చిత్రకళాద్రష్ట కొండపల్లి శేషగిరిరావు

ABN , First Publish Date - 2020-07-20T06:31:22+05:30 IST

‘‘గీత నా ప్రాణపల్లవి కాంతికల్పనాక్రాంతిరథము దృక్కు, దృశ్యమ్ము, అమృత దీపమ్ము లిచట మధ్య శూన్యంబు రూప ప్రస్థాన యాత్ర’’...

చిత్రకళాద్రష్ట కొండపల్లి శేషగిరిరావు

త్యాగరాజు సప్తస్వరాల్లో కనుగొన్నదీ, రవీంద్రుడు పరమాత్మలో చూసిందీ, సంజీవదేవ్‌ జీవనం తెలియజెప్పిందీ, శ్రీశ్రీ సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం అన్నదీ, దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ దోసిళ్ళతో తాగి వచ్చిందీ, కొండపల్లి శేషగిరిరావు చిత్రీకరణలో వున్నదీ అంతా సౌందర్యోపాసనమే సౌందర్యారాధనమే.



‘‘గీత నా ప్రాణపల్లవి

కాంతికల్పనాక్రాంతిరథము

దృక్కు, దృశ్యమ్ము, అమృత దీపమ్ము లిచట

మధ్య శూన్యంబు రూప ప్రస్థాన యాత్ర’’

- అని భావించిన కొండపల్లి శేషగిరిరావు విఖ్యాత చిత్రకారులు. బహుముఖ ప్రజ్ఞాశాలురు. కాలాన్ని దోసిట పట్టి రేఖల్లో నిక్షిప్తం చేసిన రసపిపాసి. ఎవని మాటలు బొమ్మలో వాడు కవి. ఎవని బొమ్మలు మాటలో వాడు చిత్రకారుడు. కళాకారులందరూ మానవులే కావచ్చు. మానవులందరూ కళాకారులు కాలేరు. ‘‘అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయసీ, అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి,’’ అని ఓ సినీకవి అనడంలో ఉన్నదీ; చిత్ర తురగన్యాయంలో ఉన్నదీ కళల ప్రాశస్త్యమే (చిత్రంలో గీసిన గుర్రాన్ని చూసి నిజమైన గుర్రంగా భావించి నిజమైన గుర్రం సమీపించడాన్ని చిత్రతురగన్యాయం అంటారు). అలా భ్రమింపచేయగల రేఖానైపుణ్యం, ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగిన చాతుర్యం శేషగిరిరావు లాంటి ఏ కొందరికో అబ్బుతుంది. వారే చరిత్రలో స్మరణీయులవుతారు. 


శేషగిరిరావు గారికి ఇంటా, వంటా లేని చిత్రకళానైపుణ్యం స్వతహాగా అబ్బిన విద్య. ఆనాటి నిజాంప్రభుత్వ ఆర్థికమంత్రి నవాబ్‌ మెహదీ నవాజ్‌ జంగ్‌ అందించిన ఆత్మీయప్రోత్సాహం  ఆయన్ను తెలంగాణలోని మానుకొండ దగ్గర పెనుగొండ గ్రామం నుండి హైదరాబాదుకు తెచ్చింది. ఆ తర్వాత బెంగాల్‌ శాంతి నికేతన్‌లోని ప్రముఖ చిత్రకారులు నందలాల్‌ బోస్‌, దేవీ ప్రసాద్‌ రాయ్‌ చౌదరి లాంటి పెద్దల అంతేవాసిత్వానికి దారి తీసింది. ఆ తర్వాత శేషగిరిరావుకు హైదరాబాదు లలితకళల (Fine arts) కళాశాలల ఆచార్యకత్వంలో వందలాది శిష్యు లను తన ప్రతిబింబాలుగా తయారు చేసే అవకాశం సిద్ధిం చింది. సమకాలీన చిత్రకారుల ప్రశంసలు, జపాను, మలే షియా లాంటి దేశాల చిత్రకారుల మన్నలకు పాత్రమైంది.


