అత్యవసర వాహనాలకే అనుమతి
ABN , First Publish Date - 2021-05-13T08:36:16+05:30 IST
కర్ఫ్యూ నేపథ్యంలో వైద్య, అత్యవసర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన, కొవిడ్ విధుల్లో పాల్గొనేవారి వాహనాలు మినహా మిగిలిన వాటిని నియంత్రించాలని కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సూచించారు
గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఎస్పీ తనిఖీలు
జగ్గయ్యపేట రూరల్, మే 12: కర్ఫ్యూ నేపథ్యంలో వైద్య, అత్యవసర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన, కొవిడ్ విధుల్లో పాల్గొనేవారి వాహనాలు మినహా మిగిలిన వాటిని నియంత్రించాలని కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సూచించారు. బుధవారం కృష్ణాజిల్లా గరికపాడు అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు. తెలంగాణలో లాక్‌డౌన్, ఏపీలో కర్ఫ్యూ అమలులో ఉన్నందున అనుమతి పొందిన వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించాలని, ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణలోకి అనుమతి నిరాకరణ
ఏపీ నుంచి వెళ్తున్న వాహనాలను తెలంగాణ రాష్ట్రం కోదాడ మండలంలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వెనక్కు తిప్పి పంపుతున్నారు. తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 10నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు ప్రభుత్వ, అత్యవసర వాహనాలు తప్ప అనుమతులు లేని వాహనాలను తిప్పి పంపుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామన్నారు. అత్యవసరమైన వారు తెలంగాణ ప్రభుత్వ అనుమతి తీసుకున్న అనంతరమే రాష్ట్రంలోకి రావాలన్నారు. ఏపీ నుంచి తెలంగాణ వెళ్లేందుకు వచ్చిన వాసు మాట్లాడుతూ గత రాత్రి తమ బంధువు హైదరాబాద్‌లో మృతిచెందగా ఆయన స్వగ్రామానికి తరలించి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నామని దానికి సంబంధించిన పత్రాలున్నా అధికారులు అనుమతించటం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉన్నారని, వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు.