షూస్‌ కూడా లేకుండా..ఆడడానికి వచ్చావా!

ABN , First Publish Date - 2020-06-08T09:19:36+05:30 IST

కెరీర్‌లో ఈస్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డానని టీమిండియా పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ (32) చెప్పాడు. భారత జట్టులో చోటు...

షూస్‌ కూడా లేకుండా..ఆడడానికి వచ్చావా!

న్యూఢిల్లీ: కెరీర్‌లో ఈస్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డానని టీమిండియా పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ (32) చెప్పాడు. భారత జట్టులో చోటు సంపాదించడానికి ఒక్కో నిచ్చెన ఎక్కుతూ వచ్చానని తెలిపాడు. ‘నాగ్‌పూర్‌లో గల్లీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు నేను యార్కర్లు బాగా వేస్తున్నానని ఎవరో గుర్తించి జిల్లా క్రికెట్‌ సంఘానికి తెలియజేశారు. వాళ్లు నా బౌలింగ్‌ను పరిశీలించి నాగ్‌పూర్‌ జట్టుకు ఆడే అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టా. ఆ తర్వాత వేసవి శిక్షణ శిబిరానికి రమ్మన్నారు. అక్కడికెళ్లగానే కోచ్‌ నీ క్రికెట్‌ షూ ఎక్కడ అని అడిగాడు? షూ కూడా లేవు కానీ, ఆడడానికి వచ్చేశావ్‌ అని అందరి ముందు అవమానకరంగా మాట్లాడాడు. ఆరోజు నేను చాలా బాధపడ్డా. క్రికెట్‌ను వదిలేద్దామని అనుకున్నా. కానీ, పట్టుదలతో చిన్నచిన్న లీగ్‌ల్లో రోజుకు మూడు మ్యాచ్‌లు ఆడి డబ్బు సంపాదించా. షూ, ప్యాడ్లు, బ్యాట్‌ అన్నీ కొనుక్కొని శిబిరానికి వెళ్లా. అక్కడ్నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈస్థాయికి వచ్చా’ అని ఉమేష్‌ తెలిపాడు.


మామిడికాయలు దొంగలించేవాడిని

‘చిన్నతనంలో చాలా అల్లరితనంగా ఉండేవాడిని. రాత్రిపూట అస్సలు నిద్రపోయే వాడిని కాదు. తోటల్లోకి పోయి మామిడికాయలు దొంగలించేవాడిని. స్నేహితులతో కలిసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్లేవాడిని. అయితే, ఆ వయస్సులో కూడా ఏదైనా సాధించాలనే తపన ఉండేది’ అని ఉమేష్‌ చిన్ననాటి సంగతులను చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-06-08T09:19:36+05:30 IST