త్యాగరాజు సప్తస్వరాల్లో కనుగొన్నదీ, రవీంద్రుడు పరమాత్మలో చూసిందీ, సంజీవదేవ్‌ జీవనం తెలియ జెప్పిందీ, శ్రీశ్రీ సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం అన్నదీ, దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ దోసిళ్ళతో తాగి వచ్చిందీ, కొండపల్లి శేషగిరిరావు చిత్రీకరణలో వున్నదీ అంతా సౌందర్యోపాసనమే సౌందర్యారాధనమే. మానవ నాగరికతా ప్రస్థానంలో లలితకళలది అమేయమైన స్థానం. కదిలే ఊహలకు అక్షరాకృతినిస్తే అది కవిత్వం. కదిలే ఊహలకు నాదాకృతి కలిగిస్తే అది సంగీతం. కదిలే ఊహలకు స్పర్శానుకూల్యాన్ని కలిగిస్తే అది శిల్పం. కదిలే ఊహలకు రేఖాకృతి కలిగిస్తే అది చిత్రలేఖనం. చిత్రాన్ని రచించడం ఒక మధుర సాధన. చిత్రాన్ని చూసి అనందించడం మధురతర సాధన. ఈ రెంటిలోను ఉచ్చస్థాయికి చేరిన మనీషి కొండపల్లి శేషగిరిరావు.You cannot teach philosophy to a hungry అన్నది నిజమే అయినా, man does not live by bread alone అన్నదీ వాస్తవమే. అన్నమయ్య కోశాన్ని సంతృప్తి పరుచు కొన్నాక ఆనందమయ విజ్ఞానమయ కోశాలవైపు చూపు ప్రసరిస్తుంది.


‘‘దురదృష్టవశాత్తు తెలుగువారి జీవితాలనుండి లాలిత్యం అదృశ్యం అయి పోతోంది. ఎంత సేపూ ముదురు రంగులే తప్ప లేత వర్ణాలు, వాటిలోని అనేక ఛాయలు వాటి సొబగులు అర్థం చేసుకోగలిగే వివక్షత, ఆనందించ గల రసహృదయం కరువైపోతుంది,’’ అని కాలగమనాన్ని గుర్తించి విసుక్కొ న్నారు శేషగిరిరావు. వ్యక్తి హృదయంలో రసానుభూతి మేల్కొనకపోతే, వ్యక్తినేత్రాల్లో రసదృష్టి వికసించకపోతే సౌందర్యాస్వాదనలో అసమర్థులవుతారని అంటారు ఆయన. ఆర్థిక సాంఘిక వైజ్ఞానిక రంగాల్లో మనిషి అభివృద్ధి అనివార్యం. కానీ రసానుభూతి తగ్గి వైజ్ఞానిక, భౌతిక దృక్పథాలు హెచ్చితే రసస్పందన లేని శుష్కయంత్రంగా మారిపోతాడు మనిషి. తన చట్టూ వున్న సౌందర్య దీప్తితో స్పందిస్తున్న రంగు, రుచి, రాగం, చలనం వీటితో పొంగుతూ ఉండే చిరంతన లయ జీవితాన్ని మార్దవీకరిస్తుంది. రసానుభూతి మేర మీరితే సదసద్వివేకాన్ని కోల్పోయి ఒక భావావేశపు అప్రయోజనకరమైన స్వప్నద్రష్టగా మారి పోయే ప్రమాదం ఉంటుంది. జీవితంలో వీటన్నింటిని సమన్వయించు కోవాలి. హృదయానికీ, బుద్ధికీ; అనుభూతికీ, ఆలోచనలకూ; ఆవేశాలకూ, అనుభవాలకూ మధ్య ఒక సమన్వయాన్ని, భావసామ్యాన్ని, పరిణతదృక్పథాన్ని సాధించుకోవాలని కొండపల్లి శేషగిరి రావు జీవితం ఇచ్చే సందేశం. 


