డిమాండ్లు తీర్చకపోతే రాజీనామాలు

ABN , First Publish Date - 2021-08-01T09:19:18+05:30 IST

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజలు ఏం చేస్తున్నారంటూ తమను ప్రశ్నిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ

డిమాండ్లు తీర్చకపోతే రాజీనామాలు

పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధుల ఐకాస


ఖైరతాబాద్‌ జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజలు ఏం చేస్తున్నారంటూ తమను ప్రశ్నిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని, అయినా ప్రభుత్వం దిగిరాకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధుల ఐకాస హెచ్చరించింది. రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన హక్కులు, అధికారాలు ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం ఉత్సవ మూర్తుల్లా చూస్తున్నదని ధ్వజమెత్తింది. రాష్ట్రంలోని ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఏకమై శనివారం నగరంలో జరిగిన సమావేశంలో ఐకాస (ఐక్య కార్యాచరణ సమితి)గా ఏర్పడ్డారు. అనంతరం పంచాయతీరాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మండల, ప్రజా పరిషత్‌లలో వచ్చే స్టాంప్‌ డ్యూటీలో 25 శాతం గ్రామ పంచాయతీకి, 50 శాత మండల పరిషత్‌లకు, 25శాతం జిల్లా పరిషత్‌లకు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో జిల్లా మినరల్‌ ఫండ్‌ అని ఏర్పాటు చేసి వాటిపై జిల్లా కలెక్టర్‌కు అధికారాలు కట్టబెట్టడం సరైన చర్య కాదన్నారు.


మైనింగ్‌, స్టాంప్‌ డ్యూటీ నిధులు గతంలో మాదిరిగానే తమకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీలకు తమ డిమాండ్ల మేరకు విడుదల చేసిన 500 కోట్ల నిధులను 2 నెలల్లో విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదని వాపోయారు. తమకు గౌరవ వేతనాలను పే రివిజన్‌ కమిషన్‌ ద్వారా 15శాతం పెంచడం ఏమాత్రం సబబు కాదని,  ఎంపీటీసీలకు 15వేలకు, ఎంపీపీ, జడ్పీటీసీలకు 25 వేలకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ కమిటీల్లో ఎంపీపీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తాము హుజూరాబాద్‌లో పోటీ చేస్తామని కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని, అందులో నిజం లేదని, తాము ఎక్కడా పోటీ చేయడం లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు బెల్లం శ్రీనివాస రావు, శైలజా సత్యనారాయణ, సారబండ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-01T09:19:18+05:30 IST