17ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన యువతి

ABN , First Publish Date - 2021-01-22T15:46:50+05:30 IST

పాతబస్తీలో 17ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలిక ‘ఆపరేషన్‌ స్మైల్‌’, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌’ బృందాల కృషితో నేడు తల్లిదండ్రుల చెంతకు చేరింది. 2005లో పాతబస్తీ ...

17ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన యువతి

 ఆపరేషన్‌ స్మైల్‌, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బృందాల కృషి

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పాతబస్తీలో 17ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలిక ‘ఆపరేషన్‌ స్మైల్‌’, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌’ బృందాల కృషితో నేడు తల్లిదండ్రుల చెంతకు చేరింది. 2005లో పాతబస్తీ హుస్సేనీఆలంలో తప్పిపోయి రోడ్డుపక్కన రోదిస్తున్న ఓ బాలికను స్థానికులు మియాపూర్‌లోని ఓ అనాథాశ్రమంలో చేర్చారు. ఇందుకు సంబంధించి అప్పట్లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. తాజాగా ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా ఏర్పాటైన యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బృందాలు మియాపూర్‌లోని అనాథాశ్రమంలో ఉన్న బాలబాలికలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. అందులో ఈ బాలికకు సంబంధించి  పూర్వాపరాలు పరిశీలించారు. 2005లో పాతబస్తీ హుస్సేనీఆలం పీఎ్‌సలో నమోదైన మిస్సింగ్‌ కేసుకు లింకు కనిపించి పూర్తి వివరాలు అక్కడి నుంచి సేకరించారు. అప్పట్లో బాలిక తప్పిపోయినట్లు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రుల ఆచూకీ గురించి ఆరా తీశారు. ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు కర్నూలు ప్రాంతంలో ఉన్నారని గుర్తించిన పోలీసులు బాలికకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. పోలీసులు చెప్పిన వివరాలతో పోల్చి చూసుకున్న తల్లిదండ్రులు మియాపూర్‌లో ఉన్న బాలిక తమ కూతురేనని నిర్ధారించుకున్నారు. 17ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కూతురు తిరిగి తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ కూతురిని తమకు అప్పగించిన తెలంగాణ పోలీసు శాఖకు, ముఖ్యంగా ఆపరేషన్‌ స్మైల్‌ సభ్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-01-22T15:46:50+05:30 IST