని, రాష్ట్ర పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. కోల్‌కతాలో బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, ప్రతీదానికి కేంద్ర బలగాలపై ఆధారపడకూడదని అన్నారు. ఇటీవల పలువురు మహిళా నేతలపై దాడులు, హింసాత్మక ఘటనలు, బూత్‌ల లూటీపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసులు కూడా ఇలాంటివి జరక్కుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


పశ్చిమబెంగాల్‌తో పాటు, మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండగా, ఒక్క బెంగాల్‌లోనే హింసాత్మక ఘటనలు జరగడం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అవగతమవుతుందని అన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు ఘర్షణలతో పరిస్థితిని దిగజారుస్తున్నారని ఆయన విమర్శించారు. భారత ఎన్నికల కమిషన్ శక్తిమేరకు హింసాత్మక ఘటనల అదుపునకు ప్రయత్నిస్తున్నప్పటికీ, చెదురుమదురు హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ సైతం కొన్ని ప్రాంతల్లో చోటుచేసుకున్న హింస, ఘర్షణల్లో పలువురిని అరెస్టు చేసినట్టు ప్రకటించింది. కాగా, 8 విడతల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారంనాడు మూడో విడత పోలింగ్ జరుగగా, ఈనెల 10న నాలుగో విడత పోలింగ్ జరుగనుంది. 

Updated Date - 2021-04-07T21:47:49+05:30 IST