అనాథలే సంతానం.. అభాగ్యులే ప్రాణం

ABN , First Publish Date - 2022-01-17T04:00:43+05:30 IST

అనాథలు కనిపిస్తే చాలు ఆ దంపతులిద్దరూ

అనాథలే సంతానం.. అభాగ్యులే ప్రాణం
ఆశ్రమంలో భోజనం చేస్తున్న వృద్ధులు, అభాగ్యులు

  • సేవే పరామర్ధంగా భార్యాభర్తల అడుగులు 
  • ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ సంస్థ పేరిట సమాజ సేవ


షాద్‌నగర్‌ : అనాథలు కనిపిస్తే చాలు ఆ దంపతులిద్దరూ అక్కున చేర్చుకుంటారు.. రోడ్డు పక్కన పడి వున్న పిచ్చివాళ్లను సైతం చేరదీసి నీడనిస్తారు.. మహిళలకు ఉపాధి కల్పించి బతుకు మార్గాన్ని చూపుతున్నారు. పేదలకు విద్యా బుద్ధులు నేర్పి నిరక్షరాస్యతను రూపుమాపుతున్నారు. వారు సంతానం వద్దనుకొని అనాథలనే తమ పిల్లలనుకున్నారు. సమాజసేవలోనే ఉంటూ ముందుకు సాగుతున్న ఆ దంపతులే డాక్టర్‌ గీత, ఏరువ థోమ్‌సరెడ్డిచిత్తా. వీరు ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ సంస్థ నెలకొల్పి ఉచిత సేవా కార్యాక్రమాలను చేపడుతున్నారు. 

ఈ దంపతులిద్దరు 17ఏళ్ల క్రితం ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ సంస్థను స్థాపించారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి గ్రామంలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఎఫ్‌సీఎన్‌ పేరిట 2019లో ఆశ్రమాన్ని నిర్మించారు. ఈ ఆశ్రమంలో 200 మంది వృద్ధులు, దివ్యాంగులు, బుద్ధిమాంద్యులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారందరికీ నిరంతరం వైద్య సేవలతోపాటు పోషకాహారం అందిస్తున్నారు. పోలీసులు సైతం వారి దృష్టికి వచ్చిన అనాథలను ఈ ఆశ్రమానికే తరలించడం గమనార్హం. 

పేద చిన్నారులను గుర్తించి ప్రైవేటుపాఠశాలలో చేర్పించి విద్య నేర్పిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నతచదువులకు దూరమవుతున్న విద్యార్థులకు అవసరమైన ఫీజులు చెల్లించడంతోపాటు చేతి ఖర్చుల కోసం ప్రతినెలా వారి ఖాతాల్లో రూ.2వేలు జమ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో 2500 మంది విద్యార్థులకు విద్యాభాస్యం చేయిస్తున్నారు. పేద విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, బట్టలను పంపిణీ చేస్తున్నారు. 


ఉచిత వైద్య సేవలు 

ఈ సంస్థ ఆధ్వర్యంలో గ్రహణ మొర్రి బాధితులకు ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఏడేళ్లలో 1500 మందికి ఆపరేషన్లు చేయించారు. ఆస్పత్రి, రవాణా, భోజన ఖర్చులు సంస్థనే భరిస్తుంది. అలాగే మహిళల ఉపాధికోసం ఉచిత కుట్టుశిక్షణ ఇస్తున్నారు. అనంతరం వారికి ఉచిత కుట్టు మిషన్లను కూడా అందజేస్తున్నారు. 


సేవలకు గుర్తింపు 

సంస్థ సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట సంఘ సేవా పురస్కారం దక్కింది. సీఎంకేసీఆర్‌ చేతుల మీదుగా పురస్కారం, రూ.2లక్షల నగదు అందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పురస్కారం అం దించింది. అలాగే నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా)వారు 2018లో సంఘసేవాపురస్కారం అందించింది.


సేవలో సంతోషం 

సేవలో ఎంతో సంతోషం ఉంది. అభాగ్యులు, అనాధలకు సేవ చేయాలన్న ఆలోచన నా 17వ ఏటనే వచ్చింది. ఇంటర్‌ తర్వాత ఎంబీబీఎస్‌ పూర్తిచేశాను. 20 ఏళ్లుగా తాను తన భర్త సమాజ సేవలో నిమగ్నమయ్యాం. దాతలు అందించిన సహాయంతో సంస్థను నిర్వహిస్తున్నాం. అమెరికా నుంచి ఎంతోమంది దాతలు ఆశ్రమ నిర్మాణానికి సహకరించారు. మేము చేరదీసిన 2వేల మంది విద్యార్థులు మా సొంత పిల్లలుగా భావిస్తున్నాం. అందుకే సంతానం వద్దనుకున్నాం. 

- డాక్టర్‌ గీత తోమా్‌సరెడ్డి చిత్తా 


ఇలా ఎవరూ చూసుకోలేదు

ఇంత మంచిగా ఎవరూ చూసుకోలేదు. సమయానికి భోజనం, బట్టలు ఇస్తున్నారు. అందరూ ఉన్నా అనాథలాగా బతికాను. కానీ ఇక్కడికి వచ్చాక తన సొంతింట్లో ఉన్నట్టు ఉంది. రోగం వస్తే డాక్టర్లకు చూపిస్తున్నారు.  

- పార్వతమ్మ 



Updated Date - 2022-01-17T04:00:43+05:30 IST