Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించిన రవూఫ్

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాక్ తక్కువ పరుగులకే కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ పాక్ బౌలింగ్ దాడిని ఎదుర్కొలేక చతికిల పడింది. మరీ ముఖ్యంగా హరీస్ రవూఫ్ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.


ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. 36 పరుగుల వద్ద మార్టిన్ గప్టిల్ (17) తొలి వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఏ దశలోనూ దూకుడు ప్రదర్శించలేకపోయింది. 

54 పరుగుల వద్ద డరిల్ మిచెల్ (27), 56 పరుగుల వద్ద జేమ్స్ నీషమ్ (1) అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. కాన్వేతో కలిసి జట్టును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.


ఇద్దరు కలిసి నిదానంగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. అయితే పాక్ బౌలర్ల ముందు వారి ఆటలు సాగలేదు. 25 పరుగులు చేసిన విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరగ్గా, 27 పరుగులు చేసిన కాన్వే.. హరీస్ రవూఫ్ బౌలింగులో పెవిలియన్ చేరాడు.


మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఫలితంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 134 పరుగుల వద్ద ముగిసింది. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ నాలుగు వికెట్లు తీసుకోగా, షహీన్ అఫ్రిది, ఇమాద్ వాసిమ్, హఫీజ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement