అయ్యో.. బత్తాయి

ABN , First Publish Date - 2020-04-09T09:08:48+05:30 IST

తోటలో విరగ గాసిన బత్తాయిలు.. టన్నులకొద్దీ దిగుబడులు. రైతుల్లో ఈ సంతోషం మాట అటుంచితే వచ్చిన పంటను ఎలా అమ్ముకోవాలి అనే రంధి పట్టుకుంది. బత్తాయిల ఎగుమతులపై రాష్ట్ర సర్కారు నిషేధం విధించడం, అమ్ముకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవడంతో బత్తాయి

అయ్యో.. బత్తాయి

టన్నుకు రూ.40 వేల నుంచి 

రూ.10వేలకు పడిపోయిన ధర

సర్కారు కొనాలి.. ఎగుమతికి అవకాశమివ్వాలి

ఏదో ఒకటి తేల్చాలని రైతుల డిమాండ్‌

హైదరాబాద్‌లో అమ్మకాలకు కార్యాచరణ ఏదీ

డీజిల్‌ ఖర్చు ఇస్తాం.. అమ్ముకోవాలన్న సర్కారు

నగరంలో విక్రయానికి రైతుల ససేమిరా


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): తోటలో విరగ గాసిన బత్తాయిలు.. టన్నులకొద్దీ దిగుబడులు. రైతుల్లో ఈ సంతోషం మాట అటుంచితే వచ్చిన పంటను ఎలా అమ్ముకోవాలి అనే రంధి పట్టుకుంది. బత్తాయిల ఎగుమతులపై రాష్ట్ర సర్కారు నిషేధం విధించడం, అమ్ముకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవడంతో బత్తాయి మార్కెట్‌  స్తంభించిపోయింది. టన్నుకు రూ.40 వేలు పలకాల్సిన ధర కాస్తా రూ.10వేలకు పడిపోయింది. టన్నులకొద్దీ పండిన బత్తాయిను ఎలా అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో కల్లిపి 60 వేల ఎకరాల్లో బత్తాయి తోటలున్నాయి. బత్తాయి తోటలకు అక్టోబరు, నవంబరు, నెలలు రెగ్యులర్‌ సీజన్‌. ఈ కాలంలో 5లక్షల టన్నుల బత్తాయి ఉత్పత్తి అవుతుంది. బత్తాయికి ప్రస్తుతం కత్తెర కాపు సీజన్‌. ఈ కాలంలో 1.50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో అయ్యే బత్తాయి ఉత్పత్తిలో 98 శాతం ఉత్తరాది రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల నుంచి వ్యాపారులు.. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు వచ్చి బత్తాయిలు కొనుగోలుచేసి వాహనాల్లో తీసుకెళ్తుంటారు. ఏపీలోని కర్నూలు నుంచి వ్యాపారులు వచ్చి నల్లగొండ, గుర్రంపోడు, హాలియా, మిర్యాలగూడ, దేవరకొండ, కొండమల్లేపల్లి ప్రాంతాల్లో అడ్డావేసి బత్తాయి తోటలను గుత్తగా కొనుగోలు చేసేవారు. 

ఎగుమతులు లేక పడిపోయిన ధర  

 రోగ నిరోధక శక్తి ఉంటే కరోనా సోకినా త్వరగానే నయం అవుతుందనే వైద్యుల విశ్లేషణల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరవాసుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్‌-సి మెండుగా ఉండే బత్తాయిలను అందుబాటులోకి తీసుకురావాలని మార్చి 27న సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.  రాష్ట్రంలో పండించే బత్తాయిలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా, ఇక్కడే విక్రయించేలా చేయాలని  ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని 3,500 ప్రాంతాలకు నిత్యం వాహనాలు పంపించి, మొబైల్‌ రైతుబజార్ల ద్వారా పండ్ల విక్రయాలు చేపడతామని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. బత్తాయి ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించడం పంట ధరపై తీవ్ర ప్రభావం చూపింది. ధర నాలుగో వంతకు పడిపోయింది. హైదరాబాద్‌లోని మొబైల్‌ రైతు బజార్లలో పంటను విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని సర్కారు చెప్పినా కార్యాచరణ రూపొందించలేదు. పైగా రైతులంతా హైదరాబాద్‌కు బత్తాయిలను వాహనాల్లో తెచ్చి గల్లీ గల్లీ తిరిగి అమ్ముకోవాలని, వాహనాల డీజిల్‌ చార్జీలను తాము చెల్లిస్తామని ఉద్యానశాఖ అధికారులు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌కు రైతులు బత్తాయి తీసుకొచ్చి అమ్మేందుకు రైతులు మొగ్గుచూపటం లేదు. బత్తాయిలను సర్కారు నేరుగానైనా కొనాలని, లేదంటే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-04-09T09:08:48+05:30 IST