శేషగిరిరావు సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. గంపెడు సంసారాన్ని ఒద్దికగా ఈదారు. సాధారణంగా కళాకారుల్లో ‘‘హృదయాధిక్యత’’ హేతువుగా కలిగే బల హీనతలకు దూరంగా నిలదొక్కుకొని, నందలాల్‌ బోస్‌ లాంటి ఆదర్శగురువులలో ఉన్న సామర్థ్యాలతోపాటు వారి నిరాడంబర జీవితాన్ని వారసత్వంగా పొందారు. కళకు కేవలం సామర్థ్యం, ప్రతిభగాక, పారమార్థి కతను కూడా జోడించాలని యోగి సాధు శ్రీనివాస శాస్త్రి, కొదమగుళ్ళ జగన్నాథాచార్యులు (వానమా మలై వరదాచార్యుల మామగారు) సాహచర్యంలో ఆధ్యాత్మిక యోగ సాధనలో ఒక మెట్టు ఎక్కారు. 


ఆయన గీసిన బమ్మెర పోతన, గోదాదేవి, అభినవ గుప్తుడు, శకుంతల, పతంజలి, వ్యాసుడు, గణపతి, రావినారాయణరెడ్డి, ఇందిరా గాంధి, రాజీవ్‌ గాంధి లాంటి చిత్రాలు ఎందరి ప్రశంస లనో పొందాయి. మర్రిచెన్నారెడ్డి గారి షష్టిపూర్తి సమయంలో మర్రిచెట్టు ఆకారంలో అరవై అంకె దించి వదిలేశారు. మర్రిచెట్టు కింద మరో మొక్క ఎదగదు. కనుక చెన్నారెడ్డికి ఎదురు అనేదే లేదనీ, ఆయన ఎప్పుడూ విజేతనే అనీ ప్రతీకాత్మ కంగా వేశారు. 1961, 69 రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంలో తెలుగువారికి ప్రాతినిధ్యం వహించే టాబ్లోలను ప్రదర్శించి అప్పటి ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీల మన్ననలకు పాత్రులయ్యారు. చిత్ర కళకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో, పాఠ్యప్రణాళికల నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. వారి వ్యాసాలు ‘శిల్పచిత్రకళారామణీయకం’ పేరిట గ్రంథ రూపం దాల్చాయి. కాకిపడిగెల కళాకారులను వెలుగు లోకి తెచ్చారు. 1924 జనవరి 27 న ప్రారంభమైన కొండపల్లి శేషగిరిరావు చక్కని శ్వేతజీవనచిత్రపటం 88ఏళ్ళపాటు విభిన్నవర్ణ సమ్మిశ్రితమై, ఆకర్ష ణీయంగా కొనసాగి 26 జులై 2012న చిక్కని మృత్యువర్ణాన్ని పులుము కొంది. వారి కుమారుడు కొండపల్లి వేణుగోపాలరావు, కోడలు కొండపల్లి నీహారిణి శేషగిరిరావు జీవిత చరిత్రను, వ్యాసాలను గ్రంథరూపంలో తెచ్చి సాహిత్యలోకంలో శాశ్వతులను చేశారు. 


‘‘చిత్రకారునిగా ఇంతవరకు నా జీవితం ద్వారా నేర్చుకున్న గుణపాఠం ముఖ్యంగా ఒక్కటే. జీవితమంటే కష్టసుఖాలను సమంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగడం. కళ అనేది ఓ యోగం. యోగానికి ఏకాగ్రత ఎంతగా అవసరమో, కళాసాధనకు కూడ అంకితం, ఆరాధన భావం అంతే అవసరం. అలా ఏకాగ్రతతో సాధన చేసిన కళాకారునికి ఆత్మ శాంతి చేకూరుతుంది. అటువంటి శాంతిని ఆనందాన్ని నేను బాగా అనుభవించాను. అసలు కళ లోనే ధర్మార్థకామమోక్షాలున్నాయి. చిత్రకారుడనేవాడు విష్ణుమూర్తి బొమ్మనూ, గడ్డిపరకనూ ఒకే రకమైన ఆరాధన భావంతో చూడగలగాలి’’ అని వారు అంటారు. అదే తాదాత్మ్యంతో జీవించారు. 

(జూలై 26న కొండపల్లి 8వ వర్ధంతి)

వెలుదండ నిత్యానందరావు

94416 66881


Updated Date - 2020-07-20T06:31:22+05:30 IST